నున్నలో పేదల ఇళ్ల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్.(ఇన్‌సెట్‌లో) బుడమేరు కాలువ గట్టుపై ఉన్న గుడిసెలు
సాక్షి, అమరావతి: ఈమె శీలం జ్యోతి.. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని బుడమేరు కాలువగట్టుపై టార్పాలిన్‌ను కప్పిన చిన్న పాకలో పదేళ్లుగా ఉంటోంది. భర్త చనిపోగా కూలి పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. ఈమెకు సొంత ఇల్లు అన్నది కలలో కూడా ఊహించలేని విషయం. కానీ.. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ జ్యోతి జీవితంలో వెలుగులు నింపింది.
..ఇలా శీలం జ్యోతే కాదు. బుడమేరు కాలువ గట్టుపై దశాబ్దకాలంగా బతుకులు వెళ్లదీస్తున్న నిరుపేదల సొంతింటి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారు. వారికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. అంతేకాదు.. వారికి ఇల్లు కట్టించి కూడా ఇవ్వనున్నారు.
లక్ష మందికిపైగా పేదల దుస్థితి ఇదీ..
‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్లు’ పథకం నిరుపేదల జీవితాల్లో కొత్త కాంతులు తీసుకువచ్చింది. విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని నిరుపేదలు దశాబ్దాలుగా కాలువ గట్లు, ఆటోనగర్‌లోని ఇరుకు సందులు, శివారు ప్రాంతాల్లోని మురికివాడలు, కొండప్రాంతాలు, రోడ్ల పక్కన చిన్నచిన్న పాకలు, రేకుల షెడ్లు వేసుకుని లక్షమందికి పైగా పేదలు ఉంటున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకం అలాంటి లక్షలాది పేదల సొంతింటి ఆశలను నిజం చేసింది. సువిశాలమైన లే అవుట్లలో ఇళ్ల స్థలాలిచ్చింది. అందులో ప్రభుత్వం వారికి బృందావనాన్ని తలపించే రీతిలో ‘వైఎస్సార్–జగనన్న’ కాలనీలు నిర్మించనుంది. రోడ్లు, వీధి దీపాలు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లు, పార్కులు.. ఇలా అన్ని వసతులు సమకూర్చనుంది. విజయవాడ రూరల్ మండలం నున్నలో వేసిన లే అవుట్ ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. ఓ వైపు కొండలు మరోవైపు తోటలతో ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలుస్తోంది. అందులో 1,265 ఇళ్ల స్థలాలతో వేసిన లే అవుట్ గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి సమీపంలో వేసిన లే అవుట్ ‘రివర్ వ్యూ’ శోభతో అలరారనుంది. కొండపల్లిలో వేసిన లే అవుట్లు కూడా కార్పొరేట్ కంపెనీలు నిరి్మంచే గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తున్నాయి.
2,215.19 ఎకరాల్లో 151 లేఅవుట్లు..
ఈ విధంగా విజయవాడలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలు, గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని పేదల కోసం ఏకంగా 2,215.19 ఎకరాల్లో 151 లే అవుట్లు వేయడం విశేషం. తద్వారా 1,33,470 మంది పేదలకు ఇళ్ల స్థలాలు సమకూర్చి వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది.
అప్పుడు ఇంటి కోసం పదేళ్లు తిరిగినా ఇవ్వలేదు
మేం బుడమేరు కాలువగట్టుపై చిన్నపాకలో పదేళ్లుగా ఉంటున్నాం. సొంత ఇంటి కోసం పదేళ్లుగా తిరిగాను. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పటి మా ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమాను ఎన్నిసార్లు అడిగినా మాకు ఇల్లు రాలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా కల నెరవేరింది. ఇంతకంటే మాకేం కావాలి.
– నాగమణి, ఇబ్రహీంపట్నం
మా కుటుంబానికి పండుగరోజు
జగనన్న మాకు ఇంటి స్థలం ఇచ్చిన రోజే మాకు పండగ రోజు. అందుకే మాకు స్థలం ఇచ్చిన రోజే అక్కడకు వెళ్లి పూజ చేశాం. నున్నలో సెంటు భూమి రూ.5 లక్షలకు పైగా ఉంది. మేం రూ.లక్ష కూడా పెట్టలేం. అలాంటిది మాకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి.. ఇల్లు కూడా కట్టించి ఇస్తోంది.
– సారేపల్లి కుమారి, నున్న గ్రామం, విజయవాడ రూరల్ మండలం
నోట మాట రావడంలేదు
ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన పాకలో ఉంటున్నాం. అడగకుండానే మా ఇంటికి వచ్చి మరీ ఇంటి స్థలం కేటాయించారు. ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. ఈ సంతోషంతో నోటి నుంచి మాట రావడంలేదు. మాకు ఇంతకన్నా ఏం కావాలి.
– మల్లీశ్వరి, నున్న, విజయవాడ రూరల్ మండలం
సొంతిల్లు కట్టుకుంటానని అనుకోలేదు
రేకుల షెడ్డులోనే సగం జీవితం అయిపోయింది. ఇక ఈ జీవితానికి సొంతింటి యోగం లేదనుకున్నాను. కానీ, జగనన్న నా కల నిజం చేశారు. నాకంటూ ఓ సొంత ఇంటిని ఇస్తున్నారు. ఎందరో పేదలకు మేలు చేసిన సీఎంను ఆ దేవుడు చల్లగా చూడాలి.
– పరసా స్వర్ణకుమారి, నున్న గ్రామం విజయవాడ రూరల్
Comments
Please login to add a commentAdd a comment