వడివడిగా వరప్రదాయిని | CM YS Jagan Special Attention On Polavaram Works | Sakshi
Sakshi News home page

వడివడిగా వరప్రదాయిని

Published Mon, Jan 4 2021 3:46 AM | Last Updated on Mon, Jan 4 2021 7:49 AM

CM YS Jagan Special Attention On Polavaram Works - Sakshi

నాడ..., నేడు...

నాడు...
► టీడీపీ హయాంలో 42, 43 బ్లాక్‌లలో రెండు పియర్స్‌ మాత్రమే 34 మీటర్ల ఎత్తు వరకూ పని చేశారు. సగటున 22 మీటర్ల ఎత్తు కూడా పనులు చేయలేదు.

పోలవరం స్పిల్‌ వే
► గోదావరి వరద మళ్లించడానికి 1118.40 మీటర్ల పొడవుతో 55 మీటర్ల ఎత్తున 53 బ్లాకులుగా స్పిల్‌ వే నిర్మించాలి. స్పిల్‌ వేకు గరిష్టంగా 18.5 మీటర్ల నుంచి కనిష్టంగా పది మీటర్ల లోతు నుంచి పునాది వేయాలి. 25.72 మీటర్ల వద్ద గేట్లను బిగించాలి.

నేడు...
► స్పిల్‌ వే సగటున 54 మీటర్ల ఎత్తు వరకూ పనులు పూర్తి చేశారు. ఫిబ్రవరి నాటికి స్పిల్‌ వే పియర్స్, కాంక్రీట్‌ పనులు పూర్తవుతాయి. 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం పోలవరాన్ని సాకారం చేసేందుకు 2004లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుడితే.. కమీషన్ల దాహంతో దక్కించుకుని జీవనాడి లాంటి ప్రాజెక్టును చంద్రబాబు జీవచ్ఛవంలా మార్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పనులను ప్రక్షాళన చేసి రూ.838 కోట్లను ఖజానాకు ఆదా చేశారు. గోదావరి వరదలు, కరోనా సమయంలోనూ ప్రాజెక్టు పనులను పరుగులెత్తిస్తూ 2022 ఖరీఫ్‌ సీజన్‌లో నీళ్లందించేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. పోలవరాన్ని పూర్తి చేసి కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63.20 టీఎంసీలను తరలించే ఎనిమిది లక్షల ఎకరాలు వెరసి 15.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించే దిశగా పనులను వేగవంతం చేశారు.

కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తరలించి 13.08 లక్షల ఎకరాలు, పోలవరం నుంచి నేరుగా గోదావరి డెల్టాకు తరలించి 10.13 లక్షల ఎకరాలు వెరసి 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను అందించడం ద్వారా మిగిలే కృష్ణా జలాలను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తరలించి 13 జిల్లాలకు పోలవరం ఫలాలను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ నడుం బిగించారు. 960 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రాన్ని పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వెలుగులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు టీడీపీ హయాంలో జరిగిన పనులు, ఆ తరువాత నుంచి ఇప్పటిదాకా 19 నెలల వ్యవధిలో పోలవరం పనుల్లో ప్రగతి, వేగాన్ని బేరీజు వేసి చూస్తే నిజమేమిటో బోధపడుతుంది.  

రేడియల్‌ గేట్లు: పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 అడుగులు. పూర్తి నీటి నిల్వ 194.6 టీఎంసీలు. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరిన వెంటనే గేట్లు ఎత్తి దిగువకు వరద విడుదల చేస్తారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ మేరకు గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌ వేకు 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లతో 48 రేడియల్‌ గేట్లను బిగించాలి.

నాడు...
స్పిల్‌ వేకు గేట్లు బిగించాలంటే స్పిల్‌ వే పియర్స్‌ను 54 మీటర్ల ఎత్తు వరకూ పూర్తి చేయాలి. కానీ అంత ఎత్తు వరకూ పూర్తి చేయకుండానే 42, 43 పియర్స్‌ మధ్య ఇనుప రేకును అడ్డం పెట్టి గేటు బిగించేసినట్లుగా 2018 డిసెంబర్‌ 24న నాటి సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.

