ఆర్థిక వ్యవస్థలోనే కాదు ప్రజల అవసరాలు తీర్చడంలోనూ చిరు వ్యాపారులు కీలకం. తోపుడు బండ్లపై తిను బండారాలు, కూరగాయలు, వస్తువులు అమ్మేవారు లేకపోతే చాలా మంది కడుపు నిండదు. వీరివల్లే అందరికీ ఇంటి ముంగిటే సరుకులు అందుతున్నాయి. వారు ఎండనకా, వాననకా, చలనకా వ్యాపారాలు సాగించకపోతే వారి బతుకుబండి మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ కూడా నడవదు. అందుకే వారికి తోడుగా నిలుస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలని ఆరాటపడే ప్రభుత్వం మనది. – సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
బడ్డీ కొట్టు కల నెరవేరనుంది
నేను బుట్టలో కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటున్నాను. బడ్డీకొట్టు పెట్టుకోవాలన్నది నా కల. అప్పు కోసం బ్యాంకుకు వెళితే రుణం ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఇప్పించే రూ.10 వేల రుణంతో బడ్డీ కొట్టు పెట్టుకుని నా కల నెరవేర్చుకుంటా. మా పాపకు అమ్మఒడి, మా అమ్మకు చేయూత, నా భర్తకు వాహనమిత్ర వల్ల లబ్ధి కలిగింది.
– స్వాతి, పద్మనాభం, విశాఖ
సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులను ఆదుకునే గొప్ప కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది పేదల మేలు కోరే ప్రభుత్వమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. చిరు వ్యాపారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించే ‘జగనన్న తోడు’ పథకాన్ని బుధవారం ఉదయం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించారు. ‘నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు స్వయంగా చూశాను. లక్షల సంఖ్యలో ఉన్న వారందరికి మంచి జరగాలని మనసారా కోరుకున్నాను. ఈరోజు దేవుడి దయ, మీ చల్లని ఆశీర్వాదంతో ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం వచ్చింది’ అని చెప్పారు. పల్లెల నుంచి పట్టణాల వరకు వీధుల్లో చిరు వ్యాపారాల ద్వారా జీవిస్తున్న లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ‘జగనన్న తోడు’ ప్రారంభిస్తోందన్నారు. ‘వారిని చిరు వ్యాపారులు అనడం కంటే ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలందిస్తున్నారని చెప్పాలి. ప్రతి రోజు వారి జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే మొదలవుతాయి. బండ్లపై టిఫిన్లు అమ్మాలన్నా, కూరగాయలు తెచ్చుకుని విక్రయించుకోవాలన్నా తెల్లవారుజాము నుంచే వారి పని ప్రారంభమవుతుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..
‘జగనన్న తోడు’ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకృతులను పరిశీలిస్తున్న సీఎం జగన్
అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి
► వారు చిరు వ్యాపారులు కాబట్టి, ఆదాయం అంతంత మాత్రమే. కానీ శ్రమ మాత్రం చాలా ఉంటుంది. అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారు కావడం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు అందవు. అందువల్ల వారు రూ.3, రూ.4 నుంచి రూ.10 వరకు వడ్డీతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్నారు.
► వారంతా స్వయం ఉపాధి పొందడమే కాకుండా, మరి కొందరికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఆటోల వారికి, సరుకులు దించే కూలీలకు కూడా పని కల్పిస్తున్నారు. అలా వారు మన సమాజానికి మేలు చేస్తున్న మహానుభావులు.
గతానికి, ఇప్పటికి తేడా చూస్తే..
► గతంలో వారికి తోడుగా ఎవరూ నిలబడలేదు. ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తోడుగా నిలుస్తున్నారు. దరఖాస్తు తీసుకోవడం మొదలు అన్ని రకాల సేవలందిస్తున్నారు. సచివాలయాల్లోని సంక్షేమ సహాయకులు ఎంతో సేవ చేస్తున్నారు.
► వారి దరఖాస్తులు పంపడంతో పాటు, జిల్లా అధికారులతో, బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు. పూర్తి పారదర్శకంగా పని చేస్తున్నారు. వారి తరఫున నిలబడి, రుణాలపై ప్రభుత్వమే వడ్డీ కడుతుందనే నమ్మకం కలిగిస్తున్నారు. బ్యాంకర్ల సమన్వయంతో చిరు వ్యాపారులకు ఇప్పటికే స్మార్ట్ కార్డులు జారీ చేశాం.
► ఒక అన్నగా, తమ్ముడిగా అండగా ఉండి చేయూత ఇవ్వాలని, వారి జీవితాల్లో మార్పు తేవాలని ఎప్పుడూ అనుకునే వాణ్ని. ఇవాళ ఆ పని చేస్తున్నాను. జగనన్న తోడు అనే పథకం ద్వారా వారికి తోడుగా నిలవగలుగుతున్నాను.
వడ్డీ భారం ప్రభుత్వానిదే
► సుమారు 10 లక్షల మందికి దాదాపు రూ.1,000 కోట్ల రుణాలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తుంది. దాన్ని పదేళ్లకు తీసుకుంటే రూ.1,000 కోట్లు అవుతుంది.
► అలా వారి జీవితాలు బాగు చేయడం కోసం ప్రభుత్వం బ్యాంకర్లతో కలిసి ఈ పథకం అమలు చేస్తోంది. విప్లవాత్మక మార్పులతో వారందరికి తోడుగా నిలుస్తోంది. వారం నుంచి 10 రోజుల్లో బ్యాంకులు 10 లక్షల మంది ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేస్తాయి.
► చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి కూడా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. వీరి తరఫున వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది.
ప్రతి మూడు నెలలకు వడ్డీ జమ
► వారంతా గుర్తింపు కార్డులు తీసుకుని, రుణాలను ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే, మన ప్రభుత్వం ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. స్వయం సహాయక బృందాలు, పొదుపు సంఘాల లాగే ఇవాళ్టి నుంచి చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు కూడా అండగా నిలబడి వడ్డీలేని రుణాలు ఇస్తాం.
► అర్హులెవరైనా ఇంకా మిగిలిపోతే, వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. వెరిఫికేషన్ పూర్తి కాగానే నెల, రెండు నెలల్లో వారికీ పథకం అమలు చేస్తాం. అందువల్ల ఇప్పుడు రుణం రాని వారెవ్వరూ ఆందోళన చెందవద్దు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. చిరు వ్యాపారం చేసుకుంటున్న దాదాపు 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.
► కార్యక్రమంలో మంత్రులు ఎం.శంకర నారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మాట చెబితే అమలు చేసే ప్రభుత్వం
మనది మాట చెబితే తప్పనిసరిగా అమలు చేసే ప్రభుత్వం. చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టోలో 600కు పైగా అబద్ధాలు చెప్పారు. మన సీఎం జగన్ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేస్తున్నారు.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
అర్హులందరికీ ప్రయోజనం చేకూర్చాం
ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఎంత మంది దరఖాస్తు చేసుకున్నా, అర్హత ఉన్న వారందరికీ రుణం అందేలా చూస్తాం.
– బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
ఈ మేలు మరువలేం
కరోనా కష్ట కాలంలో రూ.వందకు నెలకు రూ.10 వడ్డీ ఇస్తామంటేగానీ రుణం దొరకని పరిస్థితి. వ్యాపారం జరిగినా, జరగకపోయినా వాళ్లకి వడ్డీ డబ్బు ఇవ్వాల్సిందే. అలాంటి సమయంలో మీరు జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టి మాకు వడ్డీ లేని రుణం ఇచ్చి చాలా సహాయం చేస్తున్నారు. మీ మేలు మరువలేం.
– శ్యామల, కలంకారీ నిపుణురాలు, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
మీగురించి గర్వంగా చెప్పుకుంటున్నాం
నేను మసాల దినుసుల వ్యాపారం చేస్తుంటాను. నా పుట్టింటి నుంచి నా జగనన్నే వచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నాడని మీ గురించి ప్రతిరోజూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. కడుపులో కన్ను కూడా తెరవని బిడ్డ మొదలు.. వృద్ధాప్యంలో ఉన్న అవ్వా తాతల వరకు మీ నుంచి అందని పథకం లేదు.. అందుకోని గడపా లేదు. ఇప్పుడు నాకు జగనన్న తోడు కూడా అందింది. మా రాష్ట్రానికి మీరు సీఎం అయినందుకు చాలా గర్వంగా ఉంది.
– జి.సత్య, వలసపాకుల, తూర్పుగోదావరి
ష్యూరిటీ లేకుండా అప్పు ఇచ్చారు
నేను రెండేళ్లుగా అగరుబత్తీలు తయారు చేస్తున్నాను. గతంలో బ్యాంకులో అప్పు కోసం వెళితే ష్యూరిటీ అడిగారు. ఈ రోజు మా జగనన్న మంచి మనసు వల్ల ష్యూరిటీ లేకుండానే అప్పు ఇచ్చారు. మీరే మమ్నల్ని నడిపిస్తున్నారు. వాహనమిత్ర, విద్యాదీవెన పథకాల వల్ల మాకు లబ్ధి కలిగింది. మేమున్నంత వరకు మీరే సీఎంగా ఉండాలి.
– మధులత, అనంతసాగర్ కాలనీ, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment