ADDANKI constituency
-
అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ
-
అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి న్యూస్, అమరావతి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 19 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలని నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన పనులు, సంక్షేమ పథకాల వివరాలను గణాంకాలతో సహా వివరించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే… ►నియోజకవర్గంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు వస్తుంది. డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశాం, ఈ నియోజక వర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081కోట్లు ఇచ్చాం, 93,124కుటుంబాలకు మేలు చేశాం. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి పట్టాలు ఇచ్చాం. 47,123 మందికి బియ్యంకార్డులు మంజూరు చేశాం. ►ఈ స్థాయిలో ఇంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా చేశాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీకూడా, ఏ ఒక్కరికీ మిస్‌కాకుండా ఆయా కుటుంబాలకు మంచిచేశాం, బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి జమచేశాం. చేసిన మంచి ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ వివరిస్తూ, వారికి లేఖలు ఇస్తూ గడపగడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ►మన ప్రతినిధిగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తున్నారు. ఎక్కడైనా పొరపాటున అర్హత ఉండికూడా రాని పరిస్థితి ఉంటే… అటువంటి వాళ్లకీ మళ్లీ మంచిచేయాలన్నదే ఈ గడపగడపకూ కార్యక్రమం ఉద్దేశం.అందరికీ మంచి చేయాలన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ఇచ్చాం. ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు ఈ నిధులు కేటాయిస్తాం. ►ప్రతి సచివాలయంలో కనీసం రెండు రోజులు గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటల పాటు ఆ సచివాలయంలో తిరగాలని చెప్పాం. దీనివల్ల ప్రాధాన్యతగా చేపట్టాల్సిన పనులను గుర్తించగలుగుతాం. ►అన్నిరకాలుగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే, ఎన్నికలకు దాదాపుగా రెండేళ్లకు ముందే నాయకులను ఈ విధంగా తిప్పిన కార్యక్రమం గతంలో ఎన్నడూ లేదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి సాధకబాధకాలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. ►ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే, అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం మంచి విజయాలు సాధిస్తాం. ముఖ్యమంత్రిగా నేను డీబీటీ ఇవ్వడం అయితేనేమి, స్కూళ్లు బాగుచేయడం అయితేనేం, ఆస్పత్రులు బాగుచేయడం అయితేనేం, వ్యవసాయం బాగుండేలా చూడ్డం అయితేనేం.. ఇలా నేను చేయాల్సింది నేను చేయాలి. అదే సమయంలో మీరు చేయాల్సింది మీరు చేయాలి: ►నేను, మీరు కలిస్తేనే.. 175కి 175 సీట్లు సాధించగలుగుతాం, ఇదేమీ కష్టం కాదు, అసాధ్యం కానేకాదు. ప్రతినియోజకవర్గంలో గ్రామం ఒక యూనిట్, ఆ గ్రామంలో 87శాతం కుటుంబాలకు మేలు జరిగినప్పుడు, అందరి కంటికి కనిపించినట్టుగా గ్రామ, వార్డు సచివాలయాలు, ఇంగ్లిషు మీడియం, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు, వ్యవసాయం చేసే తీరు మారుతున్నప్పుడు.. ఆ గ్రామంలో మెజార్టీ రావడం ఎందుకు సాధ్యంకాదు. ►గ్రామంలో వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఎందుకు రాదు? నియోజకవర్గాల్లో వచ్చినప్పుడు 175కి 175 ఎందుకు రావు. కుప్పంలోనే కాదు అద్దంకిలో కూడా మొత్తం 5కి 5జడ్పీటీసీలు, ఎంపీపీలు ఐదింటికి ఐదు, ఇక మున్సిపాలిటీ, 103 గ్రామ పంచాయతీల్లో 87 సర్పంచి స్థానాలు గెలిచాం. ►దేవుడి దయతో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. 151 సీట్లు గతంలో వస్తే..ఇలాంటి మంచి పనులు జరిగినప్పుడు, ఇప్పుడు 175కి 175 సీట్ల సాధించగలుగుతాం. ఏమైనా సమస్యలు ఉంటే.. కుటుంబంగా వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు నడవాలి, అందరం ఒక్కటై కష్టపడదాం, 175కి 175 సీట్లు సాధిద్దాం. అద్దంకిలో మునుపెన్నడూలేని విజయాన్ని నమోదు చేద్దాం. ఇదీ చదవండి: CM YS Jagan: అంగన్వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు -
అద్దంకి నియోజకవర్గ ఇంచార్జిగా బాచిన కృష్ణ చైతన్య
సాక్షి, ప్రకాశం : గత టీడీపీ హయాంలో నియోజకవర్గానికి కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేకపోయారని మంత్రి బాలినేని శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలకు మేరకు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జిగా బాచిన కృష్ణ చైతన్యను నియమించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గరటయ్య తరఫున ఆయన కుమారుడు కృష్ణచైతన్య కీలకంగా వ్యవహరించారు. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఈయన నియామకం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి బాలినేని మాట్లాడుతూ.. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒంగోలుకి మంచి నీటి సమస్య లేకుండా చూస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో కేవలం కమీషన్లు మాత్రమే రాజ్యమేలేవని, కానీ నేడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పటిన జీ ప్లస్ ఇళ్ల నిర్మాణం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నేతృత్వంలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు' మంత్రి తెలిపారు. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
గొట్టిపాటి రవికుమార్‌కు భద్రత పెంచండి డీజీపీకి వైఎస్సార్సీపీ శాసనసభ్యుల వినతి సానుకూలంగా స్పందించిన జేవీ రాముడు హైదరాబాద్: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీ జేవీ రాముడికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు డీజీపీని కలిశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో రవికుమార్‌పై దౌర్జన్యం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనకు భద్రత పెంచాలని కోరారు. ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ నేతృత్వంలోనే.. వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. జిల్లాలో బలరామ్, వెంకటేష్‌ల వరుస దౌర్జన్యాలను వివరించారు. గొట్టిపాటి రవిపై దాడి జరగడం ఇది మూడోసారని, ఆయనకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని, నిత్యం ఆయన వెంట ముగ్గురు అంగరక్షకులు ఉండేలా (3+3) భద్రత కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తులపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, తక్షణం అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు తెలిపారు. రవికుమార్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆదిమూలం సురేష్ (సంతనూతలపాడు), ఎం.అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), జంకె వెంకట్‌రెడ్డి (మార్కాపురం), పోతుల రామారావు (కందుకూరు)లు డీజీపీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సురేష్ మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు, మాజీ శాసనసభ్యులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమే కాకుండా పదేపదే దాడులకు దిగుతున్నారని చెప్పారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీ, జిల్లా సమావేశాల్లో వారి సమస్యల్ని లేవనెత్తుతున్నామని, ఇవి టీడీపీ వారికి కంటగింపుగా మారి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తనపై దాడి గురించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయలేదని రవికుమార్ తెలిపారు. తన నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలు చాలా ఉన్నాయని, రాజకీయ ప్రత్యర్ధుల నుంచి తన ప్రాణాలకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన వివరించారు. తమ కుటుంబం చేతిలో మూడుసార్లు ఓడిపోయినవారు అక్కసుతో ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్షం గొంతునొక్కడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే గతంలో తన సోదరుడు గొట్టిపాటి కిశోర్ ను హతమార్చారని వివరించారు. పదేపదే దాడులు ఉపేక్షించబోమని, పార్టీ కార్యకర్తల రక్షణకు, వారి ఆత్మస్థైర్యం కోసం పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో గుండ్లకమ్మపై సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రులు, శాసనసభ్యుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలే దాడి చేశారని, గతంలోనూ ఇలానే జరిగినట్లుగా తమ విచారణలో తేలిందని డీజీపీ సైతం అంగీకరించినట్లు తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో జరిగిన అధికారిక సమావేశానికి ఎమ్మెల్యేలు కాని వారినీ అనుమతిస్తూ టీడీపీ ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కుతోందని డేవిడ్ రాజు ధ్వజమెత్తారు. కరణం బలరామ్, కరణం వెంకటేష్‌ల నేతృత్వంలోనే సోమవారం నాటి దాడి జరిగిందని పునరుద్ఘాటించారు. టీడీపీ గూండా రాజకీయాలు, దౌర్జన్యాలకు వైఎస్సార్ సీపీ భయపడదని, వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల కోసం, వారి సమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. జగన్‌తో భేటీ డీజీపీని కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. టీడీపీ నేతల దాడి, రవికుమార్ కారును ధ్వంసం చేయడానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. అధికార పార్టీ ఆగడాలపై జగన్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అద్దంకిలో 144వ సెక్షన్ మరోవైపు సోమవారం నాటి దాడి నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో గొడవలు జరుగుతాయనే అనుమానంతో 144 సెక్షన్ విధించారు. ఈ కేసు నిందితులలో ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నా ప్రధాన నిందితుల జోలికి మాత్రం పోలేదు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులున్నా అరెస్టు చేయలేదు. కరణం బలరామ్ మంగళవారం ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ పోలీసులు బందోబస్తుకే పరిమితమయ్యారు.