రైతుల చేతికే గోనె సంచులు! | Civil Supplies Department Is Gearing Up For Grain Purchases | Sakshi
Sakshi News home page

రైతుల చేతికే గోనె సంచులు!

Published Sun, Sep 13 2020 9:56 AM | Last Updated on Sun, Sep 13 2020 9:56 AM

Civil Supplies Department Is Gearing Up For Grain Purchases - Sakshi

ధాన్యం కొనుగోళ్లు సమయంలో ఏటా ఎదురవుతున్న గోనె సంచుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందునుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియను పక్కాగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. పొరుగు జిల్లా విజయనగరంలో విజయవంతమైన రైతులకే గోనె సంచులు అందించే విధానాన్ని ఇక్కడ కూడా ఈ ఏడాది అమలు చేయనున్నారు.

వీరఘట్టం/పాలకొండ: రైతుల కోసం వైఎస్సార్‌కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమం కార్యక్రమాలను చేపడుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న వరి ధాన్యాన్ని విక్రయించేందుకు  ఇబ్బందుల్లేకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.15 లక్షల హెక్టార్లలో వరిసాగవుతోంది. గతేడాది వచ్చిన దిగుబడుల ప్రకారం ఈసారి 10.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో బీపీటీలు, సాంబమసూరి వంటి వాణిజ్య ప్రాధాన్యం ఉన్న రకాలు స్థానిక అవసరాల కోసం తీసివేయగా 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సొసైటీలు, రైతుభరోసా కేంద్రాలు సంయుక్తంగా ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు వీలుగా  ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

సిద్ధంగా 50 శాతం గోనె సంచులు
ఏటా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపడుతున్నప్పటికీ గోనె సంచుల కొరత వేధిస్తోంది. రైతులకు అవసరమైనప్పడు సంచులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా గోనె సంచుల ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అధికారుల లెక్క ప్రకా రం 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు 1.50 కోట్లు సంచులు అవసరం ఉంది. గతేడాది మిల్లర్లకు ఇచ్చిన 50 లక్షల గోనె సంచులు వారి వద్దే ఉన్నాయి. అధికారుల వద్ద మరో 25 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల కోసం 50 శాతం సంచులు సిద్ధంగా ఉన్నట్టే. ఇంకా కావాల్సిన సంచుల కోసం పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తోంది. 

పొరుగు జిల్లా మాదిరిగానే..  
వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో ఏటా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నప్పుడు కావాల్సిన గోనె సంచులను రైతులు లేదా మిల్లర్లు సమకూర్చుతున్నారు. దీంతో రైతు నుంచి గోనె సంచి రూపంలో అదనంగా రెండు కిలోల ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటున్నారు. ఈసారి ఇలాంటి ఇబ్బంది లేకుండా పక్క జిల్లా విజయనగరంలో అమలు చేస్తున్న మాదిరిగానే ధాన్యం కొనుగోళ్లు సమయంలో రైతులకు కావాల్సిన గోనె సంచులను ప్రభుత్వమే అందించనుంది. తర్వాత ఈ గోనె సంచిలో మిల్లుకు చేరిన ధాన్నాన్ని మిల్లింగ్‌ చేసి అదే గోనె సంచిలో మరలా సీఎంఆర్‌ కింద బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగిస్తారు.

అంతా పారదర్శకంగానే.. 
ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కొనుగోళ్లు కేంద్రాల ద్వారా గోనె సంచులు (50 కిలోల బస్తా)ను రైతులకు ఇచ్చి..వారి నుంచి ధాన్యం సేకరించి మిల్లర్లకు అప్పగిస్తాం. అదే బస్తాలో మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లర్‌ నుంచి సేకరిస్తాం. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఇదే పద్ధతిలో ఏటా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే పద్ధతి అనుసరిస్తాం. 
–ఎ.కృష్ణారావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, శ్రీకాకుళం     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement