80 శాతానికి పైగా పూర్తయిన ఉద్దానం భారీ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి / అరసవల్లి: రాష్ట్రంలో మూడేళ్ల క్రితం వరకు కిడ్నీ రోగుల పరిస్థితి ఏమిటని ఎవరైనా సరే స్వయంగా వెళ్లి బాధితులనే అడిగితే వాస్తవమేమిటో తెలుస్తుంది. కిడ్నీ బాధితుల కష్టాలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన, విన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే విప్లవాత్మక చర్యలతో వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు వారికి అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటూనే, మరో వైపు వారికి పింఛన్ పెంపు ద్వారా అర్థికంగా దన్నుగా నిలిచారు. ఇంకో వైపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మంచి నీటి సరఫరా జరిగేలా అడుగులు ముందుకు వేశారు. వాస్తవం ఇలా ఉంటే ఈనాడు పత్రిక అధినేత రామోజీరావుకు మాత్రం మరో కనిపిస్తోంది.
మాటల్లో కాదు.. చేతల్లోనే
► 1980 దశకం నుంచి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంత వరకు స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ.. అక్కడి తాగునీరే కారణం కావొచ్చేమోనన్న నిపుణుల అనుమానాల మేరకు 2019 సెప్టెంబరు 6వ తేదీన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాంతానికి శాశ్వత రక్షిత మంచి నీటి పథకాన్ని మంజూరు చేసింది.
► పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు 807 నివాసిత గ్రామాలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని రూపొందించింది. ఏడాది పొడవునా సురక్షిత నదీ జలాలను పైపులైన్ ద్వారా అందించేలా డిజైన్ చేశారు.
► ఉద్దానానికి సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా, అవి వేసవిలో ఎండిపోతే ఇబ్బంది ఉంటుందని భావించి, దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హిరమండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా నీటిని తరలించి మెళియాపుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేస్తారు.
► హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించింది. శుద్ధి చేసిన నీటిని ఉద్దానం ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేస్తోన్న రక్షిత మంచి నీటి ఓవర్‌హెడ్ ట్యాంకులకు తరలిస్తారు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు. ఇప్పటికే 80 శాతం పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. 2023 మార్చి నాటికి పనులు పూర్తవుతాయి. రోజుకు 84 మిలియన్ లీటర్ల తాగు నీటిని సరఫరా చేసేందుకు వీలుగా మెళియాపుట్టి ప్రాంతంలో నీటి ఫిల్టర్ బెడ్‌లు నిర్మిస్తున్నారు. కనీసం 30 ఏళ్ల పాటు సరఫరా చేసేలా వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు.
► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ఐదేళ్ల వరకు హడావుడి తప్ప చేసిందేమీ లేదు.
పలాసలో 70శాతం పనులు పూర్తయిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
వైఎస్ జగన్ చర్యలు ఇలా..
► ప్రతిపక్షనేత హోదాలో కవిటి మండలం జగతిలో కిడ్నీ బాధితుల భరోసా యాత్ర పేరిట వైఎస్ జగన్ పర్యటించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ సమస్యపై నిపుణులతో చర్చించారు.
► చంద్రబాబు ఇస్తున్న రూ.2,500 పింఛన్‌ను జగన్ అధికారంలోకి రాగానే వ్యాధి తీవ్రతను బట్టి రూ.10 వేలు, రూ.5 వేలు చేశారు. రూ.700 కోట్లతో భారీ రక్షిత మంచి నీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, 80 శాతానికి పైగా పూర్తి చేశారు. డయాలసిస్ కేంద్రాల్లో పడకల సంఖ్యను 62 నుంచి 90కి పెంచారు. ఇద్దరు నెఫ్రాలజిస్టులను నియమించారు. రూ.50 కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి నిర్మిస్తున్నారు. 70 శాతం పూర్తయింది.
► కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 37 రకాల మందులను నెఫ్రాలజిస్ట్‌లు సూచిస్తుంటారు. ఈ క్రమంలో ఉద్దానం ప్రాంతంలోని పీహెచ్‌సీ నుంచి ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 రకాల మందులను ఏపీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేస్తోంది. మరో 12 రకాల మందులను స్థానిక అవసరాలకు అనుగుణంగా అక్కడికక్కడే కొనుగోలు చేసుకోవడానికి వైద్య శాఖ అనుమతులు ఇచ్చింది.
► వ్యాధి లక్షణాలు కన్పిస్తే వెంటనే సామాజిక ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందే అవకాశం కల్పించారు. అక్కడ అవసరమైన మేరకు ఫిజీషియన్లను నియమించారు. డయాలసిస్ రోగులకు ఎత్రోపాయిటన్ ఇంజక్షన్ క్రమం తప్పకుండా ఉచితంగా ఇస్తున్నారు. పలాస సీహెచ్‌సీలో నెఫ్రాలజిస్టును నియమించారు. వారానికి ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బతుకుతాననుకోలేదు..
నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రికే ధారబోశాను. అప్పట్లో కనీసం ఒక్క డాక్టర్ గానీ, మందులు ఇచ్చేవారు గానీ మా గ్రామానికి వచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల నుంచి రూ.10 వేలు పింఛన్ వస్తోంది. నన్ను డయాలసిస్ కేంద్రానికి తీసుకువెళ్లడానికి 108 బండి వస్తోంది. నేను ఇప్పటి వరకు బతుకుతానని అసలు అనుకోలేదు. అంతా జగనన్న దయే.
– సుగ్గు లక్ష్మీ, సన్యాసిపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా
రూ.10 వేలు పింఛన్ అందుకుంటున్నాం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేలు పింఛను ఇస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డయాలసిస్ చేసుకోవడానికి స్థానికంగా బెడ్స్ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కాం. డయాలసిస్ కూడా సకాలంలో చేసుకుంటున్నాం.
– మర్రిపాటి తులసీదాస్, పెద్దశ్రీరాంపురం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా
ఈనాడు కథనం అవాస్తవం
శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంత మండలాల్లో కిడ్నీ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అద్భుత సేవలందుతున్నాయి. ఈ విషయాన్ని విస్మరించి ‘ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు..?’ అంటూ ఈనాడు తప్పుడు కథనం ప్రచురించడం దారుణం. జిల్లాలో 35 వేల మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) తో బాధపడుతున్నారని, ఇందులో 4,500 మంది చనిపోయారని రాశారు. డయాలసిస్ సెంటర్లు సరిపడా లేవని, నెఫ్రాలజిస్టులే లేరన్నారు. వాస్తవంగా జిల్లాలో 2,27,099 మందికి స్క్రీనింగ్ చేస్తే 19,379 మంది కిడ్నీ రోగులుగా తేలింది.
ఇందులో 1,118 మంది వివిధ కారణాలతో చనిపోయారు. ఉద్దాన మండలాల్లోనే 28 డయాలసిస్ యూనిట్లను కొత్తగా ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఒకటి, హరిపురం సీహెచ్‌సీలో 10, పలాస సీహెచ్‌సీలో 04, సోంపేటలో 08, కవిటిలో 05 చొప్పున యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నెప్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. పీహెచ్‌సీల్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 ఎనలైజర్లను కొనుగోలు చేశారు. అన్ని రకాల మందులు అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ మీనాక్షి, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment