చంద్రబాబు జమానాలో.. అంటే ఆయన కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరే.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయారనే విషయం తెలిసిందే. ఏదీ రాకపోతే పోయింది.. కనీసం ఉన్న ఫ్యాక్టరీ కూడా మూతపడటం.. వందలాది కార్మికులు ఆధారపడ్డ ఆ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఆయన కనీస చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రాంతంపై ఆయన నిర్లక్ష్యానికి, వివక్షకు అద్దంపడుతోంది.
కేంద్రంలో నేను చక్రం తిప్పుతున్నా అని పదేపదే చెప్పుకున్న 2001లోనే కుప్పంలోని చిగురుకుంట, బిసానత్తం బంగారు గనులు లాకౌట్ అయ్యాయి. వందలాది కార్మికులు, ఆధారపడ్డ వేలాది మంది జనం రోడ్డున పడ్డారు. కేంద్రం అధీనంలో ఉన్న సంస్థతో మాట్లాడి సమస్యలు పరిష్కరించి ఫ్యాక్టరీ తెరిపించాల్సిందిగా కార్మికులు ఎన్నోమార్లు బాబును బతిమాలుకున్నారు. కానీ కుప్పానికి ‘గెస్ట్’ లీడర్‌గా వచ్చే ఆయనకి కార్మికుల గోడు ఏమాత్రం పట్టలేదు. దీంతో ఇరవై ఏళ్లుగా ఆ ఫ్యాక్టరీ లాకౌట్‌లోనే ఉండిపోయింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్).. ఆ మధ్య ఈ బంగారు గనుల నేపథ్యంపై కల్పిత గాథతో వచ్చిన ఓ కన్నడ సినిమా భారత చలనచిత్ర చరిత్రలోనే ఓ సంచలనం. అయితే వాస్తవంగా కుప్పంకు సమీపంలోని కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కేజీఎఫ్‌కు బంగారపు ముడి పదార్థం వెలికి తీసి మూడు దశాబ్దాలపాటు అందించింది మన గుడుపల్లె మండలంలోని చిగురుకుంట, బిసానత్తం గనులే. దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశానికే తలమానికంగా ఓ వెలుగు వెలిగిన ఆ గనులు బాబు జమానాలోనే మూతపడ్డాయి.
గుడుపల్లె మండలంలోని బిసానత్తం గనిని ఎంఈసీఎల్(మినరల్ ఎక్సప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్) 1968లో ప్రారంభించగా, చిగురుకుంట గనిని 1978లో ప్రారంభించింది. ఈ సంస్థలు క్వార్డ్జ్(బంగారు ముడిపదార్థం) వెలికి తీసి బీజీఎంఎల్(భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్) సారథ్యంలో ఉన్న కర్ణాటకలోని కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్)కి అందజేస్తూ వచ్చాయి. కాలక్రమేణా ఎంఈసీఎల్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో ఆయా గనులను కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ అయిన బీజీఎంఎల్ 1982లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 19 సంవత్సరాల పాటు నిరాటంకంగా బంగారు ముడి ఖనిజం వెలికితీత కొనసాగింది.
కేజీఎఫ్ నష్టాల సాకుతో..
2000 సంవత్సరంలో కేజీఎఫ్‌లోని చాంపియన్ గని నష్టాల్లో కూరుకుపోవడంతో మూతపడింది. కేజీఎఫ్ నష్టాల సాకుతో అప్పట్లో కొంతమంది మన రాష్ట్రంలోని చిగురుకుంట, బిసానత్తం గనులు కూడా భవిష్యత్తులో నష్టాల్లో కూరుకుపోతాయని లెక్కలు చూపడంతో అప్పటికి లాభాల్లోనే ఉన్న ఆయా గనులను అర్ధంతరంగా (2001 జనవరి 15న) లాకౌట్ చేశారు. దీంతో ఆయా గనుల్లో బంగారం వెలికి తీసే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఫలితంగా బిసానత్తం గనిలో పనిచేస్తున్న 500 మంది, చిగురుకుంట గనిలో పనిచేస్తున్న మరో 1000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
బాబు ఎందుకు పట్టించుకోలేదో..?
సరిగ్గా అప్పుడే బాబు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.. కేంద్రంలో చక్రం తిప్పుతున్నానంటూ గొప్పకుపోయిన కాలమది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఒకే ఒక పెద్ద ఫ్యాక్టరీ మూత పడి కార్మికులు రోడ్డున పడితే బాబు తీవ్రంగా స్పందిస్తారని అందరూ ఆశించారు. కేంద్రంతో మాట్లాడి.. బీజీఎంఎల్(భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్)తో చర్చలు జరిపి ఫ్యాక్టరీలు తెరిపిస్తారని భావించారు. కానీ ఆయన ఈ విషయమై కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం.
టెండర్ పూర్తయినా ప్రారంభం కాని పనులు
విచిత్రమేమిటంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఫ్యాక్టరీలు తెరిచే సన్నాహాలకు బ్రేక్ పడ్డాయి. జియో సంస్థ నివేదిక ఆధారంగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఆయా గనులకు సంబంధించి బిడ్‌లను ఆహ్వానించింది. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలను తోసిపుచ్చుతూ ప్రభుత్వ రంగసంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్( ఎన్‌ఎండీసీ) బిడ్‌ను దక్కించుకుంది. దీంతో త్వరలోనే కంపెనీలు ప్రారంభమవుతాయని, మళ్లీ తమకు ఉపాధి లభిస్తుందని కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ ఫ్యాక్టరీ తలుపులు తెరుచుకోలేదు.
► రెండు దశాబ్దాలుగా గనుల మూతతో ఆ ప్రాంతంలోని భారీ జనరేటర్లు, లిప్టులు, ట్యాంకులు, మోటార్లు తుప్పుపట్టాయి. ఈ రెండు గనుల ప్రాంతాల్లో 8 సొరంగ మార్గాలు ఉన్నాయి. ఇందులో రెండు బంగారు ముడి ఖనిజం బయటికి తీయడానికి.. మిగతా 6 కార్మికుల రాకపోకలు, వ్యర్థాలు బయటకు తీయడానికి వినియోగించేవారు. ప్రస్తుతం సొరంగ మార్గానికి వినియోగించే భారీ టవర్లు తుప్పుపట్టి ఎందుకూ పనికి రాకుండా పోయాయి.
బాబు అస్సలు పట్టించుకోలేదు
2001 సంక్రాంతి వేళ గనుల కార్మికుల జీవితాల్లో చీకటి అలుముకుంది. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును అతికష్టం మీద కలిసి ఎలాగోలా ఫ్యాక్టరీలు తెరిపించాలని వేడుకున్నాం. కానీ ఇన్నేళ్ల కాలంలో అస్సలు పట్టించుకోలేదు.
– సుబ్రమణ్యం, కార్మికుడు, చిగురుగుంట ఫ్యాక్టరీ
వైఎస్సార్ హయాంలో మళ్లీ సర్వే
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ ఆ కార్మికుల ఆశలకు ఊపిరివచ్చింది. వైఎస్సార్ హయాంలోనే ఆస్ట్రేలియాకి చెందిన ఓ కంపెనీ ఈ ప్రాంతంలో సర్వే చేసింది. బంగారు నిక్షేపాల లభ్యత ఏమేరకు ఉందని పరిశీలించేందుకు 40బోర్లతో డ్రిల్లింగ్ చేపట్టి.. శాంపిల్ కూడా సేకరించింది. ఇక్కడి నిక్షేపాల్లో బంగారు శాతం 60నుంచి 70 వరకు ఉందని తేల్చింది. ఆ మేరకు నివేదిక అందించింది. అయితే 2009లో మహానేత వైఎస్ హఠాన్మరణంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సర్వే చేపట్టాలని మైసూరుకు చెందిన జియో సంస్థను 2011లో ఆదేశించింది. ఆ మేరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చి కేంద్రానికి నివేదిక అందజేశారు.
లోక్‌సభలో ప్రస్తావించా
కుప్పం పట్ల చంద్రబాబు అంతులేని నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ బంగారు గనులే. కేజీఎఫ్ మూతపడటంతో ఇవి కూడా మూతపడాలని ఎందుకనుకున్నారో ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నేను లోక్‌సభలో ఆయా గనుల పునరుద్ధరణను ప్రత్యేకంగా ప్రస్తావించా. త్వరలో ఎన్‌ఎండీసీ అధికారులతో కూడా మాట్లాడి మళ్లీ గనులను తెరిపించేందుకు శక్తివంచన లేని కృషి చేస్తాం. – రెడ్డెప్ప, చిత్తూరు ఎంపీ
కచ్చితంగా గనులు తెరుస్తాం
2018లో మేం బిడ్ దక్కించుకున్న మాట వాస్తవమే. అయితే కొన్ని సాంకేతికపరమైన, పాలనాపరమైన, న్యాయపరమైన సమస్యల వల్ల పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ కొలిక్కి వస్తున్నాయి. కచ్చితంగా త్వరలోనే గనులు మొదలవుతాయి.
– జయ ప్రకాష్, ఎన్‌ఎండీసీ డీజీఎం
Comments
Please login to add a commentAdd a comment