పింగళి కుమార్తెకు సీఎం సన్మానం | CM YS Jagan Mohan Reddy Honored Pingali Venkayya daughter | Sakshi
Sakshi News home page

పింగళి కుమార్తెకు సీఎం సన్మానం

Published Sat, Mar 13 2021 2:33 AM | Last Updated on Sat, Mar 13 2021 7:59 AM

CM YS Jagan Mohan Reddy Honored Pingali Venkayya daughter - Sakshi

సీతామహాలక్ష్మికి మెమెంటో బహూకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, గుంటూరు: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్మానించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీలో ఆమె నివాసం ఉంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పింగళి వెంకయ్య కుమార్తెను, ఆమె కుటుంబ సభ్యులను కలిసి.. ఆమెను సన్మానించడం ద్వారా సీఎం రాష్ట్రంలో ఆ వేడుకలను ప్రారంభించారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరి మాచర్ల చేరుకున్న సీఎం జగన్‌.. పింగళి కుమార్తె నివాసానికి చేరుకుని, జాతిపిత మహాత్మాగాంధీ, పింగళి వెంకయ్య చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం పింగళి కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలకరించి, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.   

ఉద్వేగానికి లోనైన క్షణాలు
సీఎం వైఎస్‌ జగన్‌‌ తమ నివాసానికి స్వయంగా వచ్చి పేరు పేరునా పలకరించడంతో పింగళి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. త్రివర్ణ పతాకంతో దేశానికి వన్నె తెచ్చిన కుటుంబాన్ని ప్రభుత్వం వందేళ్లకు గుర్తించిందని, స్వయంగా ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని సీతామహాలక్ష్మి సీఎం జగన్‌ చేతిపై తలవాల్చి ఆనంద బాష్పాలు రాల్చారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎంకు చూపారు. ఆసాంతం చిత్రాలను సీఎం తిలకించారు. సీతామహాలక్ష్మి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ జెండాను గాంధీకి స్వయంగా తన తండ్రి పింగళి వెంకయ్య అందించారని, అలాగే తననూ గాంధీకి పరిచయం చేశారని సీతామహాలక్ష్మి ఆనాటి జ్ఞాపకాలను సీఎంతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మికి శాలువా కప్పి, జాతీయ జెండా, మెమెంటోను సీఎం అందించారు. తన కుమారుడు నరసింహం రాసిన పింగళి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమె సీఎం జగన్‌కు అందజేశారు. అనంతరం పింగళి కుటుంబ సభ్యులందరూ సీఎంతో గ్రూప్‌ ఫొటో దిగారు.
సీతామహాలక్ష్మి చెబుతున్న మాటలను సావధానంగా వింటున్న సీఎం వైఎస్‌ జగన్‌   

రూ.75 లక్షల ఆర్థిక సాయం..
పింగళి వెంకయ్య కుమార్తెకు రూ.75 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల తాలూకు ప్రతిని సీతామహాలక్ష్మికి సీఎం అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాల్లో పింగళి కుటుంబ సభ్యులు భాగస్వాములు కావాలని, ఈ నెల 31న విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి తప్పక హాజరవ్వాలని సీఎం కోరారు. 

ఉదయం వరకూ తెలియదు
సీఎం తనను పరామర్శించేందుకు వస్తున్నట్లు సీతామహాలక్ష్మికి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వరకు చెప్పలేదు. సీఎం ఇంటికి వస్తున్న విషయం ముందే చెబితే 99 ఏళ్ల వయసున్న ఆమె ఉద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంటుందని చివరి వరకు విషయాన్ని దాచి ఉంచారు. కలెక్టర్లు, ఇతర అధికారులు వస్తున్నారని.. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతూ వచ్చారు. సీఎం రాకకు కొద్దిసేపటి ముందు విషయాన్ని ఆమెకు చెప్పడంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అవంతి శ్రీనివాసరావు, శాసన మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.  

చాలా సంతోషంగా ఉంది..
పింగళి వెంకయ్య ఘనతను ఇన్నేళ్లకు ప్రభుత్వం గుర్తించడం సంతోషంగా ఉంది. పింగళిని నేటి తరం మరిచిపోతున్న పరిస్థితిలో ఆయన గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేయడం హర్షణీయం. భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగా అర్హత కలిగిన పింగళికి నేటికీ ఆ గౌరవం దక్కలేదు. భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాయడం అభినందనీయం. సీఎం జగన్‌ మమ్మల్ని ఆత్మీయంగా పేరుపేరునా పలకరించారు. ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అంటూ యోగ క్షేమాలు అడిగారు. పింగళి వెంకయ్య వారసులుగా మమ్మల్ని ఇన్ని రోజులకు సర్కార్‌ గుర్తించడం సంతోషకరం. ప్రభుత్వం చేపట్టే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం చెప్పారు. మా కుటుంబం ఆ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొంటుంది. 
– గంటసాల నరసింహం, గోపీ కృష్ణ, సీతామహాలక్ష్మి కుమారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement