రుయా ఘటన తీవ్రంగా కలచివేసింది | CM Jagan Comments On Rua hospital incident in Spandana Video Conference | Sakshi
Sakshi News home page

రుయా ఘటన తీవ్రంగా కలచివేసింది

Published Wed, May 12 2021 3:27 AM | Last Updated on Wed, May 12 2021 5:20 AM

CM Jagan Comments On Rua hospital incident in Spandana Video Conference - Sakshi

కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి. నిన్న (సోమవారం రాత్రి) తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆ ఘటనతో నాకు చాలా బాధ వేసింది. మనం ఎంత బాగా కష్టపడుతున్నప్పటికీ, మన తప్పు లేకపోయినప్పటికీ.. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సరైన సమయానికి రాకపోవడం వల్ల 11 మంది చనిపోవడం బాధాకరం. కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత తీసుకుంటున్నాం.
– ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రుయాలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రుయా ఘటనతో పాటు కోవిడ్‌–19 నియంత్రణ, చికిత్స, వ్యాక్సినేషన్‌ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుయా లాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, కలెక్టర్లు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాల్లో ఆక్సిజన్‌ వార్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని, ఎస్‌ఓఎస్‌.. ఎమర్జెన్సీ మెసేజ్‌ రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. కలెక్టర్లు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయగలిగితే.. సమర్థవంతంగా ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాల్లో ఆక్సిజన్‌ స్టోరేజీ కెపాసిటీలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా పరిశ్రమల్లో ఆ సదుపాయం ఉందా.. అన్నదానిపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే నేవీ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్తున్నాయని, ఈ సమయంలో వారు చాలా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నేవీ బృందాల సేవలను బాగా వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఇది మనకు పరీక్షా సమయం
► కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల నుంచి మనకు ఆక్సిజన్‌ వస్తోంది. 3 రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను పంపిస్తున్నాం. ఆక్సిజన్‌ çసఫ్లై పెంచడంపై వీరు దృష్టి పెడతారు. తమిళనాడుకు కరికాల వలవన్, కర్ణాటకకు అనంతరాములు, ఒడిశాకు ఏకే పరీడాను పంపిస్తున్నాం. రేపటి (బుధవారం) నుంచి ఈ వ్యవస్థ పని చేస్తుంది.
► ఆక్సిజన్‌ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే... నిన్న (సోమవారం) 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌లిఫ్ట్‌ చేశాం. అక్కడ ఆక్సిజన్‌ నింపి.. రోడ్డు మార్గంలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 
► విదేశాల్లో కూడా ఆక్సిజన్‌ కొనుగోలు చేసి.. షిప్స్‌ ద్వారా తెప్పిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పడు మనం ఉన్నాం. ఇంత సమష్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాల వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. 
► ఇది మనకు పరీక్షా సమయం. కలెక్టర్లందరికీ చెబుతున్నా.. జరిగిన ఘటన పట్ల మీరు సడలిపోవాల్సిన పని లేదు. కానీ అత్యంత అప్రమత్తత, జాగరూకతతో వ్యవహరించాలి. ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో, సానుభూతితో ఎదుర్కోవాల్సి ఉంది. 

మన బాధ్యత కాకపోయినా, మానవత్వంతో..
► నిన్నటి (సోమవారం) ఘటనలో మరణించిన వారందరికీ పరిహారం ఇస్తున్నాం. మన తప్పు కాకపోయినా, పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్‌ సకాలానికి రాకపోయినా సరే.. బాధ్యత తీసుకుని రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం. కలెక్టర్‌ గానీ, జేసీ గానీ వారి కుటుంబాల వద్దకు స్వయంగా వెళ్లి పరిహారం ఇవ్వండి. వారితో మాట్లాడి, ఓదార్చి ధైర్యం చెప్పండి. వారికి బాసటగా నిలవండి. 
► తప్పు ఎవరి వల్ల జరిగినా తప్పు జరిగింది. ఇలాంటి తప్పులు మళ్లీ జరక్కుండా.. భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలి. తప్పును ఒప్పుకోవడం అన్నది చిన్నతనం కాదు. ప్రతి అడుగులోనూ పారదర్శకంగా వ్యవహరించే ప్రభుత్వం మనది. దేశంలో ఎలా ఉన్నా సరే.. మన రాష్ట్రంలో పారదర్శకతకు పెద్దపీట వేశాం. కోవిడ్‌ టెస్టుల్లో, ట్రీట్‌మెంట్‌లో ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామో దేశానికి చూపించాం. ప్రతి అడుగులోనూ పారదర్శకంగా ఉన్నాం.

బెడ్లు.. సీసీసీలు 
► రాష్ట్రంలో 648 ఆస్పత్రులను ఎంప్యానెల్‌ చేశాం. 47,947 బెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చాం.  41,315 బెడ్లు భర్తీలో ఉన్నాయి. ఆస్పత్రి ఆవరణలో టెంపరరీ జర్మన్‌ హ్యాంగర్స్‌ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఆస్పత్రిలో వేచిచూసే పరిస్థితులు ఉండవు. డాక్టర్లు వెంటనే వచ్చి వైద్యం చేసే అవకాశం ఉంటుంది. 
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా ఆక్సిజన్‌ సఫ్లై గురించి అధికారులు ఆలోచించాలి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్ల కొనుగోలుపై దృష్టి పెట్టింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయి. 
► ఆస్పత్రుల్లో ఉండే ఆక్సిజన్‌ పైపులైన్లను చెక్‌ చేయడంతో పాటు పర్యవేక్షణ చేయండి. టెక్నికల్‌ స్టాఫ్‌ను కచ్చితంగా నియమించండి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్‌ వెళ్లేలా చేయాలి. ఐసీయూలో కూడా ప్రెజర్‌ బూస్టర్స్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి.

104 వ్యవస్థను ఓన్‌ చేసుకోవాలి 
► 104 వ్యవస్థను ప్రతి ఒక్కరూ ఓన్‌ చేసుకోవాలి. 104కు అనుసంధానంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా వ్యవస్థ ఉండాలి. 104కు కాల్‌ చేస్తే రెస్పాన్స్‌ లేదనే మాట రాకూడదు. సంబంధిత జేసీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. 104కు కాల్‌చేస్తే మంచి సేవలు అందుతున్నాయనే ప్రజలు భావించాలి.
► మందులు ఇవ్వడం, క్వారంటైన్‌ సెంటర్లో చేర్పించడం, ఆస్పత్రుల్లో బెడ్‌లు ఇవ్వడం ఇవన్నీ కూడా మన బాధ్యత. మొదటిసారి దేశంలో ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ చికిత్సను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. 104కు కాల్‌చేస్తే ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రాల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 
► 104 ద్వారా 16 వేల నుంచి 17 వేల కాల్స్‌ వస్తున్నాయి. కాల్స్‌ రిసీవ్‌ చేసుకునే కెపాసిటీని కూడా పెంచాం. దీనికి అనుగుణంగా జిల్లాల్లో అనుసంధాన వ్యవస్థల్లో వనరులను పెంచుకోవాల్సి ఉంటుంది.
► మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి ఫోన్‌ చేస్తే ఎలాంటి స్పందన ఆశిస్తారో.. అలాంటి స్పందనే యంత్రాంగం నుంచి ఉండాలి. టెస్టింగ్, మెడికల్‌ కన్సల్టేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌.. ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలి. 3 గంటల్లో వారికి సేవలందించే బాధ్యత తీసుకోవాలి.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా కోవిడ్‌ వైద్య సేవలు
► కోవిడ్‌ వైద్యం కోసం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను కూడా తీసుకున్నాం. మంచి ఆహారం అందుతోందా? లేదా? మందులు సక్రమంగా అందుతున్నాయా? రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా? లేవా? సిబ్బంది తగినంత సంఖ్యలో ఉన్నారా? లేదా? చూడండి. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర ఉండేలా చూసుకోండి. సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి నంబర్‌ను ఉంచండి.
► అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలని కోరాం. ఇక్కడ కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? చూడాలి.  ప్రతి రెండు మూడు ఆస్పత్రులకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ కచ్చితంగా ఉండాలి. 648 ఆస్పత్రులకు కచ్చితంగా నోడల్‌ అధికారులను నియమించాలి. ఆరోగ్య శ్రీ, ఆక్సిజన్‌ సఫ్లై ఆస్పత్రుల పనితీరు, శానిటేషన్, ఫుడ్‌ క్వాలిటీపై నోడల్‌ అధికారులు దృష్టి పెట్టాలి. మనకు నివేదికలు కూడా అందిస్తారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నిరంతరం తనిఖీలు చేపట్టాలి. వైద్యులను వెంటనే నియమించాలి. ఇందుకు వాక్‌ ఇన్‌ ఇంటర్వూ్యలను వెంటనే నిర్వహించండి.
► ఉదయం 6 నుంచి 12 వరకు ప్రజలు వారి పనులు చేసుకోవచ్చు. అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 12 గంటలు దాటిన తర్వాత నూరు శాతం కర్ఫ్యూ పాటించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement