
చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని...
సాక్షి,గుంటూరు/విజయవాడ: చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు.
చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ఎన్నికల దగ్గరపడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది.
అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం నాకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్ర. ఓట్ల కోసం దొంగ వాగ్దానాలతో చంద్రబాబు మళ్లీ మీ ముందకొస్తారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. నాకున్న ఏకైక అండాదండా ప్రజలే’ అని సీఎం జగన్ ఉద్విగ్నంగా ప్రసంగించారు.
ఎన్నికలకు సిద్ధం కావాలి
‘మనం చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లండి. దుష్టచతుష్టయం కుట్రలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టండి. పార్టీ నాయకత్వంతో కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలి. ఎన్నికలకు సిద్ధం కావాలి’ అని క్యాడర్‌కు సీఎం జగన్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం.. నిండు మనసుతో సెల్యూట్
ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ: పోటెత్తిన అభిమానం