
సాక్షి, అమరావతి: కమీషన్ల దాహంతో అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన పాపాలే నేడు పోలవరం ప్రాజెక్టుకు శాపాలుగా పరిణమించాయి. పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునేందుకు కేంద్రం విధించిన అన్ని షరతులకు నాడు చంద్రబాబు అంగీకరించారు. కేంద్ర ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి ఎల్కే త్రివేది ఇప్పుడు వాటినే గుర్తు చేస్తూ 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి ఆమోదించాలంటూ కేంద్ర జల్ శక్తి కార్యదర్శి యూపీ సింగ్‌కు ఈనెల 12న లేఖ రాశారు. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరంపై ఏపీ ప్రభుత్వం రూ.4,730.71 కోట్లు ఖర్చు చేసిందని, ఆ తర్వాత రూ.8,614.16 కోట్లు రీయింబర్స్ చేశామని, ఇంకా రూ.7,053.74 కోట్లను రీయింబర్స్ చేయాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖను పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్‌కు పంపిన కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అంచనా వ్యయాన్ని నిర్ధారించి పంపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ లేఖపై అభిప్రాయాన్ని తెలియచేయాలని పీపీఏ సీఈవో కోరగా తక్షణమే పీపీఏ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2017–18 ధరల ప్రకారం పోలవరం నీటిపారుదల విభాగం అంచనా వ్యయాన్ని రూ.43,164.83 కోట్లుగా నిర్ధారిస్తూ సెపె్టంబరు 21న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆమోదించారని గుర్తు చేస్తూ.. ఆ మేరకే నిధులు విడుదల చేయాలని పీపీఏ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బాబు కమీషన్లకు బలి...
చంద్రబాబు అధికారంలో ఉండగా పోలవరం నిర్మాణా బాధ్యతలను దక్కించుకునేందుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోలవరాన్ని చంద్రబాబు కమీషన్ల కోసం ఏటీఎం మాదిరిగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని మోదీనే వ్యాఖ్యానించారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో ఊహించవచ్చు. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం పనుల్లో నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని కేంద్రం విధించిన షరతుకు నాడు చంద్రబాబు అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు 2017 మార్చి 15న నాటి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అప్పుడు కేంద్ర కేబినెట్‌లో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరిలు దీనిపై నోరుమెదపకపోవడం గమనార్హం. మరోవైపు 2018 డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయకుంటే అప్పటిదాకా విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామన్న షరతుకు కూడా అంగీకరిస్తూ చంద్రబాబు సంతకం చేశారు.
మూడేళ్ల మొద్దు నిద్ర తరువాత..
2015 మార్చి 12న తొలి సర్వసభ్య సమావేశంలో తాజా ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయ ప్రతిపాదనలను తక్షణమే ఇవ్వాలని నాటి పీపీఏ సీఈవో దినేష్‌కుమార్ కోరారు. అయితే గత సర్కారు 2017 ఆగస్టు 17న రూ.57,980.87 కోట్లతో పీపీఏ ద్వారా సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)కి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలు పంపడంలో టీడీపీ సర్కార్ తీవ్ర జాప్యం చేసింది.
నేడు ఆ పాపాల ప్రక్షాళన...
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నిపుణుల కమిటీతో పోలవరం పనులను పరిశీలించి కమిటీ నివేదిక ఆధారంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో దర్యాప్తు చేయించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను మిగిల్చారు. పోలవరం పనుల్లో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని కేంద్ర జలసంఘం సభ్యులు హెచ్‌కే హల్దార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ, పీపీఏ సీఈవో సైతం కేంద్రానికి నివేదిక ఇచ్చారు. కాగా 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ 2019 ఫిబ్రవరి 11న సూత్రప్రాయంగా ఆమోదించింది. సీడబ్ల్యూసీ నివేదికపై పలుమార్లు చర్చించిన ఆర్‌సీసీ (సవరించిన వ్యయ కమిటీ) 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్రంతో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాన్ని బహిర్గతం చేస్తూ ఇక నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులను కేంద్రం విడుదల చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. దీంతో 2013–14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లుగానూ, 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా మార్చి 6న ఆర్‌సీసీ నిర్ధారించి ఆమోదించింది. ఇందులో జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు వ్యయం రూ.4,560.91 కోట్లు పోనూ నీటిపారుదల విభాగం వ్యయం 2013–14 ధరల ప్రకారం 20,398.61 కోట్లు, నీటి సరఫరా వ్యయం రూ.4,068.43 కోట్లు వెరసి రూ.24,467.04 కోట్లు.. 2017–18 ధరల ప్రకారం నీటిపారుదల విభాగం వ్యయం(హెడ్ వర్క్స్, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయం రూ.35,950.16 కోట్లు) నీటి సరఫరా(కాలువలు, పిల్ల కాలువలు) వ్యయం రూ.7214.67 కోట్లు) వెరసి రూ.43,164.83 కోట్లని తేలి్చంది. 2019–20 ఎస్‌ఎస్‌ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) అమల్లో ఉన్న నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇవ్వాలని సూచిస్తూ ఇచి్చన నివేదికను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ సెప్టెంబరు 21న యథాతథంగా ఆమోదించారు.
వారంలో పీపీఏ సమావేశం!
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు మరో వారం రోజుల్లో పీపీఏ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.43,164.83 కోట్లుగా నిర్ధారిస్తూ ఆర్‌సీసీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి ఆమోదించారని గుర్తు చేస్తూ ఆ మేరకే నిధులు రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు తీర్మానం పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.4730.71 కోట్లు, కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.8,614.16 కోట్లు పోనూ ఇంకా రూ.29,819.96 కోట్లను రీయింబర్స్ చేయాల్సి ఉందని కేంద్ర జల్ శక్తి శాఖకు స్పష్టం చేయాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment