సాక్షి, అమరావతి: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 3 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు, వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేయగలిగిందంతా చేస్తున్నామన్నారు. 21వ శతాబ్దంలో ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటా కనిపించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఇచ్చిన మాట మేరకు పొదుపు సంఘాల మహిళలకు చెందిన అప్పుల్లో తొలి దశలో రూ.6,792.20 కోట్లను అక్క చెల్లెమ్మల ఖాతాలకు జమ చేసే వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించారు. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 8,71,302 పొదుపు సంఘాల్లో ఉన్న 87,74,674 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా సీఎం.. జిల్లాల్లోని పొదుపు సంఘాల మహిళలనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మహిళల చరిత్ర మారుస్తున్నాం
– ఈ పథకం ప్రారంభిస్తున్నందుకు మీ సోదరుడిగా శుభాకాంక్షలు. దేవుడి దయతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. గతంలో ఎక్కడా, ఎవరూ తలపెట్టలేదు. దాదాపు 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు రూ.27 వేల కోట్ల రుణాలు ఉన్నాయి. చెప్పిన మాట ప్రకారం నాలుగు వాయిదాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా ఆ అప్పుల మొత్తం వారి చేతుల్లో పెడుతున్నాం. ఇప్పుడు తొలి విడతగా రూ.6,792 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాము.
– ఈ సహాయం ద్వారా వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకుంటే ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.
బ్యాంకులతో పాటు, ఐటీసీ, అమూల్, అల్లానా, పీ అండ్ జీ, హిందుస్తాన్ యూని లీవర్, æరిలయెన్స్ వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. సెర్ప్, మెప్మా అధికారులు మీకు సహకరిస్తారు. ఈ డబ్బు వాడుకోవడంపై పూర్తి స్వేచ్ఛ, అధికారం మీకు ఉంది.
– 45–60 ఏళ్ల మధ్య ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలు దాదాపు 22 లక్షల మందికి తోడుగా ఉండేందుకు వైఎస్సార్ చేయూత పథకం అమలు చేశాం. ఏటా రూ,18,750 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తూ, నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల సహాయం చేస్తాం. తొలి ఏడాది దాదాపు రూ.4200 కోట్లు జమ చేశాం. ఏదైనా వ్యాపారం, స్వయం ఉపాధి పొందాలంటే గ్రామ, వార్డు వలంటీర్లకు చెప్పండి. లేదా సెర్ప్, మెప్మా అధికారులను కలవండి. లేదా 1902కు ఫోన్ చేయండి. ఆవులు, మేకలు కొనివ్వడంతో పాటు, పాలు ఇతర ఉత్పత్తులు కూడా కొనుగోలు చేస్తారు.
పిల్లలు, బాలింత కోసం..
– గర్భిణులు, బాలింతలకు కూడా మేలు చేసే చర్యలు చేపట్టాం. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు వారికి పౌష్టికాహారం ఇస్తూ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నాం.
– పీపీ–1, పీపీ–2 ద్వారా మంచి విద్య.. ఇంగ్లిష్ మీడియంలో బోధన అమలు చేయబోతున్నాం.
– ఇంటర్ వరకు మంచి చదువులు అందాలని, పేదింటి పిల్లలు కూడా డాక్టర్, ఇంజనీరింగ్ చదవాలని కాంక్షిస్తూ అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. దాదాపు 83 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ, 43 లక్షల తల్లుల ఖాతాల్లో సుమారు రూ.6,300 కోట్లు జమ చేశాం.
Comments
Please login to add a commentAdd a comment