AP CM YS Jagan To Hold High Level Meeting On Nadu Nedu In Medical Camp - Sakshi
Sakshi News home page

పల్లెకు ‘ఆరోగ్యం’

Published Tue, Aug 3 2021 2:34 AM | Last Updated on Tue, Aug 3 2021 1:37 PM

CM YS Jagan High Level Meeting on nadu nedu in Medical field - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్‌ జరగాలని, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పీహెచ్‌సీలతో కూడా అనుసంధానం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒక మంచి ఉద్దేశంతో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టామని, కార్పొరేట్‌ తరహా వాతావరణం అక్కడ కనిపించాలని సూచించారు. బెడ్‌ షీట్స్‌ దగ్గర నుంచి సేవల వరకు అన్ని విషయాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా నిర్వహణ ఉండాలన్నారు. ఈ తరాలకే కాదు.. భవిష్యత్తు తరాలవారికి కూడా అత్యుత్తమ వైద్యం అందాలన్నదే తన కల అని సీఎం పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’ కార్యక్రమాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు 

డిసెంబర్‌కి అన్నీ పూర్తి..
వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానించాలి. ల్యాబ్స్‌తోనూ అనుసంధానం చేయడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుంది. గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్‌ జరగాలి. ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ విలేజ్‌ క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలి. ఇదివరకే సేకరించిన డేటా వివరాలను ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానించాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు చికిత్సకు ఈ వివరాలెంతో సహాయపడతాయి. సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యమందించేందుకు దోహదపడుతుంది. డిసెంబర్‌ నాటికి విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింటినీ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ ఆస్పత్రులే మదిలో మెదలాలి..
ఒక మంచి ఉద్దేశంతో 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను చేపట్టాం. అక్కడ కార్పొరేట్‌ తరహా వాతావరణం కనిపించాలి. కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తే అక్కడ అందే సదుపాయాలతో ఎలాంటి భావన కలుగుతుందో ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ప్రజలకు అదే రకమైన భావన కలగాలి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యం సరిగా లేకపోతే చికిత్స పొందేందుకు వాళ్ల ఆప్షన్‌ మనం కడుతున్న ప్రభుత్వాస్పత్రులే కావాలి. ఆ తరహాలో నాణ్యతతో కూడిన నిర్వహణ ఉండాలి. మెడికల్‌ కాలేజీల్లో సరైన యాజమాన్య విధానాలపై నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక(ఎస్‌వోపీ)లు రూపొందించాలి.  మెడికల్‌ కాలేజీల ఆస్పత్రుల్లో వాతావరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, కొత్తగా కనిపించాలి. అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందాలి. నిర్వహణపరంగా ఎలా ఉండాలి? నిర్మాణం పూర్తైన తర్వాత ఎలా ఉండాలి? అనే వాటిపై నిర్దిష్ట విధానాలతో నివేదిక రూపొందించాలి.

మండలానికి రెండు పీహెచ్‌సీలు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,149 పీహెచ్‌సీలు ప్రజలకు సేవలందిస్తుండగా కొత్తగా మరో 176 ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్‌సీలుంటాయి. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు చొప్పున విధులు నిర్వహిస్తారు. ఇలా ఒక్కో మండలంలో నలుగురు డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రకారం ప్రతి వైద్యుడు మండలంలోని 7 నుంచి 8 గ్రామాలను ఓన్‌ చేసుకుని వారానికి ఒకసారి ఏదైనా ఊరికి వెళ్లి వారికి అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారు.

పురోగతిలో కాలేజీల పనులు
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల పనుల పురోగతిని సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. పాడేరు, విజయనగరం, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్‌ కాలేజీల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనకాపల్లి, నంద్యాలలో మెడికల్‌ కాలేజీల స్థలాలపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలైనట్లు పేర్కొనటంతో వెంటనే పరిష్కారం దిశగా ప్రయత్నించాలని సీఎం సూచించారు. అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండల్లో వైద్య కళాశాలల పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా కాంట్రాక్ట్‌ సంస్థకు పనులు అవార్డ్‌ చేశామని, వెంటనే మొదలవుతాయని చెప్పారు. ప్రస్తుతం సేవలందిస్తున్న 11 బోధనాస్పత్రుల్లో కూడా ‘నాడు – నేడు’ ద్వారా అప్‌గ్రెడేషన్, సదుపాయాలను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో నాడు– నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గడువులోగా పనులు పూర్తయ్యేలా అన్ని వివరాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

విలేజ్‌ క్లినిక్స్‌లో సదుపాయాలు ఇలా
► విలేజ్‌ క్లినిక్స్‌లో ప్రజలకు అందుబాటులో 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు
► 14 రకాల టెస్టులు
► 65 రకాల ఔషధాలు 
► 67 రకాల బేసిక్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ 
► టెలీమెడిసిన్‌ సేవలు 
► బీఎస్సీ నర్సింగ్, సీపీసీహెచ్‌ కోర్సు చేసిన ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌) సేవలు లభ్యం 
► ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల సేవలు 
► ఔట్‌ పేషెంట్‌ పరీక్షల గది, ల్యాబ్, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్‌తోపాటు క్వార్టర్స్‌ ఏర్పాటు వల్ల 24 గంటలు ఏఎన్‌ఎం సేవలు అందుబాటులో  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement