AP: రూ.16,320 కోట్లతో 15 ప్రాజెక్టులు | CM YS Jagan review on agriculture and allied sectors | Sakshi
Sakshi News home page

AP: రూ.16,320 కోట్లతో 15 ప్రాజెక్టులు

Published Tue, Feb 8 2022 3:07 AM | Last Updated on Tue, Feb 8 2022 12:01 PM

CM YS Jagan review on agriculture and allied sectors - Sakshi

సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సద్వినియోగం చేసుకోవాలి
‘‘రైతుల కోసం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రూ.16,320.83 కోట్ల వ్యయంతో 15 రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టాం. ఈ ఏడాది వీటిలో గణనీయమైన పురోగతి కనిపించాలి. సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలి’’
– సీఎం జగన్‌  

సాక్షి, అమరావతి: వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన ప్రాజెక్టుల ఫలాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించాలని, క్షేత్రస్థాయిలో మార్పులు కచ్చితంగా కనిపించాలని నిర్దేశించారు. గోదాములు సహా అన్ని రకాల నిర్మాణాలు ఊపందుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచే విప్లవాత్మక 15 రకాల ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. 

సేంద్రీయ రైతులకు ప్రోత్సాహకాలు..
సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాల ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. ఈ అవకాశాలను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఆర్బీకే స్థాయిలో సేంద్రీయ వ్యవసాయంపై కస్టమ్‌ హైర్‌ సెంటర్‌ వచ్చే ఏడాది నాటికి 
ఏర్పాటయ్యేలా ప్రణాళిక రూపొందించాలి. సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలకు సంబంధించిన యంత్రాలు, పరికరాలను ఆర్బీకేల్లో అందుబాటులోకి తెచ్చి ఉత్పత్తులకు మంచి ధర లభించేలా చూడాలి. రైతులకు ప్రోత్సాహకాలు అందించేలా ఒక విధానం తేవాలి.

1,165 గోదాముల నిర్మాణం
గోడౌన్ల నిర్మాణానికి జిల్లాల్లో స్థల సేకరణ దాదాపుగా పూర్తైందని, 1,165 చోట్ల వీటిని నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 278 చోట్ల గోడౌన్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రైతులు మోసాలకు గురికాకుండా బరువు, తేమ కొలిచే పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ప్రొక్యూర్‌మెంట్‌లో వినియోగించే 6,293 పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 

యంత్ర పరికరాలు..
వైఎస్సార్‌ యంత్రసేవ ద్వారా రైతులకు అందుబాటులోకి తెస్తున్న వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, పరికరాలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఇప్పటికే 3,497 యూనిట్లను రైతులకు అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు.
 
33 ప్రాసెసింగ్‌ సెంటర్లు..
పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రాతిపదికన 33 చోట్ల విత్తనాలు, మిల్లెట్స్‌ ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. 2022 ఖరీఫ్‌ నుంచి ప్రాసెసింగ్‌ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. చిరుధాన్యాలు, పప్పు దినుసులు పండించే రైతులు వీటిని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రాసెస్‌ చేయడం వల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయి. ఉత్పత్తులు కూడా నాణ్యంగా ఉంటాయి. సెకండరీ ప్రాసెసింగ్‌దారులు, సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారికి మెరుగైన ముడి పదార్థాలు లభిస్తాయి.

13 సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు
సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 13 యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఉద్యానవన పంటలు సాగుచేస్తున్న రైతులకు అందుబాటులో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటు పనులపై సీఎం జగన్‌ సమీక్షించారు. 

మార్చిలో పశువుల అంబులెన్సులు
పశువులకు వైద్య సేవలందించేందుకు 175 అంబులెన్స్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులోకి రానున్నాయి. మార్చిలో అంబులెన్స్‌లు ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు.

పాలవెల్లువతో అదనంగా రూ.14.68 కోట్ల లబ్ధి 
దాదాపు 1,100 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభించి నెలకు 28,00,502 లీటర్లకుపైగా సేకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 2.03 కోట్ల లీటర్లకుపైగా పాలను సేకరించి రైతులకు రూ.86.58 కోట్లు చెల్లించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు రూ.14.68 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరింది. అమూల్‌ రాకతో ఇతర డైయిరీలు తప్పనిసరిగా పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని అధికారులు పేర్కొన్నారు. తూనికల్లో తేడాలు, ఫ్యాట్‌ నిర్దారణలో తప్పిదాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి రైతులు మోసాలకు గురికాకుండా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. గేదె పాలలో ఒక్క శాతం తేడా రావడం వల్ల రైతులు లీటర్‌కు దాదాపు రూ.7 వరకు నష్టపోతున్నారని వివరించారు.

వచ్చే నెలలో విశాఖ జిల్లాల్లో ..
బీఎంసీ, ఏంఎసీల ప్రగతిని అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే నెలలో విశాఖ జిల్లాలో అమూల్‌ పాలసేకరణ ప్రారంభం కానుంది. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నంలో పాల ఉత్పత్తుల యూనిట్లను అమూల్‌ ప్రారంభించనుంది.

ఆక్వా హబ్‌లతో 80 వేల మందికి ఉపాధి
ఆక్వారంగంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఆక్వాహబ్‌లు, స్పోక్స్‌ ద్వారా భారీగా ఉపాధి కల్పన జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 80 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. స్థానికంగా వినియోగం పెరుగుతోంది. జూన్‌ నాటికి 70 ఆక్వాహబ్‌లు, 14వేల స్పోక్స్‌ ఏర్పాటు దిశగా సాగుతున్నట్లు చెప్పారు. 23 ప్రీ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 10 ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 9 సొసైటీలు ఏర్పాటయ్యాయి.

4 నెలల్లో తొలివిడత ఫిషింగ్‌ హార్బర్లు
మొదటి విడతలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నంలో ఫిషింగ్‌ హార్బర్ల పనులు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పాడలో కూడా పనులను వేగవంతం చేస్తామన్నారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. రెండో విడతలో పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నంలో పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

15 రకాల ప్రాజెక్టులు ఇవీ
డ్రై స్టోరేజీ– డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్, గోడౌన్లు, హార్టికల్చర్‌లో మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాసెసింగ్‌సెంటర్లు, అసేయింగ్‌ ఎక్విప్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఈ– మార్కెటింగ్, మెగా కస్టం హైరింగ్‌ హబ్స్, ఆర్బీకేల స్థాయిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, వరి పండిస్తున్న జిల్లాల్లో కంబైన్డ్‌ హార్వెస్టర్లు, ఏంఎసీలు–బీఎంసీలు, ఆక్వా ఇన్‌ఫ్రా, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు, పశుసంవర్థక శాఖలో మౌలిక సదుపాయాలపై తీసుకున్న చర్యలు, నిధుల సేకరణ తదితరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులకు దాదాపు రూ.16,320.83 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement