పండ్ల నాణ్యత, ఉత్పాదకత పెంపే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్
జగన్ ప్రభుత్వం తెచ్చిన సవరణల తరహాలోనే నూతన విధానం
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేసి, ఉద్యాన ఉత్పత్తుల్లో నాణ్యత పెంచడమే లక్ష్యంగా కేంద్రం క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ (సీపీపీ)కు రూపకల్పన చేసింది. గతంలో రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యాన రైతులకు మేలు కలిగేలా నర్సరీల క్రమబద్ధీకరణ చట్టంలో చేసిన సవరణల తరహాలోనే కేంద్రం కూడా నూతన విధానాన్ని రూపొందించింది.
పండ్ల తోటల్లో నాణ్యతతో పాటు ఉత్పత్తిని పెంచి, ఎగుమతులను ప్రోత్సహించేలా రూ.1,766 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏపీ సహా దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో క్లీన్ ప్లాంట్ సెంటర్స్ (సీపీసీలు) ఏర్పాటు చేయబోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పటికే ఉద్యాన హబ్‌గా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రాజెక్టు మరింతగా తోడ్పడుతుంది.
నాణ్యత లేని మొక్కలు, ప్లాంట్ మెటీరియల్స్ కారణంగా దేశంలో ఉద్యాన రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ అత్యంత నాణ్యమైన, వైరస్‌లను తట్టుకొనే ప్లాంట్ మెటీరియల్స్‌ను రైతులకు అందుబాటులోకి తేవడం, సాగులో, ఆ తర్వాత ఉత్పత్తుల మార్కెటింగ్‌లో కూడా చేయూతనివ్వడమే లక్ష్యంగా సీపీపీని కేంద్రం అమలు చేస్తోంది.
క్లీన్ ప్లాంట్ సెంటర్స్ లక్ష్యాలు
» ఉద్యాన పంటలకు సోకే వ్యాధులు, వైరస్‌ల గుర్తింపు, వాటి నియంత్రణకు అత్యాధునిక లేబొరేటరీల ఏర్పాటు. ప్రత్యేకంగా టిష్యూ కల్చర్ ల్యాబ్స్ ఏర్పాటు
» నాణ్యమైన ప్లాంట్ మెటీరియల్, విత్తనాల సరఫరాకు నర్సరీలను బలోపతం చేయడం, కొత్త నర్సరీల ఏర్పాటు
» పాలీ హౌసెస్, గ్రీన్ హౌసెస్, షేడ్‌నెట్ హౌసెస్, వాక్ ఇన్ టన్నల్స్‌కు ప్రోత్సాహకాలు
» కొత్తగా ఆర్కెడ్స్, తోటల విస్తరణ, డ్రిప్ ఇరిగేషన్‌కు చేయూత.. ఆర్గానిక్ ఫార్మింగ్, ఆన్ ఫామ్ పాండ్స్, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ అభివృద్ధి
ఇదే లక్ష్యంతో ఏపీలో నర్సరీ చట్టం బలోపేతం
ఇదే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలోనే నర్సరీల క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించి బలోపేతం చేసింది. రాష్ట్రంలో 5,883 నర్సరీలున్నాయి. ఏటా 422.5 కోట్ల మొక్కల ఉత్పత్తి, అమ్మకాల ద్వారా రూ.2,483 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.
ఈ చట్టం పరిధిలో శాశ్వత పండ్ల మొక్కలు ఉత్పత్తి చేసే నర్సరీలు మాత్రమే ఉండగా, నర్సరీల చట్టాన్ని బలోపేతం చేయడం ద్వారా నర్సరీలతో పాటు పాలీ హౌస్‌లు, షేడ్ నెట్‌లను కూడా జగన్ ప్రభుత్వం చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. 2023–24లో 3,171 నర్సరీలను రిజిస్ట్రేషన్ కూడా చేశారు.
వీటి ద్వారా నాణ్యమైన ధ్రువీకరించిన మొలకలు, ప్లాంట్ మెటీరియల్స్ ఉత్పత్తి, సరఫరాకు బాటలు వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాంట్ మెటిరియల్స్‌పైనా నిఘాను కట్టుదిట్టం చేసింది. ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు, దిగుబడులు, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment