రూపకర్తకు నీరాజనం.. జెండాకు వందనం | CM Jagan Honored Pingali Venkayya Family Members | Sakshi
Sakshi News home page

రూపకర్తకు నీరాజనం.. జెండాకు వందనం

Published Sat, Mar 13 2021 2:22 AM | Last Updated on Sat, Mar 13 2021 10:57 AM

CM Jagan Honored Pingali Venkayya Family Members - Sakshi

పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మిని సన్మానించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు జాతీయ జెండాను బహూకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: జాతీయ జెండా రూపశిల్పి స్వర్గీయ పింగళి వెంకయ్యకు దేశీయ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.  స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశ భక్తి పెంపొందించే విధంగా చేపట్టిన ‘అజాది కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా పింగళి వెంకయ్యను భారత రత్నతో సత్కరించాలన్నది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అన్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎం జగన్‌ ప్రధాన మంత్రికి నాలుగు పేజీల లేఖ రాశారు. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.

సంబరాలు చేసుకునే సమయమిది..
అమితంగా ఇష్టపడే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘అజాది కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న నిర్ణయంపై ముందుగా ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నిర్ణయంతో 5 కోట్ల ఆంధ్రుల మనస్ఫూర్తిగా దేశ భక్తి, సంతోషాలతో నిండిపోయింది. మీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఈ స్మారక కార్యక్రమం దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం నిలిచిపోతుంది. మన మాతృ దేశం ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థికంగా, వాణిజ్యంగా, సరిహద్దు దేశాల నుంచి అకారణ ఒత్తిడులు వంటి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అనేక చిరస్మరణీయమైన మైలు రాళ్లను నమోదు చేసుకుంది. ఏడు దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భారీ ఎత్తున సంబంరాలు చేసుకునే సమయమిది.

ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలి..
ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ తొలిసారి మార్చి8న సమావేశమైనప్పుడు ఈ సంబరాల్లో ప్రధానంగా 5 అంశాలను చేపట్టనున్నట్లు చెప్పారు. అందులో ఒకటి ‘హర్‌ ఘర్‌ జెండా’ పేరుతో ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ జాతీయ జెండా రూపకల్పనలో ఆపారమైన కృషి చేసిన పింగళి వెంకయ్య.. ఆ తర్వాత జెండా వెంకయ్యగా పిలుచుకునే వ్యక్తి గురించి మీ దృష్టికి తీసుకువస్తున్నాను. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మచిలీపట్నం వద్ద ఉన్న భట్ల పెనమర్రు అనే గ్రామంలో జన్మించారు. ఈయన మహాత్మా గాంధీ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆయన జీవితాన్ని స్వాతంత్య్ర సంగ్రామానికి అంకితం చేశారు. ప్రజల మనస్సును ప్రతిబింబించే విధంగా దేశానికి ఒకే జెండా ఉండాలన్న ఆలోచన రాగానే ప్రపంచంలోని వివిధ దేశాల జెండాలకు సంబంధించి శాస్త్రీయ పరిశోధన చేశారు.

ఈ పరిశోధన జాతీయ జెండా రూపకల్పనకు ఎంతో దోహదం చేసింది. పింగళి వెంకయ్య 1916లో ‘ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా’ పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించారు. ఇందులో వివిధ దేశాల జెండాల గురించి, మన దేశ జాతీయ జెండా గురించిన అభిప్రాయాలు వివరించారు. 30కి పైగా జెండా ఆకృతులను తయారు చేసి, దాని రూపకల్పనకు గల కారణాలను పేర్కొన్నారు. దేశానికి ఒక జెండా ఉంటే స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలు పాల్గొనడానికి శక్తిని ఇస్తుందంటూ బలంగా వాదించే వారు. 1921 మార్చి 31న మహాత్మా గాంధీ విజయవాడకు వచ్చినప్పుడు పింగళి వెంకయ్య ఆ జెండా ఆకృతులను బహూకరించారు.

ఈ సందర్భంగా జెండా రూపకల్పనలో వెంకయ్య చూపిస్తున్న చొరవను గాంధీ ప్రత్యేకంగా మెచ్చుకోవడంతో పాటు ఇదే విషయాన్ని యంగ్‌ ఇండియా జర్నల్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మచిలీపట్నం నేషనల్‌ కాలేజీలో పనిచేసే పింగలి వెంకయ్య వివిధ దేశాల జెండా ఆకృతులు, మన దేశా జెండాకు సంబంధించి వివిధ డిజైన్లను పేర్కొంటూ ఒక పుస్తకాన్ని రాశారని, జాతీయ జెండా రూపకల్పన చేసి దాన్ని ఆమోదింప చేసుకోవడానికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నా అంటూ ఆ జర్నల్‌లో గాంధీ పేర్కొన్నారు. 1947 జూలై 22న జాతీయ జెండాకు ఆమోదం తెలిపారు. ఈ విధంగా జాతీయ జెండా రూపశిల్పిగా ఆయన గుర్తింపు పొందారు. కానీ ఆయన జీవితం అంతగా గుర్తింపు లేకుండానే సాగిపోయింది. 1963 జూలై 4న ఆయన తుది శ్వాస విడిచారు.

ఇప్పుడైనా ఇవ్వండి..
భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన జాతీయ పతాకం సృష్టికర్తను, ఆయన నిరుపమానమైన సేవలను ఈ దేశం కొన్ని దశాబ్ధాలుగా గుర్తించడం లేదు. బానిస బతుకుల నుంచి విముక్తి తీసుకువస్తూ లక్షలాది మంది భారతీయుల్లో స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ఈ జెండా రగిల్చింది. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకు మరణానంతరం భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చడంతో పాటు ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చిన వారవుతారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా మంది ప్రముఖులకు మరణానంతరం భారతరత్న ఇచ్చి వారి సేవలను గుర్తించింది. భూపెన్‌ హాజారికా (1926–2011), నానాజీ దేశ్‌ముఖ్‌ (1916–2010)లకు 2019లో భారతరత్న ఇచ్చారు. అంతకు ముందు అరుణా ఆసిఫ్‌ ఆలీ, జయప్రకాష్‌ నారాయణ వంటి అనేక మంది ప్రముఖులకు కూడా ఇచ్చారు. మరణానంతరం పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వడం ద్వారా ఆయన జీవితానికి గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement