దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి | Take on the actions of those who attack | Sakshi
Sakshi News home page

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి

Published Wed, Jan 14 2015 1:45 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి - Sakshi

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి

గొట్టిపాటి రవికుమార్‌కు భద్రత పెంచండి 
డీజీపీకి వైఎస్సార్‌సీపీ శాసనసభ్యుల వినతి 
సానుకూలంగా స్పందించిన జేవీ రాముడు

 
హైదరాబాద్: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీ జేవీ రాముడికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు డీజీపీని కలిశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో రవికుమార్‌పై దౌర్జన్యం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనకు భద్రత పెంచాలని కోరారు. ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ నేతృత్వంలోనే.. వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. జిల్లాలో బలరామ్, వెంకటేష్‌ల వరుస దౌర్జన్యాలను వివరించారు.

గొట్టిపాటి రవిపై దాడి జరగడం ఇది మూడోసారని, ఆయనకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని, నిత్యం ఆయన వెంట ముగ్గురు అంగరక్షకులు ఉండేలా (3+3) భద్రత కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తులపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, తక్షణం అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు తెలిపారు. రవికుమార్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆదిమూలం సురేష్ (సంతనూతలపాడు), ఎం.అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), జంకె వెంకట్‌రెడ్డి (మార్కాపురం), పోతుల రామారావు (కందుకూరు)లు డీజీపీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

సురేష్ మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు, మాజీ శాసనసభ్యులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమే కాకుండా పదేపదే దాడులకు దిగుతున్నారని చెప్పారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీ, జిల్లా సమావేశాల్లో వారి సమస్యల్ని లేవనెత్తుతున్నామని, ఇవి టీడీపీ వారికి కంటగింపుగా మారి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తనపై దాడి గురించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయలేదని రవికుమార్ తెలిపారు. తన నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలు చాలా ఉన్నాయని, రాజకీయ ప్రత్యర్ధుల నుంచి తన ప్రాణాలకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన వివరించారు.

తమ కుటుంబం చేతిలో మూడుసార్లు ఓడిపోయినవారు అక్కసుతో ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్షం గొంతునొక్కడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే గతంలో తన సోదరుడు గొట్టిపాటి కిశోర్ ను హతమార్చారని వివరించారు. పదేపదే దాడులు ఉపేక్షించబోమని, పార్టీ కార్యకర్తల రక్షణకు, వారి ఆత్మస్థైర్యం కోసం పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో గుండ్లకమ్మపై సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రులు, శాసనసభ్యుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలే దాడి చేశారని, గతంలోనూ ఇలానే జరిగినట్లుగా తమ విచారణలో తేలిందని డీజీపీ సైతం అంగీకరించినట్లు తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో జరిగిన అధికారిక సమావేశానికి ఎమ్మెల్యేలు కాని వారినీ అనుమతిస్తూ టీడీపీ ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కుతోందని డేవిడ్ రాజు ధ్వజమెత్తారు. కరణం బలరామ్, కరణం వెంకటేష్‌ల నేతృత్వంలోనే సోమవారం నాటి దాడి జరిగిందని పునరుద్ఘాటించారు. టీడీపీ గూండా రాజకీయాలు, దౌర్జన్యాలకు వైఎస్సార్ సీపీ భయపడదని, వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల కోసం, వారి సమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

జగన్‌తో భేటీ
డీజీపీని కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. టీడీపీ నేతల దాడి, రవికుమార్ కారును ధ్వంసం చేయడానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. అధికార పార్టీ ఆగడాలపై జగన్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అద్దంకిలో 144వ సెక్షన్
మరోవైపు సోమవారం నాటి దాడి నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో గొడవలు జరుగుతాయనే అనుమానంతో 144 సెక్షన్ విధించారు. ఈ కేసు నిందితులలో ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నా ప్రధాన నిందితుల జోలికి మాత్రం పోలేదు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులున్నా అరెస్టు చేయలేదు. కరణం బలరామ్ మంగళవారం ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ పోలీసులు బందోబస్తుకే పరిమితమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement