TDP Chief Chandrababu Naidu Comments At Visakhapatnam RaodShow - Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన టీడీపీ

Published Sun, Mar 7 2021 3:01 AM | Last Updated on Sun, Mar 7 2021 11:34 AM

Chandrababu Naidu Comments At Visakha Roadshow - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘ప్రజలు బరితెగించాలి’’ విశాఖలో రోడ్‌షో సందర్భంగా శనివారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు ఇదీ.. ముందురోజు కూడా చంద్రబాబు ఇదేతీరులో ‘‘ఏం పీకుతావ్‌.. గడ్డిపీకుతావా.. నీ అబ్బ జాగీరా..’’ అంటూ తిట్ల వర్షం కురిపించారు. విశాఖలో మాత్రమే కాదు గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇలానే అదుపు తప్పి మాట్లాడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఒకవైపు.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పరాజయం తప్పదన్న వాస్తవం మరోవైపు చంద్రబాబులో తీవ్ర అసహనానికి కారణమయ్యాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పరాజయాల పరంపర ఆ పార్టీని కుదిపేస్తోందని వారు పేర్కొంటున్నారు.. చంద్రబాబు మాత్రమే కాదు శనివారం విజయవాడలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా కూడా ఇలానే అదుపు తప్పి మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ‘‘చంద్రబాబు రోడ్‌ షోలో కేశినేని పాల్గొంటే మేం పాల్గొనం.. మాకు ఏ గొట్టం గాడూ అధిష్టానం కాదు’’ అంటూ వారు నిప్పులు చెరిగారు. విజయవాడలో టీడీపీ నేతల వర్గపోరుగా ఇది కనిపించినా అధినాయకత్వంపై ద్వితీయ శ్రేణి నాయకులు ఎంత చులకనభావంతో ఉన్నారో ఈ వ్యాఖ్యలు రుజువు చేశాయని పరిశీలకులంటున్నారు. పైకి ఎంపీ కేశినేని నానిపై ఆగ్రహించినట్లు కనిపించినా కేశినేనికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారన్న దుగ్థ వారి వ్యాఖ్యలలో కనిపిస్తోందని జనం చర్చించుకుంటున్నారు.

ఇక చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోమారు తనదైన శైలిలో రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక ఫొటోగ్రాఫర్‌పై బాలకృష్ణ చేయిచేసుకోవడం చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నా అనుమతి లేకుండా వీడియో తీస్తావా అని బాలకృష్ణ ఆ ఫొటోగ్రాఫర్‌ చెంప ఛెళ్లుమనిపించారు. బాలయ్య కోపాన్ని చూసి అక్కడున్న టీడీపీ శ్రేణులు కూడా హడలెత్తిపోయారు. హిందూపురంలో మూడురోజులుగా రోడ్‌షో నిర్వహిస్తున్న బాలకృష్ణ తొలిరోజు అక్కడి టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్‌షోకు జనం నుంచి స్పందన లేకపోవడం వల్లే ఆయన అలా కోపగిస్తున్నారని టీడీపీ నాయకులంటున్నారు. జనం రాకపోతే మేమేం చేయగలం అని వారు చర్చించుకుంటున్నారు.. గెలిచే పరిస్థితులు ఏమాత్రం కనిపించక, ఓటమి భయంతో అధినేత నుంచి స్థానిక నాయకుల వరకూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తుండడం విశేషం..

అధినేత ఎందుకిలా...
‘ఏం పీకుతావ్‌.. గడ్డి పీకావా, నువ్వు పోటుగాడివా.., నీ అబ్బ జాగీరా, సీఎం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేస్తున్నాడు, రేపు మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు.. మీరెవరూ ఇళ్లలో నుంచి బయటకు రారా, మీరు ఇంట్లో కూర్చుంటే, మీకోసం మేం పోరాడాలా, మీకు బాధ్యత లేదా’ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలివి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని రోజూ చెప్పే టీడీపీ అధ్యక్షుడు ఇలా పూర్తిస్థాయిలో సంయమనం కోల్పోవడం విచిత్రమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తన స్థాయిని మరచిపోయి దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యంగా మారిందంటున్నారు. ఎంత అసహనం, అభద్రత లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఊహించుకోవచ్చని చాలాకాలం నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు. ఫ్రస్ట్రేషన్‌ అనే పదానికి చంద్రబాబు ప్రస్తుతం తరచూ మాట్లాడుతున్న మాటలే ఉదాహరణలని, ఏమాత్రం సంయమనం లేకుండా, పూర్తిగా బ్యాలెన్స్‌ కోల్పోయి మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. ఒక్కోసారి ఆయన ఏంమాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని విధంగా పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. 

వరుస ఓటముల ప్రభావమే..
తనకు ఎదురే లేదనుకున్న కుప్పంలో ఓడిపోవడం.. సొంత జిల్లా చిత్తూరుపై పూర్తిగా పట్టు కోల్పోవడం.. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దారుణ పరాజయాలు.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వ్యతిరేక గాలి స్పష్టంగా కనబడుతుండడంతో చంద్రబాబు పార్టీ భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రచార సభలు, మీడియా సమావేశాల్లో అస్సలు కంట్రోల్‌ లేకుండా ఇష్టానుసారం తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారని చెబుతున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి ఆయనపై తీవ్రంగా ఉందని చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏమాత్రం ఊహించని విధంగా ఎదురైన ఈ ఓటమి ఆయన్ను కుంగదీసిందని, పార్టీ శ్రేణులు, నాయకులు కూడా దీనిపై ఆందోళన చెందడంతో ఆయన ఇంకా ఆవేదన చెందుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

కర్నూలు ప్రచారంలో ‘రాష్ట్రం కోసం మీరెవరూ రారా, మీరు ఇంట్లో కూర్చుంటే, మీకోసం మేం పోరాడాలా, మీకు బాధ్యత లేదా’ అని ప్రజలపైనే విరుచుకుపడడంతో పక్కనున్న టీడీపీ సీనియర్‌ నేతలు బెంబేలెత్తిపోయినట్లు సమాచారం. తనను తిరుపతి ఎయిర్‌పోర్టులో నిర్బంధిస్తే ఒక్కరు రాలేదని, రాష్ట్రం కోసం తానొక్కడినే పోరాడాలా అంటూ ఏవేవో సంబంధం లేని మాటలు మాట్లాడడంతో టీడీపీ నాయకులు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ గడిపినట్లు చెబుతున్నారు. పోలీసులపైనా శృతి మించిపోయి విమర్శలు చేస్తుండంపై పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

బెజవాడలో నేతల తిట్ల పోటీ 
మరోవైపు విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలవడం కష్టమని అంచనాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమికి ముందే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వీధిన పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేశినేని నాని పై నుంచి కింది వరకు తానే అధిష్టానం అంటున్నాడని, అతన్ని చెప్పు తీసుకుని కొట్టేవాడినని పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తిట్టడం పార్టీలో అసహనం ఏ స్థాయికి చేరిందో సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, పార్లమెంటు అంతా తిరుగుతానని వెంకన్న ప్రకటించుకోవడంతో పార్టీ నాయకులకు ఏం జరుగుతుందో అర్థం కావడంలేదంటున్నారు. కేశినేని నానికి నిజంగా సత్తా, గ్లామర్‌ ఉంటే రాజీనామా చేయాలని, ఇండిపెండెంటుగా గెలవాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్‌ విసరడంతో పార్టీ నాయకులపై చంద్రబాబుకు కంట్రోల్‌ లేదని తేటతెల్లమైందని చెబుతున్నారు. కేశినేని కుల అహంకారంతో మాట్లాడుతున్నాడని, వాళ్ల చెప్పులు ఇంకెన్నాళ్లు మోస్తామని విజయవాడలో ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీ నాయకుడిగా ఉన్న నాగుల్‌ మీరా వంటి నాయకులు తీవ్ర ఆవేదనతో రోడ్డెక్కడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement