పిల్లలకు భోజనం తినిపిస్తున్న కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ దంపతులు
పుట్టుకతోనే వచ్చిన మాయదారి రోగం ఆ చిన్నారుల జీవితాల్లో అంధకారం నింపింది. 18 ఏళ్లుగా ఒకరు, 14 ఏళ్లుగా మరొకరు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఉల్లాసంగా ఆడుకోవాల్సిన పిల్లలు జీవచ్ఛవంలా మారడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. ఇల్లంతా కన్నీళ్లు పరచుకుని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఓ పేదింటి కథ ఇదీ..
రాప్తాడు: మండలంలోని మరూరు పంచాయతీ చాపట్ల గ్రామానికి చెందిన మేకల నడిపి కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ దంపతులు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు ఇద్దరు కవలలు పుట్టారు. పెద్ద కుమారుడు కుళ్లాయప్ప ప్రస్తుతం అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రెండో కుమారుడు ఆంజనేయులుకు మాయదారి జబ్బు వచ్చింది. తర్వాత నాలుగేళ్లకు అమ్మాయి కీర్తన జన్మించగా, తను కూడా మతిస్థిమితం కోల్పోయింది. వీరికి బత్తలపల్లి ఆర్డీటీ, అనంతపురంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఎముకల్లో సారం లేక పిల్లలు జబ్బు పడ్డారని, బెంగళూరు లేదా హైదరాబాదులోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తే కొంత వరకు నయమవుతుందని వైద్యులు తెలిపారు. వైద్యానికి ఒక్కొక్కరికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు.
ఇప్పటికే రూ.30 లక్షల వరకూ ఖర్చు..
ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న ఆంజనేయులు, 14 ఏళ్ల వయసున్న కీర్తనకు వైద్యం కోసం గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులు రూ.30 లక్షల వరకూ ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం కన్పించలేదు. మెరుగైన వైద్యం చేయించేందుకు డబ్బు లేక, పిల్లలను పోషించుకోలేక కన్నీటిని దిగమింగుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
కుమారుణ్ని ఇంట్లోకి తీసుకెళుతున్న తల్లిదండ్రులు
భారమైన పిల్లల పోషణ..
మతిస్థిమితం లేని, కాళ్లూ చేతులు చచ్చుబడి కదల్లేని స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లల ఆలనాపాలనా చూసేందుకు కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ దంపతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పోషణకు నెలకు రూ.10 వేలు ఖర్చవుతోంది. ఒక్కొక్కరికి రూ.3 వేల పింఛన్ వస్తున్నా.. ఆ డబ్బు మందులకే సరిపోతోంది. అమ్మ ఈశ్వరమ్మే వారికి రోజూ స్నానం చేయించాలి. అన్నం తినిపించాలి. నీళ్లు తాగించాలి. ఇతర పనులన్నీ చేయాలి. ఇద్దరినీ చూసుకునేందుకు అమ్మా నాన్న ఇద్దరూ తప్పనిసరిగా వాళ్ల దగ్గరే ఉండాలి.
ఆపన్నహస్తం అందించరూ..
కుళ్లాయప్ప వంట చేసేందుకు వెళుతుంటాడు. అక్కడ వచ్చిన డబ్బుతో పిల్లలకు వైద్యం, కుటుంబ అవసరాలు చూసుకునేవాడు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి శుభకార్యాలు తగ్గిపోయాయి. దీంతో వంట పని పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నాడు. కూలి డబ్బులతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. పైగా ఎక్కువ సమయం పిల్లల వద్దే ఉండాల్సి వస్తుండడంతో కూలి పనులకు కూడా రెగ్యులర్‌గా వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం ఆంజనేయులు 60 కిలోలు, కీర్తన 40 కిలోల బరువు ఉండడంతో వారిని ఒకరే పైకి ఎత్తలేని పరిస్థితి. వారిని పక్కకు తిప్పాలన్నా, మరో చోటకు మార్చాలన్నా ఇద్దరూ ఉండాల్సిందే. ఇలా ఐదారేళ్ల నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ వారి బాగోగులు చూసుకుంటూ ఎక్కువగా ఇంటి పట్టునే ఉంటున్నారు. పిల్లలు శారీరకంగా ఎదుగుతున్నా మానసికంగా ఎటువంటి మార్పూ లేదు.
చనిపోవాలనుకున్నాం..
ఏ జన్మలో చేసుకున్న పాపమో, ఈ జన్మలో నరకం అనుభవిస్తున్నాం. మేం ఏడవని రోజంటూ లేదు. ఈ కష్టం పగవాడికీ రాకూడదు. పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. పెద్దాస్పత్రులకు వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు అప్పులు చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి తెస్తున్నారు. పిల్లల దయనీయస్థితి చూసి తట్టుకోలేకపోతున్నాం. ఒకానొక దశలో పురుగుల మందు తాగి చనిపోవాలనుకున్నాం. కానీ పిల్లలను చంపడం ఇష్టం లేక ఆ నిర్ణయం మానుకున్నాం.
– మేకల నడిపి కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ
సాయం చేయదలిస్తే..
పేరు : టి.ఈశ్వరమ్మ
బ్యాంకు : ఏపీజీబీ, మామిళ్లపల్లి, కనగానపల్లి మండలం
ఖాతా నంబర్ : 9105172249
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఏపీజీబీ 0001085
సంప్రదించాల్సిన నంబర్: 97011 41349
Comments
Please login to add a commentAdd a comment