కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం జగన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రుణపరిమితుల్లో కోతలు విధించడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం జగన్ నివేదించారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ నిమిత్తం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చారు. విభజన నాటికి పెండింగ్ బిల్లులు, 10వ వేతన సవరణ సంఘం సిఫార్సుల అమలు కోసం రాష్ట్రం వెచ్చించిన రూ.32,625.25 కోట్లను భర్తీ చేయాలని కోరారు. గత సర్కారు హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా రాష్ట్ర రుణపరిమితుల్లో కోతలు విధించడం సరికాదన్నారు. దీన్ని వెంటనే సవరించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలవరానికి సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపైనా ఆర్థికమంత్రితో సీఎం జగన్ చర్చించారు.
పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలి
ఏపీకి జీవనాడి లాంటి పోలవరం పనులు త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను సీఎం జగన్ కోరారు. సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన పోలవరం అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులు పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలన్నారు. గోదావరి వరదల కారణంగా దెబ్బతిన్న ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పునాదులకు సంబంధించి కూడా చర్చించారు. దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు సంబంధించి డయాఫ్రం వాల్‌ను ఎలా పటిష్టం చేయాలి? కొత్తగా నిర్మించాలా? అనే అంశాలపై నిపుణులతో చర్చలు జరుపుతున్నామని, వారం పదిరోజుల్లోగా ఇవి ఖరారు అవుతాయని ముఖ్యమంత్రికి తెలియచేశారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం జగన్
అమిత్ షా దృష్టికి పెండింగ్ అంశాలు
విభజన హామీల అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, నూతన జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం సహా పలు పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. బుధవారం ఉదయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
విమానాశ్రయంలో ఘన స్వాగతం
ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి, చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్, వంగా గీత, బి.వి.సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment