సాక్షి న్యూస్, అమరావతి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 19 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన‍్నారు. ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలని నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన పనులు, సంక్షేమ పథకాల వివరాలను గణాంకాలతో సహా వివరించారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే…
►నియోజకవర్గంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు వస్తుంది. డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశాం, ఈ నియోజక వర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081కోట్లు ఇచ్చాం, 93,124కుటుంబాలకు మేలు చేశాం. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి పట్టాలు ఇచ్చాం. 47,123 మందికి బియ్యంకార్డులు మంజూరు చేశాం.
►ఈ స్థాయిలో ఇంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా చేశాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీకూడా, ఏ ఒక్కరికీ మిస్‌కాకుండా ఆయా కుటుంబాలకు మంచిచేశాం, బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి జమచేశాం. చేసిన మంచి ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ వివరిస్తూ, వారికి లేఖలు ఇస్తూ గడపగడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
►మన ప్రతినిధిగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తున్నారు. ఎక్కడైనా పొరపాటున అర్హత ఉండికూడా రాని పరిస్థితి ఉంటే… అటువంటి వాళ్లకీ మళ్లీ మంచిచేయాలన్నదే ఈ గడపగడపకూ కార్యక్రమం ఉద్దేశం.అందరికీ మంచి చేయాలన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ఇచ్చాం. ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు ఈ నిధులు కేటాయిస్తాం.
►ప్రతి సచివాలయంలో కనీసం రెండు రోజులు గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటల పాటు ఆ సచివాలయంలో తిరగాలని చెప్పాం. దీనివల్ల ప్రాధాన్యతగా చేపట్టాల్సిన పనులను గుర్తించగలుగుతాం.
►అన్నిరకాలుగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే, ఎన్నికలకు దాదాపుగా రెండేళ్లకు ముందే నాయకులను ఈ విధంగా తిప్పిన కార్యక్రమం గతంలో ఎన్నడూ లేదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి సాధకబాధకాలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి.
►ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే, అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం మంచి విజయాలు సాధిస్తాం. ముఖ్యమంత్రిగా నేను డీబీటీ ఇవ్వడం అయితేనేమి, స్కూళ్లు బాగుచేయడం అయితేనేం, ఆస్పత్రులు బాగుచేయడం అయితేనేం, వ్యవసాయం బాగుండేలా చూడ్డం అయితేనేం.. ఇలా నేను చేయాల్సింది నేను చేయాలి. అదే సమయంలో మీరు చేయాల్సింది మీరు చేయాలి:
►నేను, మీరు కలిస్తేనే.. 175కి 175 సీట్లు సాధించగలుగుతాం, ఇదేమీ కష్టం కాదు, అసాధ్యం కానేకాదు. ప్రతినియోజకవర్గంలో గ్రామం ఒక యూనిట్, ఆ గ్రామంలో 87శాతం కుటుంబాలకు మేలు జరిగినప్పుడు, అందరి కంటికి కనిపించినట్టుగా గ్రామ, వార్డు సచివాలయాలు, ఇంగ్లిషు మీడియం, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు, వ్యవసాయం చేసే తీరు మారుతున్నప్పుడు.. ఆ గ్రామంలో మెజార్టీ రావడం ఎందుకు సాధ్యంకాదు.
►గ్రామంలో వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఎందుకు రాదు? నియోజకవర్గాల్లో వచ్చినప్పుడు 175కి 175 ఎందుకు రావు. కుప్పంలోనే కాదు అద్దంకిలో కూడా మొత్తం 5కి 5జడ్పీటీసీలు, ఎంపీపీలు ఐదింటికి ఐదు, ఇక మున్సిపాలిటీ, 103 గ్రామ పంచాయతీల్లో 87 సర్పంచి స్థానాలు గెలిచాం.
►దేవుడి దయతో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. 151 సీట్లు గతంలో వస్తే..ఇలాంటి మంచి పనులు జరిగినప్పుడు, ఇప్పుడు 175కి 175 సీట్ల సాధించగలుగుతాం. ఏమైనా సమస్యలు ఉంటే.. కుటుంబంగా వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు నడవాలి, అందరం ఒక్కటై కష్టపడదాం, 175కి 175 సీట్లు సాధిద్దాం. అద్దంకిలో మునుపెన్నడూలేని విజయాన్ని నమోదు చేద్దాం.
ఇదీ చదవండి: CM YS Jagan: అంగన్‌వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment