
రీ సైకిల్ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలని, తద్వారా రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేయొచ్చని చెప్పారు.
సాక్షి, అమరావతి: మంచి నీటిని ఆదా చేయడంలో భాగంగా పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన సముద్ర జలాలను అందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. డిశాలినేషన్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి నీరు ఆదా, పరిశ్రమలకు శుద్ధి చేసిన జలాల పంపిణీపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రీ సైకిల్ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలని, తద్వారా రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేయొచ్చని చెప్పారు. సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా ఆ నీటిని పరిశ్రమలకు అందించే ఆలోచన చేయాలన్నారు. ఈ వ్యవహారాల సమన్వయ బాధ్యతను ఏపీఐఐసీ చేపట్టాలని, ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఏపీఐఐసీదే బాధ్యత
► పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీదే. పకడ్బందీగా డీశాలినేషన్ చేసి, పరిశ్రమలకు, పారిశ్రామిక వాడలకు అవసరమైన మేరకు నాణ్యమైన నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.
► సాగు కోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా, డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏరకంగా నీటిని పరిశ్రమలకు అందించవచ్చో ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి.. ఎక్కడెక్కడిæ నుంచి ప్రస్తుతం నీటిని వాడుతున్నారు.. ఆ నీటికి బదులుగా డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా నీరు ఇవ్వగలుగుతాం? అన్న అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ప్రణాళిక సిద్ధం చేయాలి.
► ఈ సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.