వైఎస్సార్‌ కుటుంబంపై విభజించు–పాలించు ప్రయోగం: సీఎం జగన్‌ | CM YS Jagan at the India Today Education Conference | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ కుటుంబంపై విభజించు–పాలించు ప్రయోగం: సీఎం జగన్‌

Published Thu, Jan 25 2024 5:40 AM | Last Updated on Thu, Jan 25 2024 4:36 PM

CM YS Jagan at the India Today Education Conference - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తన సంక్షేమాభివృద్ధి పాలనే గీటురాయిగా వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వా­దాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేయడమే కాకుండా.. ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ఆమోదం పొందుతున్నట్టు చెప్పారు. గ్రామ/వార్డు సచివా­లయ, వలంటీర్‌ వ్యవస్థతో ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడం తనకు ఎంతో సంతోషా­న్నిచ్చిందన్నారు.

అర్హతే ప్రామాణికంగా, అవినీతికి తావులేకుండా రూ.2.53 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. దీనికి తోడు విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతలో విప్లవాత్మక మార్పులతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని చెప్పారు. 56 నెలల పాలనలో తన శాయశక్తులా, చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేశానని ఆత్మవిశ్వాసంతో చెబుతు­న్నానన్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ మళ్లీ నీచ రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. విభజించు.. పాలించు విధానాన్ని రాష్ట్రంలోనే కాకుండా వైఎస్సార్‌ కుటుంబంలోనూ అమలు చేస్తోందన్నారు. తిరుపతిలో రెండో రోజు బుధ­వారం జరిగిన ‘ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మి­ట్‌’లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు.

రాజ్‌దీప్‌: వచ్చే ఎన్నికల్లో మీ ఐదేళ్ల పాలన చూపి ఓట్లు అడగడం సులభంగా ఉంటుందా? లేక 2019కి ముందు ప్రతిపక్షంలో యాత్ర చేసి ఓట్లు అడిగారు.. గెల్చారు. రెండింటిలో ఏది బాగుందని అనుకుంటున్నారు?
సీఎం జగన్‌: వాస్తవం కంటే విశ్వాసం అనేది ఎప్పటికైనా బలమైంది. నా విషయంలో నేను ఏం చెప్పాను? ఏ హామీలు ఇచ్చాను? ఏం చేశాను? అన్న దే ముఖ్యం. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99 శాతం అమలు చేశాం. అంతటితో ఆగకుండా ఆ మేని ఫెస్టోను తీసుకెళ్లి ప్రజలకు చూపించి వారి ఆమోదం పొందుతున్నాం. ప్రజల్లో ఇదే మా ప్రభు­త్వంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతోంది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక పా­ల­నకు శ్రీకారం చుట్టాం. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథ­కా­ల­ను ఇంటికే అందజేస్తున్నాం. మా పాలనలో ఎక్క­డా వివక్ష చూపడం లేదు. అర్హతే ప్రామాణికంగా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నాం. అత్యంత పా­రదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా సాయం అందిస్తున్నాం.  

రాజ్‌దీప్‌:  మేనిఫెస్టో అమలు, అవినీతికి తావు లేకుండా డీబీటీ ద్వారా పథకాల పంపిణీ.. ఇవే మీ ప్రచార అంశాలా?  
సీఎం జగన్‌: మొత్తం మార్పులో డీబీటీ ఒక భాగం మాత్రమే. నిజం చెప్పాలంటే.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ పనితీరు మారింది. మహిళా సాధికారత పెరిగింది. వీటన్నింటికీ తోడుగా డీబీటీ పేదల జీవన పరిస్థితులను మెరుగు పర్చింది. ఇందులో ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా చేశాం. ఇవన్నీ మా ప్రభుత్వాన్ని నిలబెడతాయనే దృఢమైన విశ్వాసం మాకుంది.

రాజ్‌దీప్‌: మీరు చేసిన మంచే మిమ్మల్ని గెలుపిస్తుందని అంటున్నారు. కానీ, విపక్షాలు మాత్రం మీ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని, అవినీతి పెరిగిందని ఆరోపిస్తున్నాయి.. దీనికి మీ సమాధానం?
సీఎం జగన్‌: ఏ పార్టీ కూడా మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్పలేదు. ఏ ఒక్క నాయకుడు కూడా మేము అవినీతి చేశామని చూపలేరు. ఎందుకంటే ఈ 56 నెలల్లో వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో పూర్తి పారదర్శకంగా రూ.2.53 లక్షల కోట్లు డీబీటీ విధానంలో జమ చేశాం. ఇలా గతంలో ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు.

రాజ్‌దీప్‌: 2024లో మీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ఎవరని భావిస్తున్నారు?  
సీఎం జగన్‌: రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు నామమాత్రమే. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ బలం లేదు. కాబట్టి సహజంగానే ఇక్కడ మా వైఎస్సార్‌ సీపీకి, తెలుగుదేశం–జనసేన కూటమితో పాటు, వారికి మద్దతు ఇచ్చే వారితోనే పోటీ ఉంటుంది. 

రాజ్‌దీప్‌: చంద్రబాబు బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు కాబట్టే రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లారనిపిస్తుంది? మీరు ఇష్యూ ఆధారంగా బీజేపీకి సపోర్టు చేస్తూ వచ్చారు? ఆంధ్రా పార్టీలను బీజేపీ, మోదీల విషయంలో ఎలా చూడాలి?
సీఎం జగన్‌: మాకు తొలి నుంచి ఒక స్పష్టమైన విధానం ఉంది. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సయోధ్య కొనసాగిస్తున్నాం. 

రాజ్‌దీప్‌: 2009లో ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌కు.. ఇప్పటి సీఎం జగన్‌కు మధ్య మార్పు ఏమిటి?
సీఎం జగన్‌:  రాజకీయాల్లో నా ప్రస్థానం, నాలో మార్పులను నా కంటే మీరే (రాజ్‌దీప్‌) ఇంకా బాగా చెప్పగలరు. ఈ 56 నెలల పాలనలో నా వంతుగా నేను శాయశక్తులా, చిత్తశుద్ధితో పని చేశా. దాన్ని ఆత్మ విశ్వాసంతో చెప్పగలను. కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలు తాకాను. అది నాకెంతో తృప్తినిస్తోంది. అన్ని బహిరంగ సభల్లో నేను ఒకటే చెబుతున్నాను. నేను మీకు మంచి చేశానని అనుకుంటే, మీకు మేలు జరిగిందని భావిస్తే.. నాకు తోడుగా నిలవమని ప్రజలను కోరుతున్నాను.  

రాజ్‌దీప్‌: మీ చెల్లెలు షర్మిలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది? ఇది వైఎస్సార్‌ లెగస్సీలో చీలకతేవడం కాదా? వైఎస్సార్‌ వల్లే కదా 2004, 2009లో యూపీఏ అధికారంలోకి వచ్చింది.. కానీ, కాంగ్రెస్‌ మీ విషయంలో చేస్తున్నదానికి కోపం లేదా? 
సీఎం జగన్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ నీచ రాజకీయాలు చేస్తోంది. వారి స్వార్థం కోసం ఆనాడు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు. విభజించు– పాలించు అన్నది రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా, మా కుటుంబంలో కూడా చేశారు. నేను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిలబడినప్పుడు నా సొంత బాబాయిని మంత్రిగా చేశారు. తర్వాత మా పార్టీ అభ్యర్థిపైనే పోటీకి నిలబెట్టారు. ఆ విధంగా కాంగ్రెస్‌ ఎప్పుడూ విభజించు–పాలించు అన్న రాజకీయాలే చేసింది. ఇప్పుడు కూడా అదే చేశారు.

నా కుటుంబాన్ని విడగొట్టారు. మా చెల్లిని తీసుకొచ్చి, ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని చేశారు. కానీ, వారొక విషయాన్ని మర్చిపోతు­న్నారు. పైన దేవుడనే వాడు న్నాడు. ఎవరికి ఎప్పుడు, ఎలా గుణపాఠం చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. నాకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్‌ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదు. 

రాజ్‌దీప్‌: మాజీ సీఎం చంద్రబాబు జైలుకు వెళ్లాడు. దీనిని ప్రతీకార రాజకీయంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి? సీఐడీని దుర్వినియోగం చేశారనడం నిజమేనా?
సీఎం జగన్‌:
చంద్రబాబు అవినీతి ఆరోపణలపై అరెస్ట్‌ అయ్యారు. అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. కోర్టు జైలుకు పంపింది. అలాంటప్పుడు ఎవరైనా అది ప్రతీకార రాజకీయమని ఎలా అంటారు? ఎవరైనా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేరు. ఎందుకంటే, ఏం చేసినా కోర్టుల్లో లిట్మస్‌ టెస్ట్‌ ఉంటుంది కదా? ఆధారాలు లేకపోతే, ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే, కేసులు కోర్టుల్లో నిలబడవు కదా? ఆధారాలు ఉన్నాయని కోర్టులు కన్విన్స్‌ అయితే తప్ప, నిర్ణయాలు తీసుకోవు కదా? పైగా ఇక్కడ హైప్రొఫైల్‌ కేసు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ సీఎం కూడా, అలాంటి చర్యలకు దిగరు. కచ్చితమైన ఆధారాలు ఉంటే తప్ప.. కేసు బలంగా ఉంటే తప్ప.. అలాంటివి జరగవు కదా!

రాజ్‌దీప్‌: మీ పార్టీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తున్నారు. కొందరు బయటకు వెళ్తున్నారు. ఇది వ్యతిరేకతను పెంచదా?
సీఎం జగన్‌: ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ స్వయంగా సర్వే నిర్వహిస్తుంది. దాని ప్రకారం వ్యూహ రచన ఉంటుంది. మేము ప్రజలకు మనస్ఫూర్తిగా చాలా మేలు చేశాం. ఇదే మా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకాన్ని పదిలం చేసింది. కానీ స్థానికంగా కొందరు నాయకుల తీరు, ప్రజలతో మమేకం కాకపోవడం, వారిపై వ్యతిరేకత కారణాలతో మార్పులు, చేర్పులు అనివార్యం అయ్యింది. మాకు సంబంధించి.. ఎన్నికలు మరో 70, 80 రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆఖరి క్షణం వరకు ఆగి అప్పుడు మార్పులు చేస్తే లేనిపోని గందరగోళం సృష్టించినట్టు అవుతుంది. దానికి బదులు ముందుగా చేస్తే అందరికీ క్లారిటీ ఉంటుంది.

అదే ప్రభుత్వం.. అదే బడ్జెట్‌. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే.. ఇప్పుడే అప్పులు తక్కువ. ఇక్కడ మారిందల్లా సీఎం మాత్రమే. ఈ ప్రభుత్వం ఇన్ని చేయగలిగినప్పుడు.. గతంలో ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ఇదే నాంది.   – సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement