YS Jagan: AP CM dedicated oxygen plants to people by starting Details Inside - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: లక్షణంగా ఆరోగ్యం

Published Tue, Jan 11 2022 3:24 AM | Last Updated on Tue, Jan 11 2022 11:11 AM

CM YS Jagan dedicated oxygen plants to people by starting - Sakshi

అత్యాధునిక వైద్య పరికరాల పనితీరును పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు

Andhra Pradesh:  రాష్ట్రంలో గతంలో ఒక్క వీఆర్‌డీఎల్‌ (వైరస్‌ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌) ల్యాబ్‌ కూడా లేని పరిస్థితి నుంచి ప్రస్తుతం రోజూ లక్ష మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించే స్థాయికి ల్యాబ్‌లను నెలకొల్పామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సెకండ్‌ వేవ్‌ నేర్పిన పాఠాలతో ఆక్సిజన్‌ కొరత లేకుండా జాగ్రత్తలు చేపట్టామన్నారు. కోవిడ్‌తో ఆర్థిక కష్టాలు తలెత్తినా ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నాడు – నేడు ద్వారా వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు. కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచామని, పిల్లలకు వ్యాక్సినేషన్‌లోనూ అందరి కన్నా ముందున్నామని చెప్పారు.

ఫిబ్రవరి నాటికి వైద్య రంగంలో 39 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 23 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం సామర్ధ్యం కలిగిన 144 (ఆక్సిజన్‌ జనరేషన్‌) పీఎస్‌ఏ ప్లాంట్లతో పాటు క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు, ఎల్‌ఎంవో ట్యాంకులు, ఆక్సిజన్‌ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.  

247 పీఎస్‌ఏ ప్లాంట్లు 
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 144 ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లను అంటే సొంతంగా ఆక్సిజన్‌ తయారు చేసుకునే ప్లాంట్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 32 పీఎస్‌ఏ ప్లాంట్లను జాతికి అంకితం చేశాం. ఈ 144 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నెలకొల్పి ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. 50 పడకలున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో  చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వంద పడకలకుపైగా ఉన్న మరో 71 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ పీఎస్‌ఏ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వమే 30 శాతం సబ్సిడీని భరిస్తూ చేయూత అందిస్తోంది. తద్వారా 247 చోట్ల సొంతంగా ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు ఏర్పాటవుతాయి. 
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్ల చిత్రాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ఆక్సిజన్‌ కొరతతో అస్తవ్యస్తం.. 
కోవిడ్‌ సమయంలో ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఆక్సిజన్‌ కొరత వల్ల దేశవ్యాప్తంగా ఎంత ఇబ్బందులు ఎదురయ్యాయో అంతా చూశాం. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థపై కోవిడ్‌ వైరస్‌ ప్రభావం చూపింది. సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఏకంగా విమానాల్లో తరలించాల్సి వచ్చింది. విదేశాల నుంచి కూడా తెప్పించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. క్రయోజనిక్‌ ట్యాంకుల్లో విదేశాల నుంచి ఓడల్లో కూడా తర లించాల్సి వచ్చింది. 

నిమిషానికి 44 వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి.. 
అలాంటి పరిస్థితులను సమర్థంగా అధిగమించి ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌  కొరత  లేకుండా చర్యలు చేపట్టాం. రూ.426 కోట్లు ఖర్చు చేసి నిమిషానికి 44 వేల లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 144 ప్లాంట్లను ప్రజలకు అంకితం చేస్తున్నాం. 

ఆదాయం తగ్గినా.. సంక్షేమం తగ్గలేదు  
కోవిడ్‌తో రెండేళ్లుగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా ప్రజలు ఇబ్బంది పడకూడదు, వారికి మంచి జరగాలనే ఆరాటంతో సంక్షేమ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. నాడు –నేడు ద్వారా ఆస్పత్రులు, స్కూళ్లను బాగు చేశాం. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టాం.   

ముఖ్యమంత్రి దూరదృష్టితో సిద్ధం.. 
కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో మరో కీలక ఘట్టం మొదలైంది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రజల ప్రాణాల పరిరక్షణ, ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.వేల కోట్లు వెచ్చించారు. కోవిడ్‌ను మనం ఎంత కట్టడి చేసినా ఆక్సిజన్‌ కోసం కేంద్రంపై ఆధారపడటం, ఇతర రాష్ట్రాల నుంచి కోటా మేరకు పొందటాన్ని గతంలో చూశాం. వీటిని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూరదృష్టితో ఆదేశించారు. భవిష్యత్‌లో ఎన్ని వేవ్‌లు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా మౌలిక సదుపాయాలు కల్పించారు. 
– ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి

చిత్తూరు, తిరుపతి వెళ్లాల్సిన పనిలేదు.. 
చిత్తూరు జిల్లాలో 27 పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. పుంగనూరు ఆసుపత్రిలో కూడా ప్లాంట్‌ ఏర్పాటైనందున ఆక్సిజన్‌ కొరతతో రోగులను చిత్తూరు, తిరుపతి పంపాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే వైద్యం అందించగలుగుతున్నాం.  
– డాక్టర్‌ కిరణ్, మెడికల్‌ ఆఫీసర్‌æ, పుంగనూరు సీహెచ్‌సీ, చిత్తూరు 

మందులు.. మంచి భోజనం 
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రంగా సోకడంతో నాకు ఆక్సిజన్‌ లెవల్స్‌ 75కి  పడిపోయాయి. గుంటూరు జీజీహెచ్‌లో ఐసీయూకి తరలించి మెరుగైన చికిత్స అందించారు. మందులతో పాటు మంచి భోజనం కూడా పెట్టారు. ఆ సమయంలో మీరు (సీఎం వైఎస్‌ జగన్‌) చక్కగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మీ ముందు నిలుచుని ఇలా మాట్లాడుతున్నానంటే అది మీరు పెట్టిన భిక్షే.    
 – శైలజ, కోవిడ్‌ బాధితురాలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement