CM YS Jagan Release Jagananna Videshi Vidya Deevena Funds: Updates - Sakshi
Sakshi News home page

జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్‌

Published Thu, Jul 27 2023 10:49 AM | Last Updated on Thu, Jul 27 2023 6:20 PM

CM YS Jagan Release Jagananna Videshi Vidya Deevena Funds Updates - Sakshi

సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్య­సించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

357 మంది విద్యార్ధులకు రూ.45.53 కోట్లు  
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మంచి కాలేజీలలో సీట్లు వచ్చి కూడా అంతంత డబ్బులు అక్కడకి వెల్లి కట్టాలంటే కట్టలేని పరిస్థితుల్లో ఉంటూ.. ఆ స్ధోమత లేని రాష్ట్ర విద్యార్ధులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అన్నిరకాలుగా తోడ్పాటు నిస్తుంది. వారికి ఒక భరోసా ఇస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యకోసం అటువంటి మంచి కాలేజీలలో సీట్లు వచ్చి చదువుతున్న దాదాపు 357 మంది పిల్లలకు ఫీజుల కింది రూ.45.53 కోట్లు ఇవాళ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.

ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అమలు చేస్తున్నాం. ఏ ఒక్కరికైనా క్యూఎస్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిల్చిన టాప్‌ –50 విద్యా సంస్ధల్లో సీటు వచ్చిన ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. సాచ్యురేషన్‌ పద్ధతిలో ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా.. అర్హత ఉంటే వాళ్లకు సపోర్టు ఇవ్వడం జరుగుతుంది.  

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకైతే రూ.1 కోటి వరకు చెల్లిస్తున్నాం. విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే పిల్లలకు... వారి విమాన ఛార్జీలు, వీసా ఛార్జీల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి అడుగులోనూ వారిని చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. 

టాప్ కాలేజీలు చూస్తే...
ఈ టాప్‌ 50 కాలేజీల్లో చదవాలంటే... ఫీజులు ఏ రకంగా ఉన్నాయి ? ఎవరికైనా సీటు వచ్చినా సామాన్యుడు, పేదవాడు చదువుకునే పరిస్థితి ఉందా ? అని గమనిస్తే...   చికాగోయూనివర్సిటీ బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.32 కోట్లు, యూనివర్సీటీ ఆఫ్‌  మాంఛెస్టర్‌లో ఎంఎస్‌ రూ.1.02 కోట్లు, కార్నిగీమిలన్‌ యూనివర్సిటీలో టెపర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటిలో ఎంఎస్‌ రూ.1.11 కోట్లు, న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ రూ.1.09 కోట్లు, ఇన్సీడ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఫ్రాన్స్‌లో  ఎంబీఏ రూ.88 లక్షలు, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఏంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో స్లోన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌లో రూ.67 లక్షలు, యూసీ బర్క్‌లీలో ఎంఎస్‌ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకూ ఫీజులు ఉన్నాయి. ఉదాహరణగా పది మంచి విద్యాసంస్ధలు గురించి చెప్పాను.

మన పిల్లలు లీడర్లు కావాలని..
ఇలాంటి ప్రపంచప్రఖ్యాత కాలేజీలలో మన పిల్లలకు ఎవరికైనా సీట్లు వచ్చినా.. సామాన్యుడికి, పేదరికంలో ఉండేవాళ్లకు ఇంత ఫీజులు కట్టి ఇలాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదవడం సాధ్యమేనా ? అన్నది మొట్టమొదట నేను ఈ పథకం గురించి అనుకున్నప్పుడు నాకు తట్టిన మొదట ఆలోచన. ఇలాంటి కాలేజీలలో మన పిల్లలు చదివి బయటకు వస్తేనే.. రేపు పొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్‌ మోస్ట్‌ కంపెనీలలో సీఈఓలుగా ఉద్యోగాలు చేసే స్ధాయి వస్తుంది. పెద్ద స్ధాయిలోకి వెళ్లే అవకాశం వస్తుంది.

ఇటువంటి కాలేజీలలో సీట్లు సాధించిన మన పిల్లలను మనం సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నాం. అలా చేయకపోతే... ఏ రకంగా మన పిల్లను, మన రాష్ట్రాన్ని  లీడర్లుగా చూడగలుగుతాం అన్నది ఈ ఆలోచనలకు ప్రేరేణ. 

గత ప్రభుత్వంలో అరకొరగా..
గతంలో పరిస్థితి చూస్తే.. కేవలం రూ.10 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ అమౌంట్‌ ఎక్కడ? ... మనమిస్తున్న రూ.1.02 కోటి, రూ.1.16 కోట్లు, రూ.1.09 కోట్లు, రూ.87 లక్షలు, రూ.70 లక్షలు, రూ.1.32 కోట్లు ఫీజు ఎక్కడ ? 

గతంలో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఇచ్చారు. అక్కడ కూడా ప్రతిదానిలో కోత పెట్టేవారు. దరఖాస్తు చేసుకున్నవారందిరికీ దొరికేది కాదు. సాచ్యురేషన్‌ విధానం లేదు. సిఫార్సులతో ఇచ్చేవారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా 2016–17 నుంచి దాదాపు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి ఈ పథకాన్ని నీరుకార్చే ప్రయత్నం చేశారు.

మన ప్రభుత్వంలో
ఈ రోజు మనం ఆ పథకానికి పూర్తిగా మార్పుతీసుకుని వచ్చి... సాచ్యురేషన్‌ విధానంలో ఏ ఒక్కరికైనా అర్హత ఉండి, టాప్‌ – 50 కాలేజీలు, దాదాపు 320 ఫ్యాకల్టీలలో సీట్లు ఎవరికి వచ్చినా వర్తింపు చేస్తున్నాం. 

గతంలో ఆదాయపరిమితి రూ.6లక్షలు ఉంటే దాన్ని  రూ.8లక్షల వరకూ పెంచి సాచ్యురేషన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే చాలు.. అర్హత ఉంటే రూపాయి లంచం ఇవ్వకుండా... వివక్షకు తావు ఇవ్వకుండా,  పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా  మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పిల్లలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు  వేస్తూ దేవుడి దయతే చేయగలిగాం. 

విప్లవాత్మక అడుగు.
ఇదో విప్లవాత్మకమైన అడుగు. రాబోయే రోజుల్లో, రాబోయే తరాలు ఆంధ్రరాష్ట్ర ఖ్యాతిని గుర్తుంచుకునే విధంగా.. ఈ రకంగా సపోర్ట్‌ చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు.  ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే టాప్‌– 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా.. పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే.

ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు గొప్పగా ఎదగాలి.  పెద్ద కంపెనీల్లో సీఈఓలుగానూ, పెద్ద పెద్ద స్ధాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

నాలుగు విడతలుగా స్కాలర్‌షిప్‌.
ఈ స్కాలర్‌షిప్‌ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నాం. ఇమ్మిగ్రేషన్‌ కార్డు పొందిన విద్యార్ధులకు వెంటనే తొలివిడత, ఫస్ట్‌ సెమిస్టర్‌ ఫలితాలు అనంతరం  రెండో విడత, రెండో సెమిస్టర్‌ టెర్మ్‌ ఫలితాలు విడుదలైనప్పుడు మూడో విడత, విజయవంతంగా నాలుగో సెమిస్టర్‌ పూర్తి చేసి, మార్క్స్‌ షీటు అప్‌లోడ్‌ చేసిన తర్వాత చివరి విడతగా నాలుగో వాయిదా కూడా పిల్లలకు ఇచ్చే విధంగా దీన్ని డిజైన్‌ చేశాం. 

అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ పిల్లలందరికీ ఈ టాప్‌–50 కాలేజీలలో, 21 ఫ్యాకల్టీలలో ఎక్కడ సీటు వచ్చినా... దరఖాస్తు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తోడుగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను.

ఈ కార్యక్రమం వల్ల మన పిల్లలకు ఇంతా మంచి జరగాలని,ఆ తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదని, అప్పులపాలవుతామనే భయం లేకుండా తల్లిదండ్రులు ఆ పిల్లలను గొప్ప చదువులకు పంపించాలని, పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేసి తమను పంపించారన్న బాధ ఎక్కడా ఉండకూడదనే ఈ పథకాన్ని రూపొందించాం. ఆ పిల్లలు అక్కడకు వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలన్న మంచి సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దేవుడి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. 

ఇది కూడా చదవండి: ‘పకడ్బందీగా కామన్‌ వర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement