రాష్ట్రంలో రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏటా 12,232 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 2019 నాటి ఈ ఫీడర్లలో 58 శాతమే 9 గంటల విద్యుత్‌ను అందించే స్థాయిలో ఉన్నాయి. దీంతో ఫీడర్ల వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం రూ.1,700 కోట్లతో పనులు మొదలుపెట్టింది. కోవిడ్ ఇబ్బందుల మధ్యనే ఇప్పటికి 97.5 శాతం పనులు పూర్తయ్యాయి. రబీ నాటికి వంద శాతం పూర్తవుతాయి. ఇక మీటర్లు బిగిస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎంత విద్యుత్ వాడుతున్నారనే వివరాలు తెలుస్తాయి. తద్వారా సరఫరాలో
లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకే ఎక్కువ లబ్ధి కలుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తద్వారా రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడబోదని చెప్పారు. ఈ విషయంపై విస్తృత ప్రచారంతో రైతుల్లో అవగాహన కల్పించాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఇంధన శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
ఇంధన శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి బాలినేని, అధికారులు
నాణ్యత–ఐఎస్‌ఐ ప్రమాణాలు
► ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ (ఈఈఎస్‌ఎల్– ఎనర్జీ ఎఫిషియన్షీ సర్వీసెస్ లిమిటెడ్)తో మాట్లాడండి. రైతులు ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన మోటార్లు వినియోగించేలా అవగాహన కల్పించాలి.
► కెపాసిటర్లు కూడా ఐఎస్‌ఐ ప్రమాణాలతో ఉండాలి. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలి.
► మరోవైపు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే బిడ్ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.
► మీటర్ల ఏర్పాటు వల్ల ఎలాంటి భారం పడబోదన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే 14,354 లైన్‌మెన్లకు శిక్షణ ఇచ్చామని అధికారులు వెల్లడించారు. అన్ని ఫీడర్ల కింద వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 97.5 శాతం ఫీడర్లు పూర్తి కాగా, మిగిలినవి నవంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు.
► ఈ సమీక్షలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ జి.సాయిప్రసాద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment