మాటల్లో చెప్పలేని ఆనందం
సొంత నియోజకవర్గంతో సమానంగా కుప్పంను అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తుండడం చాలా సంతోషం. ఈ పనులను ప్రారంభించేందుకు స్వయంగా ఆయనే వస్తుండడంతో మాటల్లో చెప్పలేని ఆనందం ఉంది. మా ప్రాంతంలో ప్రధానంగా తాగునీటి సమస్య చాలా కాలంగా ఉంది. సీఎం చొరవతో ఇప్పటికి పరిష్కారం లభించనుంది.
– చిలకమ్మ, కుప్పం
అభివృద్ధి చేసి చూపుతున్నారు
మాటల్లో చెప్పడమే కాదు, ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపుతోంది. పథకాల కోసం ఎక్కడెక్కడో తిరిగే పని లేకుండా వలంటీర్లే ఇంటి వద్దకు వచ్చి సేవలందిస్తున్నారు. ప్రతీ విషయంలో జవాబుదారీ ఉంటోంది. గతంలో పట్టణమంతా సమస్యలే. ఇప్పుడు కోట్లాది రూపాయల పనులు చేస్తుండటంతో వాటన్నింటికీ పరిష్కారం లభిస్తుందనే నమ్మకం కలిగింది.
– జయమ్మ, కుప్పం
ప్రజల అమాయకత్వాన్ని టీడీపీ అధినేత ఓట్లుగా మలుచుకున్నారే కానీ.. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదు. సమస్యలు పరిష్కారమైతే ఎక్కడ ప్రజలు తమ చేయి జారిపోతారోనని ఆ ఊసెత్తకుండా ‘రాజకీయం’ అనే గంప కిందనే ఉంచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పాలన పారీ్టలు, కులమతాలకు అతీతంగా సాగుతోంది. సీఎం తన సొంత నియోజకవర్గం తరహాలోనే ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నా.. బాబుకు ఇటీవల ఎన్నికల్లో ఓటమే ఎదురైంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.66కోట్లతో మున్సిపాలిటీ రూపురేఖలు మార్చనుండటం విశేషం.
కుప్పం: మూడేళ్లలోనే 30 ఏళ్లకు సరిపడా అభివృద్ధి కుప్పం సొంతమవుతోంది. ఇప్పటి వరకు సంక్షేమం ఎరుగని ప్రజలకు ఇప్పుడు ఇంటి తలుపుతడుతున్న పథకాలను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఇన్ని రోజులు తాము ఎలా మోసపోయామో తెలుసుకున్న ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. వరుస ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత రాజకీయ చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నా స్థానికులు అభివృద్ధికే ఆకర్షితులు అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి.. కుప్పం విషయంలోనూ తనదైన మార్కు కనపరుస్తున్నారు. మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు రెవెన్యూ డివిజన్‌గా మార్పు చేశారు. తాజాగా పట్టణాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించేందుకు ఏకంగా రూ.66కోట్లు కేటాయించడంతోపాటు పనుల ప్రారం¿ోత్సవానికి స్వయంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానుండడంతో కుప్పం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.
నూతన వెలుగులు
పట్టణం వేగంగా విస్తరిస్తున్నా ఆయా ప్రాంతాల్లో సరైన వీధి దీపాలు లేకపోవడంతో చాలా చోట్ల చీకటి కమ్ముకుంది. నూతన లేఅవుట్లలోని ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం విద్యుత్ స్తంభాలతోపాటు మెర్క్యూరీ బల్బుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.5 కోట్లు కేటాయించింది. ఈ పనులతో పట్టణం వెలుగులు సంతరించుకోనుంది.
ఉద్యానవనాల అభివృద్ధి
పట్టణంలోని రాజావారి పార్కుతో పాటు దళవాయికొత్తపల్లి పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. రూ.2.55 కోట్లతో వీటిని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం చెరువు నిండి మొరవ పారుతుండడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక్కడ పార్కు అభివృద్ధి చేస్తే ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం, సెలవుల సమయాల్లో పట్టణ ప్రజలు, పిల్లలకు అభివృద్ధి చేయనున్న పార్కులు ఊరట కల్పించనున్నాయి.
మున్సిపాలిటీకి నూతన భవనం
స్వాతం్రత్యానికి ముందు నిర్మించిన పురాతన భవనంలోనే ఇప్పటికీ మున్సిపాలిటీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అప్‌గ్రేడ్ అయిన తర్వాత ప్రజల రాకపోకలు, అధికారుల బాధ్యతలు రెట్టింపయ్యా యి. ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.3 కోట్లు కేటాయించింది.
శ్మశాన వాటిక ఆధునీకరణ
పట్టణ నడిఒడ్డున ఉన్న శ్మశాన వాటికను ఆధునీకరించేందుకు రూ.1.38 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక షెడ్లు, నీటి సమస్యతో పాటు ఈ ప్రాంతం రూపురేఖలు మార్చనున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు అంగన్‌వాడీ మహిళ కమ్యూనిటీ భవనాలకు ప్రభుత్వం రూ.69 లక్షలు కేటాయించింది. పట్టణంలోని 4 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించనున్నారు. అదేవిధంగా మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీ హాలు నిర్మించనుండటం విశేషం.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డుల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. శాశ్వత పరిష్కారం దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డికే పల్లి చెరువు నుంచి తాగునీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. పట్టణ పరిధి పెరగడంతో చుట్టుపక్క గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు ముమ్మర ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా రూ.3.67 కోట్లతో నూతన బోరు డ్రిల్లింగ్, పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. డీకే పల్లి చెరువుతో పాటు అనిమిగానిపల్లి, తంబిగానిపల్లి, పరమసముద్రం, చీగలపల్లి, కమతమూరు గ్రామాల్లో నూతన డ్రిల్లింగ్‌తో పాటు ట్యాంకుల నిర్మాణంతో తాగునీటిని అందించనున్నారు.
డ్రైనేజీ, సీసీ రోడ్డుకు ప్రాధాన్యం
ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో అధిక శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వెచ్చించనున్నారు. ఏకంగా రూ.43.5 కోట్లు ఇందుకోసం ఖర్చు చేయనుండటం విశేషం. పట్టణంలో మురుగునీటి కాలువలు లేకపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. తాజా పనులతో పట్టణ రూపురేఖలు మారిపోనున్నాయి. మున్సిపాలిటీలో కొత్తగా 8 పంచాయతీల్లోని గ్రామాలను చేర్చారు. వీటన్నింటికీ మహర్దశ రానుంది.
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
పారదర్శక పాలనకు సీఎం వైఎస్ జగన్ నిదర్శనం. అభివృద్ధి విషయంలో ఆయనకు పక్కా ప్రణాళిక ఉంది. ముఖ్యంగా కుప్పం విషయంలో చూపుతున్న చొరవ ఎనలేనిది. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసినా, కోట్లాది రూపాయల నిధులతో ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. సీఎం అడుగుజాడల్లో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
– డాక్టర్ సుధీర్, చైర్మన్, కుప్పం మున్సిపాలిటీ
Comments
Please login to add a commentAdd a comment