
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నైపుణ్యం దిశగా తొలి అడుగు పడుతోందని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో నైపుణ్య శిక్షణ అకాడమీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో 7 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఈ అకాడమీని నిర్మించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నైపుణ్య కల సాకారానికి వైఎస్సార్ జయంతి నాడు మొదటి అడుగు పడటం శుభపరిణామమని పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరో 5 మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. స్కిల్ ఏపీ మిషన్– నైపుణ్య విశ్వవిద్యాలయం ధ్రువీకరించిన టెక్నికల్ అండ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వంటి పరిశ్రమలకు అవసరమైన గ్లోబల్ నమూనా తరహా అత్యాధునిక కోర్సులతో యువతకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. పులివెందుల అకాడమీ నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాలశాఖకు అప్పగిస్తూ ఇప్పటికే నైపుణ్య శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు.