CM YS Jagan Review Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme - Sakshi
Sakshi News home page

భూ వివాదాల పరిష్కారానికి సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం

Published Tue, Aug 2 2022 1:38 PM | Last Updated on Tue, Aug 2 2022 3:17 PM

CM YS jagan Review Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Scheme - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమీక్షా సమావేశంలో భూ వివాదాల పరిష్కారం కోసం సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగనన్న భూరక్ష హక్కు కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునళ్లు కొనసాగనున్నట్లు వెల్లడించారు. 

ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన ఈ ట్రైబ్యునల్‌ పనిచేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సర్వే సందర్భంగా కూడా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలని అధికారులకు వెల్లడించారు. మొబైల్‌ ట్రైబ్యునల్‌ యూనిట్లు ఉండాలని, దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తీసుకురావాలని అధికారులకు సీఎం ఆకాంక్షించారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
►శాశ్వత ప్రాతిపదికన ప్రతిమండల కేంద్రంలో కూడా భూ వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి.
►దీనివల్ల న్యాయపరంగా దక్కే హక్కులను వీలైనంత త్వరగా పొందేందుకు వీలు ఉంటుంది. 
►వివాదాల్లో ఉండి తరాలతరబడి హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదు.

►సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాల ఇలా అంశాల వారీగా గుర్తించాలి.
►సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలి.
►దీనివల్ల కొనుగోలుదార్లకు ఈ భూమి లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది:
►అదే సమయంలో ఆ వివాదాలను పరిష్కరించే ప్రయత్నంకూడా సమాంతరంగా జరగాలి:

సర్వే ప్రక్రియలో నాణ్యత  చాలా ముఖ్యం: సీఎం
►వివాదాల పరిష్కారంలో కూడా అలాంటి క్వాలిటీతో కూడిన ప్రక్రియ ఉండాలి. 
►సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ కూడా ఉండాలి.
►దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం చేకూరదు. తప్పులకు పాల్పడే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
►థర్డ్‌పార్టీ పర్యవేక్షణ వల్ల పక్షపాతం, వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది. 
►సిబ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుంది.

►ఎవరైనా ఒక వ్యక్తి  తమ భూమిలో సర్వేకావాలని దరఖాస్తు చేసుకుంటే.. కచ్చితంగా సర్వే చేయాలి. 
►నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే.. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
►దీనికోసం ఒక ఎస్‌ఓపీ రూపొందించాలి. 

►సర్వేలో ఏరియల్‌ ఫ్లైయింగ్, డ్రోన్‌ఫ్లైయింగ్‌ నెలవారీ లక్ష్యాలను పెంచాలి.
►నెలకు వేయి గ్రామాలను చొప్పున ఇప్పుడు చేస్తున్నామన్న అధికారులు.
►ఈ లక్ష్యాన్ని పెంచాలని, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలని సీఎం ఆదేశం.

►2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తిచేస్తామన్న అధికారులు.
►సమగ్ర సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రఖ్యాత లీగల్‌ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలని తెలిపిన సీఎం. 
►దీనివల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్న సీఎం.

►సర్వే పూర్తయ్యే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సదుపాయం రావాలి.
►రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మంచి ఎస్‌ఓపీలు పాటించాలి
►నమూనా డాక్యుమెంట్‌ పత్రాలను పౌరులకు అందుబాటులో ఉంచాలి. వాటి ఆధారంతో సులభంగా రిజిస్ట్రేషన్‌ జరిగేలా చూడాలి
►అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్‌  ప్రక్రియను చేపట్టాలి. 
►ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖను ప్రక్షాళన చేయాలి.
►ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏసీబీ నంబర్‌ స్పష్టంగా కనిపించేలా పోస్టర్, హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు

ఈ సమీక్షా సమావేశంలో ఎనర్జీ, అటవీ పర్యావరణం, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, సర్వే సెటిల్మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్ధ జైన్, సీసీఎల్‌ఏ కార్యదర్శి అహ్మద్‌ బాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: తాగినా... ఇన్ని అబద్ధాలు కష్టమే.. ఎల్లో మీడియా విషపురాతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement