
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం ట్విటర్‌లో ట్వీట్ చేశారు. చదవండి: గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నా. #Deepavali
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2020
దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపావళి యొక్క దైవిక కాంతి అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందిస్తుంది. దీపావళి చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుంది. కరోనా లాంటి విపత్తులను జయించటానికి, శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలి. ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త తీసుకోవాలి’ అని గవర్నర్ ఆకాంక్షించారు.