India Today Rajdeep Sardesai Exclusive Interview With Andhra Pradesh CM Jagan Mohan Reddy, Video Inside | Sakshi
Sakshi News home page

CM YS Jagan Interview: అదే నా కల.. ఎప్పటికీ జనం గుండెల్లో బతికి ఉండాలి

Published Wed, May 1 2024 5:46 AM | Last Updated on Wed, May 1 2024 6:16 PM

India Today Rajdeep Sardesai hosts exclusive interview with Andhra Pradesh CM Jagan Mohan Reddy

ఎప్పటికీ జనం గుండెల్లో బతికి ఉండాలి 

దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా 

రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం 

అవినీతి, వివక్ష ఎక్కడుంది? ప్రజల్లోకి వెళ్లి నేరుగా మైకు పెట్టి అడగండి   

ఇండియాటుడే టీవీ చానల్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఇంటర్వ్యూలో సీఎం వైఎస్‌ జగన్‌  

‘అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రజలు, అగ్రవర్ణ పేదల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని గట్టిగా నమ్ముతున్నా.ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. నేను మరణించినా, ప్రజలగుండెల్లో బతికి ఉండాలన్నదే నా కల’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలనేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ను ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూ చేసింది.

రాజ్‌దీప్‌: మీరు మళ్లీ గెలిస్తే విశాఖపట్నన్నిరాజధానిని చేసే విషయంలో మీరు కచ్చితమైన స్పష్టతతో ఉన్నారా? 
సీఎం జగన్‌: అమరావతి గురించి మాట్లాడే వారు రూ. లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారో చెప్పగలరా.. కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేదు. ఒక వేళ అమరావతి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడం మొదలు పెడితే పది పదిహేనేళ్లు పడుతుంది. అప్పటికి ఈ లక్ష కోట్లు పది లక్షల కోట్లు అవుతుంది. రాజధాని అనేది కలగానే మిగులుతుంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో నంబర్‌ వన్‌ నగరం. విశాఖలో ఇప్పటికే రహదారులు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు ఉంది. మౌలిక సదుపాయాలన్నీ అక్కడ ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు నుంచి రూ.10 వేల కోట్లు వెచ్చిస్తే రాబోయే 5–10 సంవత్సరాలలో హైదరాబాద్, బెంగళూరు లేదా చెన్నైతో వైజాగ్‌ పోటీ పడడాన్ని మీరు నిజంగా చూస్తారు.

రాజ్‌దీప్‌: మీరు 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి చంద్రబాబును చాలెంజ్‌ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మీకు చాలెంజ్‌ చేస్తున్నారు. మీరు అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లడం గతంతో పోలిస్తే ఇది కఠినంగా అనిపిస్తోందా? 
సీఎం జగన్‌: సాధారణ పరిస్థితుల్లో అనిపించొచ్చు. కానీ, ఇక్కడ వాస్తవం ఏమంటే.. మేము ప్రజలకు సుపరిపాలన అందించాం. మా మేనిఫెస్టోలోని 99 శాతం వాగ్దానాలను త్రికరణ శుద్ధిగా అమలు చేసి చూపించాం. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష లేకుండా.. అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబి్ధదారుల ఖాతాల్లో జమ చేశాం.  

రాజ్‌దీప్‌: మీరు చాలా డబ్బు ప్రజలకు చేరిందని చెబుతున్నారు.. ఇలా నగదు బదిలీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కొంత మంది ఆరోపిస్తున్నారు.. ఏపీలో నేరుగా రైతులకు డబ్బులు ఇస్తున్నారు. ఇలా క్యాష్‌ ట్రాన్స్‌ఫర్‌ కాకుండా.. ఉత్పాదక ఉపాధి కోరుకుంటున్న వాళ్లకి ఏం చెబుతారు?  
సీఎం జగన్‌: ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్‌దీప్‌.. కొందరిలో ఆ కన్ఫ్యూజన్‌ ఉంది. మేం చాలా సమగ్రమైన విధానాలను అనుసరించాం. రైతుల గురించే తీసుకుంటే.. ఏ విధంగా వ్యవసాయానికి భరోసా ఇచ్చామో తెలుస్తుంది. రాష్ట్రంలో 50 శాతం మంది అర్ధ హెక్టార్, 70 శాతం మంది ఒక హెక్టార్‌లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులున్నారు. ఇలాంటి వారందిరి కోసమే రైతు భరోసా ప్రవేశపెట్టాం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. 

మేము ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పి.. రూ.67,500 ఇచ్చాం. ఇది రైతులకు 80 శాతం సాగు ఖర్చులుగా ఉపయోగ పడుతుంది. దీనికి తోడు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాన్ని పెట్టాం. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్‌ చొప్పున సేవలు అందిస్తున్నారు. ప్రతి పథకం అవినీతి, వివక్ష లేకుండా క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుడి దగ్గరకు నేరుగా చేరుతోంది. సమస్త ప్రభుత్వ సేవలన్నీ పేదల ఇంటి ముంగిటనే నిలిచాయి.  

రాజ్‌దీప్‌: సంక్షేమ పథకాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అందుకే కేంద్రం సాయం కోసం ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించాయి కదా? 
సీఎం జగన్‌: రాజ్‌దీప్‌.. మనం డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నామో చూడాలి. ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. పథకానికి ఏ పేరు పెట్టినా ఆ డబ్బు ఎవరికి వెళ్లి.. ఎంత మేలు చేసిందో చూసుకోవాలి. దీన్ని సామాజిక పెట్టుబడిగా చూడాలి. 

రాజ్‌దీప్‌: రాష్ట్రంపై రూ.4.42 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ డబ్బుల కోసమే మీరు కేంద్రంపై ఆధారపడ్డారా? 
సీఎం జగన్‌: ఇదంతా ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకే ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది. ఆ పరిమితులను దాటి ఏ రాష్ట్రం కూడా అప్పు చేయలేదు.  

రాజ్‌దీప్‌: నేరుగా డీబీటీతో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారానే మీరు తిరిగి మరోసారి అధికారంలోకి వస్తారని నమ్ముతున్నారా? ఇదే మీ విన్నింగ్‌ కార్డు అనుకోవచ్చా? 
సీఎం జగన్‌: ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి.. ఎలా.. వెళ్లిందో చూడాలి. మేము ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లిష్‌ మీడియంలోకి తీసుకొచ్చాం. ద్విభాషా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ను పెట్టి డిజిటల్‌ బోధన అందిస్తున్నాం. ప్రతి ఎనిమిదో తరగతి విద్యార్థి చేతిలో బైజ్యూస్‌ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు పెట్టాం.

 ఇది సిలబస్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది. ఇలా చూస్తే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు కనిపిస్తాయి. టోఫెల్‌ శిక్షణ కోసం ప్రత్యేక పీరియడ్‌ తీసుకొచ్చాం. ఇదంతా ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థుల కోసం జరుగుతోంది. 2025 విద్యా సంవత్సరంలో ఫస్ట్‌ క్లాస్‌ విద్యార్థి ఐబీ సిలబస్‌లో చదువుకుంటాడు. 2035 నాటికి మా పిల్లలు ఐబీ బోర్డు పరీక్షలు రాస్తారు. ప్రతి ఏటా ఒక్కో తరగతికి ఐబీని అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ వెళ్తాం. సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి పేదవాడి భవితను మారుస్తోందనడానికి ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

రాజ్‌దీప్‌: 81 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను మీరు మార్చారు. వైఎస్సార్‌సీపీలో వన్‌ మ్యాన్‌ షో జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ అనే పేరు చెప్పి ఈ రోజున ఓట్లు అడుగుతున్నారు. ప్రాంతీయ పారీ్టలో ఇది హైరిస్క్‌ ఫార్ములా కాదంటారా? 
సీఎం జగన్‌: ప్రతి రాజకీయ పార్టీకి ఒక సొంత సర్వే ఉంటుంది. ఆ సర్వేల ప్రకారం ఈ రోజున మా ప్రభుత్వం మీద, సీఎంగా నా మీద ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇది రియాలిటీ. అందుకే నేను చాలా నమ్మకంగా ఉన్నాను.  

రాజ్‌దీప్‌: అందుకేనా జగన్‌ పేరిటే ఓట్లు అడుగుతున్నారు? 
సీఎం జగన్‌: అవును. నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలకు ఒకటే చెబుతున్నా. ప్రస్తుతం జరుగుతున్నవి ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని వివరిస్తున్నా. ‘మీ భవిష్యత్‌ జగన్‌తో ఉంటే భద్రంగా ఉంటుంది. జగన్‌ ద్వారానే మీ భవిష్యత్‌ మంచి మలుపు తిరుగుతుంది’ అంటేనే వైఎస్సార్‌సీపీకి ఓటేయమని అడుగుతున్నా. అంతేకాదు.. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినట్లయితేనే, మంచి పరిపాలన అందించారని భావిస్తేనే ఓటేయాలని అడుగుతున్న ఏకైక పార్టీ కూడా వైఎస్సార్‌సీపీ.  

రాజ్‌దీప్‌: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మీ సొంత చెల్లి షర్మిల ఇలా అందరూ అటు వైపు ఉంటే మీరొక్కరే ఇటువైపు ఉన్నారు. వాళ్లందరూ ఒక్కటిగా వస్తున్నారు. ఇది మీకు ఇబ్బందికరంగా లేదా?   
సీఎం జగన్‌: గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన నేను అందించాను. మంచి చేశాను కాబట్టే నేను ధైర్యంగా ఒంటరిగా ప్రజల్లోకి వెళుతున్నాను. ప్రజలకు కూడా నాపై నమ్మకం ఉంది. నన్ను ఒంటరిగా ఎదుర్కోడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అందుకే గుంపులుగా వస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 50 శాతం పైగా ఓట్లు ఎవరికి వస్తే వాళ్లు విజయం సాధిస్తారు.

రాజ్‌దీప్‌: అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధానిగా చేసేందుకు చాలా కష్టపడ్డానని, ఎంతో ఖర్చు చేశానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ మీరు మూడు రాజధానులు మా విధానం అంటున్నారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో స్ట్రక్‌ అయ్యింది. శాశ్వత రాజధాని లేకుండా పరిపాలన ఎలా? రైతుల నుంచి భూములు తీసుకుంటే ప్రస్తుత సీఎం వాటిని వెనక్కు ఇచ్చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. 
సీఎం జగన్‌: అమరావతి ఎక్కడుంది.. అమరావతి అంటే ఏమిటనేది ముందుగా మనం ఆలోచించాలి. అమరావతి.. గుంటూరు, విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 వేల ఎకరాల భూ సమీకరణ జరిగింది.‡ అదంతా మూడు పంటలు పండే భూమి. అమరావతి రాజధాని అనేది ఒక కుంభకోణం. 

తన సన్నిహితులు ముందే భూములు కొనుగోలు చేసేశాక అప్పుడు చంద్రబాబు అక్కడ రాజధానిని డిక్లేర్‌ చేశారు. రహదారులు, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే వారి సొంత నివేదిక ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. అంటే మొత్తంగా రూ. లక్ష కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బును రాష్ట్రం ఎక్కడి నుంచి తెస్తుంది? 

రాజ్‌దీప్‌: జగన్‌పై రాయితో దాడి చేయడం అనేది పూర్తిగా ఓ డ్రామా అని, అదంతా సింపతీ కోసం జగనే క్రియేట్‌ చేసుకున్నాడని చంద్రబాబు అంటున్నారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేసి, జైలుకు పంపారని, జగన్‌ ఆంధ్రాలో డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.. 
సీఎం జగన్‌: ఎవరి ద్వారా ఈ రాయి వచ్చింది? వాళ్ల మనుషుల ద్వారానే వచ్చింది. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ చంద్రబాబు నిలబడి, అదే వేగంతో అదే రాయితో కొట్టించుకుని, మూడు కుట్లు వేయించుకోమనండి. ఆయనకూ సింపతీ వస్తుంది.

రాజ్‌దీప్‌: పాత కేసుల్లో సీఐడీని వాడి చంద్రబాబును జైలుకు పంపారని, జగన్‌ శత్రువులను, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను ఈ విధంగా వేధిస్తారనే వాదన ఉంది. 
సీఎం జగన్‌: ఎవరు తప్పు.. ఎవరు ఒప్పు అనేది న్యాయస్థానం పెట్టే పరీక్షలో తేలుతుంది. చంద్రబాబుని 52 రోజులు జైలుకు పంపడం సరైనదేనని కోర్టులు భావించాయి. అంటే అతను ఏదో చేశాడనే కదా అర్థం. బెయిల్‌ అనేది ప్రతి ఒక్కరి హక్కు. అది ఏదో సమయంలో వస్తుంది. నిజం ఏంటంటే ఆ కుంభకోణం జరిగిందనడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయి.

రాజ్‌దీప్‌: ఎన్నికల అనంతరం కేంద్రంతోనూ, ప్రధానితోనూ మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? అభివృద్ధి కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు అంటున్నారు. 
సీఎం జగన్‌: ప్రస్తుతం చంద్రబాబు, మోదీ పొత్తులో ఉన్నారు. వారు పొత్తు పెట్టుకుంటే అభివృద్ధి కోసమా.. అదే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉంటే అది ఇంకోదానికోసమా?

రాజ్‌దీప్‌: సర్వశక్తులు ఒడ్డుతున్న వారితో పోరాటంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నదేమిటి? 
సీఎం జగన్‌: అణగారిన వర్గాలు, నిరుపేదల జీవితాలను మార్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడని నేను గట్టిగా నమ్ముతాను. దాని కోసం దేవుని దయ వల్ల నేను ఏం చేయగలనో అది చేస్తున్నాను. నాకు కావాల్సింది.. నా కల ఒక్కటే. నేను మరణించినా ప్రజల గుండెల్లో బతికుండాలి.    

రాజ్‌దీప్‌: ఇంగ్లిష్‌ మీడియం విద్య, ఐబీ, ఇలాంటి విప్లవాత్మక మార్పులన్నీ గ్రామ స్థాయిలో సాధ్యం అవుతాయా? క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయని అందరూ అంటున్నారు.. 
సీఎం జగన్‌: ఎవరు అంటున్నారు? ఈ రోజు మీరు ఒక గ్రామానికి వెళ్లండి. మార్పు మీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఈ సచివాలయం ద్వారా ప్రజలకు గ్రామ స్థాయిలోనే 600 రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 60, 70 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఉంటున్నారు. వీళ్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామస్తుడి చేయి పట్టి ముందుకు నడిపే కార్యక్రమం చేస్తున్నారు. 

అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు ముందుకు వెళితే ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ బడి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు పోతే వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. ఇవన్నీ గ్రామ స్థాయిలో అభివృద్ధికి తార్కాణాలు. గతంలో ఇవన్నీ ఎక్కడా మనకు కనిపించేవి కాదు. ప్రభుత్వం లేదా ఒక పెద్ద పరిశ్రమ ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యపడదు. 

ఎకానమీని డ్రైవ్‌ చేసే ఎంఎస్‌ఎంఈలు, సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ సెక్షన్‌లను మేం ప్రోత్సహించాం. ఈ రోజున 62 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అదే విధంగా స్వయం సహాయక బృందాల్లోని మహిళలు, మత్స్యకారులు, స్ట్రీట్‌ వెండర్స్, బార్బర్స్, టైలర్లు, ఆటో డ్రైవర్లు వీళ్లంతా రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. ఈ క్రమంలో వీరందరికీ బ్యాంక్‌లు, వివిధ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతగా నిలిచాం.  

రాజ్‌దీప్‌: మీరేమో అవినీతి లేదంటున్నారు? ప్రతిపక్ష నేత చంద్రబాబు భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.. 
సీఎం జగన్‌: చంద్రబాబు నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి అలా మాట్లాడుతున్నారు. మీరే నేరుగా ప్రజల దగ్గర మైక్‌ పెట్టి అడగండి. మేము చెప్పిన హామీలు, పథకాలతో ఎంత ఆరి్థక మేలు జరిగిందో చెబుతారు. పైస్థాయిలో నేను చెప్పిన ప్రతి రూపాయి కింది స్థాయిలోని లబి్ధదారులకు నేరుగా చేరింది. సంక్షేమ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా కోట్ల రూపాయలు లబి్ధదారుల ఖాతాల్లో పడుతుంటే అవినీతి, వివక్ష ఎక్కడ ఉంటుంది?  

రాజ్‌దీప్‌ : ఈ ఎన్నికల్లో మీ సోదరి మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు.  ఇది ప్రతిష్టకు భంగంగా భావిస్తున్నారా? 
సీఎం జగన్‌: ఆమె డిపాజిట్‌ కోల్పోతుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఏ పార్టీ అయితే నా తండ్రి పేరును సీబీఐ చార్జ్‌ షీట్‌లో చేర్చిందో.. ఏ పార్టీ అయితే కలి్పత కేసులను నాపై పెట్టిందో అందరికీ తెలుసు. అవి కాంగ్రెస్, టీడీపీలు. ఈ రోజు నా సోదరిని ఎవరు నడిపిస్తున్నారో తెలుసా.. రేవంత్‌ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రిమోట్‌ చంద్రబాబు చేతిలో ఉంది. బీజేపీ రిమోట్‌ చంద్రబాబు చేతిలో ఉంది. ఈ రోజు జగన్‌ ఫైట్‌ చేస్తోంది కేవలం ఒక్క బీజేపీతోనే కాదు. కాంగ్రెస్‌తో కూడా.

రాజ్‌దీప్‌: కేంద్రంలో అధికారం కోసంమోదీకి సీట్లు తగ్గితే మీరు 20 ఎంపీ సీట్లతో సపోర్ట్‌ చేస్తారా? 
సీఎం జగన్‌: ఊహాజనిత పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడటం.. ఇప్పుడు వారు నేను ఒకరికొకరం వ్యతిరేకంగా పోరాడుతున్నాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement