అవ్వాతాతలకు వైఎస్సార్‌ కంటి వెలుగు | CM YS Jagan will launch the YSR Kanti Velugu third phase in Kurnool | Sakshi
Sakshi News home page

అవ్వాతాతలకు వైఎస్సార్‌ కంటి వెలుగు

Published Tue, Feb 18 2020 4:16 AM | Last Updated on Tue, Feb 18 2020 8:12 AM

CM YS Jagan will launch the YSR Kanti Velugu third phase in Kurnool - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం కర్నూలులో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రాథమిక, సెకండరీ స్క్రీనింగ్‌ కంటి పరీక్షలను సమాంతరంగా ప్రారంభించి జూలై 31వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. అద్దాలు అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్‌ పూర్తయిన తర్వాత పక్షం రోజుల్లో వలంటీర్ల ద్వారా పెన్షన్లతో పాటు కళ్ల జోళ్లను కూడా అందజేయనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తారు. మార్చి 1వ తేదీ నుంచి గుర్తించిన ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తారు. తొలుత 175 నియోజకవర్గాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత మరో మండలంలో పూర్తి చేస్తారు. ఇలా అన్ని మండలాల్లో కంటి పరీక్షలను నిర్వహించనున్నారు.  

అంధత్వ శాతం తగ్గించడమే లక్ష్యం 
ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రస్తుతం 1 శాతం ఉన్న అంధత్వాన్ని 0.3 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా  రాష్ట్ర వ్యాప్తంగా 5.30 కోట్ల మందికి ప్రభుత్వం కంటి వైద్య పరీక్షలు చేపట్టింది. రూ.560 కోట్ల వ్యయంతో 2022 జనవరి 31కి ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొలి విడత గత ఏడాది అక్టోబర్‌ 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని (ప్రభుత్వ, ప్రైవేట్‌) 60,401 పాఠశాలల్లో 66,15,467 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 4,36,979 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించారు. రెండవ విడత కార్యక్రమంలో వీరికి పరీక్షలు నిర్వహించి 2,40,997 మందికి ఔషధాలు పంపిణీ చేశారు. 1,52,779 మంది విద్యార్థులకు కళ్లద్దాలు ఇవ్వాలని వైద్యులు సూచించగా, ఈ నెల 15వ తేదీ వరకు 56,767 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. మిగతా వారికి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 46,286 మంది విద్యార్థులకు మూడోసారి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 2,177 మంది విద్యార్థులకు శస్త్ర చికిత్స అవసరమని ప్రాథమికంగా గుర్తించారు.  

ముఖ్యమంత్రి పర్యటన ఇలా..  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరతారు. 10.30 గంటలకు కర్నూలు జిల్లా ఓర్వకల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలకు చేరుకుని డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రథమ, ద్వితీయ దశల్లో చికిత్స చేయించుకున్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేస్తారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రధాన మంత్రి వందన యోజనను అమలు చేసినందుకు జాతీయ అవార్డులు పొందిన మెడికల్‌ అధికారులను సత్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి ఓర్వకల్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరం వెళ్లి, తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. కాగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత సీఎం తొలిసారి జిల్లా పర్యటనకు వస్తుండడంతో 25 వేల మందితో మానవహారం ద్వారా ఘన స్వాగతం పలకనున్నారు.   

నాడు–నేడులో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాలకు శంకుస్థాపన 
నాడు–నేడు కార్యక్రమం కింద గ్రామీణ స్థాయిలో ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాలను ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌’ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్‌ సెంటర్లు) భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కర్నూలులో శంకుస్థాపన చేస్తారు. సభా ప్రాంగణంలో నిర్మించిన మోడల్‌ ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌’ సెంటర్‌ను సందర్శిస్తారు. 
- కంటి పరీక్షల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ఏ రోజుకారోజు ఏఎన్‌ఎంలు గ్రామ సచివాలయం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంప్యూటరీకరించనున్నారు.  
-  ప్రాథమిక స్కీనింగ్‌ బృందం రోజుకు 50 నుంచి 100 మందికి పరీక్షలు చేయనుంది.  
-  మంచంలో ఉన్న అవ్వాతాతల ఇళ్లకే వెళ్లి ప్రాథమిక స్క్రీనింగ్‌ చేయనున్నారు. 
- వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు అవ్వాతాతలను గ్రామ సచివాలయాల్లోని స్క్రీనింగ్‌ కేంద్రాలకు తీసుకువస్తారు. అక్కడే ప్రాథమిక స్క్రీనింగ్, అవసరమైన వారికి సెకండరీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement