![CM YS Jagan on Anandaiah Covid Ayurvedic Medicine - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/25/STS_7331.jpg.webp?itok=dy2bojm3)
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులకు సంబంధించి ‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్’ (సీసీఆర్‌ఏఎస్)కు పంపిన శాంపిళ్ల ఫలితాలు రాగానే నిర్ణయం తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కోవిడ్–19 నియంత్రణ, చికిత్సపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఆనందయ్య మందులో వినియోగిస్తున్న పదార్థాల గురించి రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు ముఖ్యమంత్రికి వివరించారు. ఆనందయ్య మందుల్లో కంట్లో వేసే డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కంట్లో డ్రాప్స్‌పై పరిశీలన ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఆనందయ్య మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని, కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయని, కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని కమిషనర్ వివరించారు. ఈ మందు శాంపిళ్లను సీసీఆర్‌ఏఎస్‌కు పంపామని, వాళ్లు 500 మందికి ఇచ్చి పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మందు వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో నివేదిక వస్తుందని అధికారులు చెప్పారు.
30–35 ఏళ్లగా మందులు ఇస్తున్నారు
కృష్ణపట్నంలో ఆనందయ్య 30–35 సంవత్సరాలుగా మందులు ఇస్తున్నారని ఆయుష్ కమిషనర్ రాములు సమావేశంలో తెలిపారు. కరోనాకు నోటి ద్వారా 4 రకాల మందులు, కళ్లలో డ్రాప్స్.. ఇలా 5 రకాల మందులు ఇస్తున్నారని తెలిపారు. ఈ మందుల్లో ఆనందయ్య 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారని చెప్పారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె.. ఇలా 18 రకాలను ఆనందయ్య 5 రకాల మందుల్లో వాడుతున్నారని వివరించారు. అన్నీ సహజంగా దొరికే పదార్థాలేనని, వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదని చెప్పారు. మందుల తయారీ విధానాన్ని తమకు చూపించారని, ఫార్ములా కూడా చెప్పారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment