‘స్కిల్’ కుంభకోణంలో వెలుగులోకి సరికొత్త విషయాలు.. నిగ్గు తేల్చిన ఈడీ
విదేశీ కంపెనీలకు నిధుల మళ్లింపుపై పక్కా ఆధారాలు
షెల్ కంపెనీల అధిపతులు.. నిధుల మళ్లింపులో వారి పాత్ర నిర్ధారణ
కుంభకోణంతో వీరికున్న సంబంధం బట్టబయలు
నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ కోసం ప్రాజెక్ట్
2015లో చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం
సీమెన్స్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినయ్ ఖన్వీల్కర్ కీలక పాత్ర
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,281.40 కోట్లు
ఇందులో 90 శాతం సీమెన్స్, డిజైన్ టెక్.. 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రాజెక్ట్ రూపకల్పన
ఈ మేరకు ఆ కంపెనీలు రూ.2,951 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వని వైనం
అయినా నాటి చంద్రబాబు ప్రభుత్వం తన వాటాగా రూ.330 కోట్లు చెల్లింపు
ఆ నిధులన్నీ వివిధ షెల్ కంపెనీల ద్వారా తిరిగి ప్రభుత్వ పెద్దలకు చేరిన వైనం
ఇప్పటి వరకు సాగిన దర్యాప్తులో రూ.151 కోట్ల మేర నిధుల మళ్లింపుపై ఆధారాలు
హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం ఎలా మొదలైంది.. నిధులు ఎలా మళ్లించారు.. ఎంత మొత్తంలో మళ్లించారు.. అందులో ఎవరెవరు ఉన్నారు.. ఎన్ని సూట్‌కేస్ కంపెనీలు ఏర్పాటు చేశారు.. ఏ ఏ దేశాల్లో ఆ కంపెనీలున్నాయి.. ఆ కంపెనీల ప్రతినిధులు ఎవరు.. వారికి, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును నడిపిన వ్యక్తులకు మధ్య సంబంధం ఏమిటి.. మళ్లించిన నిధులను తిరిగి ఎలా నగదు రూపంలో తీసుకున్నారు.. ఇలా పలు కీలక విషయాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ద్వారా పూసగుచ్చినట్లు బట్టబయలు అయ్యాయి. ఇకపై సాగనున్న దర్యాప్తులో ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దల పాత్ర నిగ్గు తేలనుంది.
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కనుసన్నల్లో సాగిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈడీ సాగించిన దర్యాప్తులో మొత్తం రూ.151 కోట్ల మేర నిధులను పలు కంపెనీలకు మళ్లించినట్లు తేలింది. ఇందులో విదేశీ కంపెనీల ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలను సేకరించింంది.
ఈ వివరాలన్నింటినీ ఇటీవల ఓ కేసులో హైకోర్టు ముందు ఉంచింది. ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించి, ఆ నిధులను తిరిగి డబ్బు రూపంలో ఎలా పొందారో ఈడీ తన కౌంటర్‌లోసు స్పష్టంగా వివరించింది. ఇప్పటి వరకు ఈడీ తన దర్యాప్తును ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు పరిమితం చేసింది. దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో ఇకపై స్కిల్ కుంభకోణంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై దృష్టి సారించనుంది.
అసలు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఎలా మొదలైంది.. ఏకపక్ష నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు.. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర, ఆయన జోక్యం, ఇతర అధికారుల పాత్రపై ఈడీ పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టనుంది. మళ్లించిన ప్రజాధనం చివరకు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ ఇప్పటికే ప్రాథమికంగా తేల్చిన నేపథ్యంలో ఈడీ ఈ అంశంపై కూడా లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది.
ఇదీ కుంభకోణం..
నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చేందుకు 2015లో చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినయ్ ఖన్వీల్కర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందం ప్రకారం శిక్షణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను డిజైన్ టెక్ అందించాలి.
⇒ ఈ ప్రాజెక్టులో మొత్తం ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో క్లస్టర్‌ను రూ.546.84 కోట్లతో ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం మొత్తం వ్యయం రూ.3,281.40 కోట్లు. ఇందులో 90 శాతం నిధులు.. అంటే రూ.2,951 కోట్లను సీమెన్స్, డిజైన్ టెక్ భరిస్తాయి. మిగిలిన 10 శాతం అంటే రూ.330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
⇒ అయితే సీమెన్స్, డిజైన్ టెక్‌లు తమ వాటా నిధులను ఇవ్వక ముందే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.330 కోట్లను ఆ కంపెనీలకు ఇచ్చేసింది. ఇదంతా కూడా అప్పటి మంత్రి మండలి ఆమోదం లేకుండానే జరిగిపోయింది. చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కిక్కురు మనకుండా ఆయన చెప్పినట్లు చేసేశారు.
⇒ ఇదిలా ఉండగా 2018లో షెల్ కంపెనీ అయిన ఏసీఐ.. (అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏసియా) లిమిటెడ్) నకిలీ బిల్లులు, ఇన్వాయిస్‌లు తయారు చేసి పలువురికి లబ్ధి చేకూరుస్తున్నట్లు జీఎస్‌టీ అధికారులు గుర్తించారు. సుమన్ బోస్ తదితరులు తమ అక్రమ కార్యకలాపాలకు ఈ ఏసీఐ కంపెనీని వాడుకున్నారు. 2019లో ఈ మొత్తం కుంభకోణం గురించి పుణేకు చెందిన ఓ సామాజిక కార్యకర్త అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
⇒ ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో జరిగినట్లు తేలింది. దీంతో ఆయన్ను ఏ1గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు మొదలు పెట్టింది. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో స్కిల్ కుంభకోణంలో సీఐడీ తన దర్యాప్తును పక్కన పెట్టేసింది. అయితే ఈడీ తన దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది.
స్కిల్ కుంభకోణానికి సంబంధించి హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన కౌంటర్ , సింగపూర్ కంపెనీలకు, యూకే బేస్డ్ కంపెనీలకు నిధుల మళ్లింపు ఇలా
డిజైన్ టెక్ నుంచే నిధుల మళ్లింపు మొదలు..
⇒ దర్యాప్తులో భాగంగా ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలను ఈడీ విశ్లేషించింది. డిజైన్ టెక్ నుంచి పొందిన నిధుల్లో దాదాపు రూ.58 కోట్లను స్కిల్లర్ ఎంటర్‌ప్రైజస్, ఆ తర్వాత ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. అక్రమ పద్ధతిలో వచ్చిన డబ్బును పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు స్కిల్లర్ కంపెనీ వ్యవహారాలు చూసే వ్యక్తి శిరీష్ షా ఈడీ విచారణంలో అంగీకరించారు.
⇒ స్కిల్లర్ నుంచి వచ్చిన సొమ్ముతో స్కిల్ డెవలప్‌మెంట్ సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి వస్తువులను గానీ, సేవలను గానీ అందించలేదు. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ నిధులను డిజైన్ టెక్ కంపెనీ స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్‌కు, స్కిల్లర్ తిరిగి ఆ నిధులను ఏసీఐకి బదలాయించినట్లు ఈడీ తేల్చి చెప్పింది. నిధుల మళ్లింపుకు సహాయ పడిన వారి వాంగ్మూలాలను ఈడీ రికార్డ్ చేసింది. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, వస్తువులు, సేవలు.. ఏవీ అందించలేదని వారు అంగీకరించారు. నకిలీ, కల్పిత పర్చేజ్ ఆర్డర్లు, ఇన్వాయిస్‌లు, తప్పుడు బిల్లులు సృష్టించినట్లు కూడా వారు ఈడీ ఎదుట ఒప్పుకున్నారు.
⇒ ఏసీఐ నుంచి వచ్చిన నిధులను నగదు రూపంలో మార్చినట్లు కూడా వారు అంగీకరించారు. ఈ విషయాలన్నింటినీ ఎంట్రీ ప్రొవైడర్లయిన యోగేశ్ గుప్తా, మనోష్ కుమార్ జైన్ ఈడీ వద్ద నిర్ధారించారు. ఈ షెల్ కంపెనీలేవీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తో సంబంధం ఉన్న కంపెనీలు కాదని కూడా ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది.
⇒ ఈ గొలుసు లావాదేవీల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని యోగేశ్ గుప్తా, ముకుల్ అగర్వాల్‌కు అందచేసినట్లు సావన్ జాజూ ఈడీకి తెలిపారు. నగదు విషయంలో ముకుల్ చంద్ర అగర్వాల్.. యోగేశ్ గుప్తా వద్దకు వెళ్లినట్లు కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. బ్యాంకు ఖాతాల ద్వారా వచ్చిన నిధులను నగదు రూపంలో వీరు అందుకున్నట్లు కూడా స్పష్టమైంది.
⇒ ఏసీఐ మాత్రమే కాకుండా ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాట్రిక్ ఇన్‌ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రో వెస్ట్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్‌లను నిధుల మళ్లింపు కోసం వాడుకున్నారు. ఇందుకు బోగస్ బిల్లులను చూపారు. తద్వారా స్కిల్లర్ నుంచి నేరుగా ని«ధులు పొందారు. ఇలా ఇప్పటి వరకు రూ.151 కోట్ల మేర నిధులను మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
ప్రజా ధనాన్ని మళ్లించేందుకే స్కిల్లర్ ఏర్పాటు
స్కిల్లర్ తనకొచ్చిన నిధుల్లో నుంచి కొంత భాగం ముకుల్ అగర్వాల్‌కి చెందిన నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించింది. అక్కడి నుంచి ఆ నిధులు ముకుల్ చంద్ర, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి, అతని నియంత్రణలో పని చేసే కంపెనీల ఖాతాల్లోకి చేరాయి. ముకుల్ చంద్ర అగర్వాల్ పలు కంపెనీలు ఏర్పాటు చేశారు. వాటన్నింటిపై తనకు నియంత్రణ ఉండేలా చూసుకున్నారు.
ప్రభుత్వానికి చెందిన అత్యధిక భాగం నిధులు ఈ కంపెనీల మధ్యే సర్కులేట్ అయ్యాయి. సుమన్ బోస్ అవసరాల కోసమే ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ముకుల్ చంద్ర అగర్వాల్ ఈడీ ముందు అంగీకరించి, ఆ మేరకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే సుమన్ బోస్ తన విదేశీ బ్యాంకు ఖాతాలను మూసేశారు.
దీనిపై కూడా ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. పలు విదేశీ కంపెనీలతో బోస్‌కు సంబంధాలున్నాయన్న విషయం కూడా ఈడీ దర్యాప్తులో తేలింది. నేరపూరిత చర్యల ద్వారా బదలాయించిన మొత్తాలను ఆ షెల్ కంపెనీల ద్వారా తిరిగి నగదు రూపంలో పొందిన విషయాన్ని కూడా ఈడీ గుర్తించింది.
ప్రజాధనం దోచేసేందుకే సుమన్ బోస్ మిలాఖత్
⇒ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్, టాలెంట్ ఎడ్జ్, ఏసీఐ, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్, డిజైన్ టెక్ కంపెనీలు, వారి యజమానులతో కలిసి సుమన్‌బోస్ పని చేశారని సీమన్స్ నివేదిక స్పష్టం చేసింది. సీమెన్స్ ప్రస్తుత ఎండీ కూడా ఇందుకు సంబంధించిన సంభాషణలు, వాట్సాప్ చాట్‌లు, ఇతరత్రా పలు వివరాలను ఈడీకి అందజేశారు. డిజైన్ టెక్ వికాస్ ఖాన్వీల్కర్, సుమన్ బోస్‌ల మధ్య డబ్బు తరలింపును కూడా ఈడీ గుర్తించింది.
⇒ ముకుల్ అగర్వాల్, సురేష్ గోయల్ తనకు సన్నిహిత మిత్రులన్న విషయాన్ని సుమన్ బోస్ ఈడీ ముందు అంగీకరించారు. డీసాల్ట్ ప్రస్తుత చిరునామా, ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చిరునామా ఒకే విధంగా ఉంది. ఈ ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సురేశ్ గోయల్ సతీమణి ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నారు. పలు ఇతర కంపెనీలు కూడా ఇదే చిరునామాపై రిజిస్టర్ అయి ఉన్నాయి. నిధుల మళ్లింపు వ్యవహారంలో సుమన్ బోసే మాస్టర్ మైండ్, ఇందుకు ఖాన్వీల్కర్, సురేశ్ అగర్వాల్‌ల సాయం తీసుకున్నారు.
⇒ సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తులసీదాస్ శివ కుమార్‌కు చెందింది. ఇతను సీమెన్స్ సుమన్ బోస్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో సీమెన్స్‌లో పని చేశాడు. ఈ కంపెనీకి రూ.3,48,95,191 మళ్లించారు. మరో సింగపూర్ కంపెనీ అయిన ఇంక్‌ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్‌కు రూ.74.51 లక్షలు, యూకేకు చెందిన ఎస్‌జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్‌కు రూ.73.67 లక్షలు జమ చేశారు. ఈ మొత్తాలన్నీ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీ) నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొందిన నిధులు.
నిధుల మళ్లింపులో కీలక వ్యక్తులు
- సుమన్ బోస్ (స్కిల్ ప్రాజెక్ట్ రూపకర్త)
- వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ (డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ)
- ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ ఎంటర్‌ప్రైజస్ సిగ్నేటరీ, సుమన్ బోస్ సన్నిహితుడు, నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కీలక వ్యక్తి )
- సురేష్ గోయల్ (సుమన్ బోస్ స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్, ముకుల్ అగర్వాల్ కోసం డబ్బు నిర్వహించిన వ్యక్తి)
- శిరీష్ షా (ఏసీఐ వ్యవహారాలు చూసే వ్యక్తి, ఎంట్రీ ఆపరేటర్)
- సావన్ కుమార్ జాజు (ఎంట్రీ ఆపరేటర్)
- యోగేష్ గుప్తా (ఎంట్రీ ఆపరేటర్)
- మనోజ్ కుమార్ జైన్ (ఎంట్రీ ఆపరేటర్)
- తులసీదాస్ శివకుమార్ అలియాస్ టి.శివకుమార్ (సింగపూర్ – బెన్ రీసెర్చ్ పీటీఈ లిమిటెడ్, సుమన్ బోస్ సన్నిహితుడు)
ఈడీ బయటపెట్టిన షెల్ కంపెనీలు...
⇒ మెసర్స్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ)
⇒ మెసర్స్ డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డీటీఎస్‌పీఎల్)
⇒ స్కిల్లర్ ఎంటర్‌ప్రైజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఈపీఎల్)
⇒ అల్లాయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏసియా లిమిటెడ్ (ఏసీఐ) (షెల్ కంపెనీ)
⇒ కాడెన్స్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ (షెల్ కంపెనీ)
⇒ ఈటీఏ గ్రీన్ బిల్డ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)
⇒ నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఎస్‌పీఎల్) (షెల్ కంపెనీ)
⇒ ఎస్‌ఎం ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)
⇒ ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)
⇒ పాట్రిక్ ఇన్‌ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)
⇒ ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)
⇒ ప్రో వెస్ట్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (షెల్ కంపెనీ)
⇒ భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ (షెల్ కంపెనీ)
⇒ మెసర్స్ టాలెంట్ ఎడ్జ్ (షెల్ కంపెనీ)
⇒ డిఅసాల్ట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డీఎస్‌ఐపీఎల్) (గతంలో బోస్, ముకుల్ అగర్వాల్, నరేష్ గోయల్ పని చేసిన కంపెనీ)
⇒ ఎస్‌ఎస్‌ఆర్‌ఏ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ కంపెనీలో సురేష్ గోయల్ భార్య డైరెక్టర్. డిఅసాల్ట్ సిస్టమ్స్ కంపెనీదీ ఇదే చిరునామా)
⇒ బెన్ రీసర్చ్ పీటీఈ లిమిటెడ్
(సింగపూర్ కంపెనీ)
⇒ ఇంక్‌ఫిష్ హాస్పిటాలిటీ పీటీఈ లిమిటెడ్ (సింగపూర్ కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు)
⇒ ఎస్‌జీకే వరల్డ్ ఫోరెక్స్ లిమిటెడ్ (యూకే కంపెనీ, ఈ కంపెనీకి నిధులు మళ్లించారు)
Comments
Please login to add a commentAdd a comment