నేడు...
48 రేడియల్‌ గేట్లకుగానూ ఇప్పటికే తొమ్మిది గేట్లు బిగించారు. తాజాగా మరో రెండు గేట్ల బిగింపు పనులు ఆదివారం రాత్రికి పూర్తవుతాయి. మిగిలిన గేట్లను ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేశారు.

స్పిల్‌ వే బ్రిడ్జి కాంక్రీట్‌ గడ్డర్లు: స్పిల్‌ వేపై 1118.4 మీటర్ల చొప్పున స్పిల్‌ వే బ్రిడ్జిని నిర్మించాలి. స్పిల్‌ వే బ్రిడ్జి ఒక్కొక్క శ్లాబ్‌ను నాలుగు నిలువు గడ్డర్లు మీద వేస్తారు. మొత్తం 48 శ్లాబ్‌లకుగానూ 192 నిలువు గడ్డర్లు అవసరం. ఒక్కో గడ్డర్‌ పొడవు 21 మీటర్లు ఉంటుంది. 
నాడు....  22 గడ్డర్లు మాత్రమే పూర్తి చేశారు.
నేడు....  ఏడాదిన్నరలో 170 గడ్డర్లు పూర్తి చేశారు.

స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌లు: స్పిల్‌ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి, స్టాప్‌ లాగ్‌ గేట్లను ఒకవైపు నుంచి మరోవైపు జరపడానికి, గేట్లపై నిరంతర పర్యవేక్షణ కోసం వాహనాల్లో అధికారులు, సిబ్బంది వెళ్లడానికి స్పిల్‌ వే బ్రిడ్జి ఉపయోగపడుతుంది. 49 పియర్స్‌ మధ్య ఒక్కో శ్లాబ్‌ను 21.5 మీటర్ల పొడవు, 9.75 మీటర్ల వెడల్పు, 0.45 మీటర్ల మందంతో వేయాలి. 
నాడు.... 48 శ్లాబ్‌లకుగానూ ఒక్క శ్లాబ్‌ కూడా వేయలేదు.
నేడు.... 48 శ్లాబ్‌లకుగానూ 40 శ్లాబ్‌ల నిర్మాణం పూర్తయింది. ఫిబ్రవరి 15 నాటికి మిగిలిన 8 శ్లాబ్‌లను పూర్తి చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయి.

ట్రూనియన్‌ బీమ్‌లు: 48 గేట్లను బిగించడానికి, ఆపరేట్‌(ఎత్తడం, దించడం) చేయడం, 49 పియర్స్‌కు ప్రవాహపు కింద వైపున(డౌన్‌ స్ట్రీమ్‌) వాలుగా 35.5 మీటర్ల ఎత్తులో ట్రూనియన్‌ బీమ్‌లను ఏర్పాటు చేయాలి. రేడియల్‌ గేట్ల ఆర్మ్‌ గడ్డర్లను ట్రూనియన్‌ బీమ్‌లకు అనుసంధానం చేసి గేట్లను ఆపరేట్‌ చేస్తారు. 275 టన్నులు ఉండే గేటు బరువు ట్రూనియన్‌ బీమ్‌పైనే పడుతుంది. హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లను బిగించడానికి పియర్స్‌పై 45 మీటర్ల ఎత్తులో ఫాల్కన్స్‌ను బిగించాలి.

నాడు...  ఒక్క ఫాల్కన్‌ కూడా బిగించలేదు.
నేడు... 49 ట్రూనియన్‌ బీమ్‌లకుగానూ 40 పూర్తయ్యాయి. మిగిలిన 9 బీమ్‌లు ఈ నెలలో పూర్తవుతాయి. 49 ఫాల్కన్స్‌ను బిగించారు.

జలవిద్యుత్కేంద్రం పునాది: పోలవరం జలవిద్యుత్కేంద్రాన్ని 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించాలి. ఒక్కొక్కటి 80 మెగావాట్లను ఉత్పత్తి చేసేలా 12 యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్కేంద్రం కోసం కొండను 135 మీటర్ల నుంచి 12 మీటర్ల వరకూ తవ్వాలి. ఇందులో 135 నుంచి 110 మీటర్ల వరకూ కొండను తవ్వే పనులు 2014కి ముందే పూర్తయ్యాయి.
నాడు.... కొండను తవ్వే పనులు 110 మీటర్ల నుంచి 92 మీటర్ల వరకూ అంటే 18 మీటర్ల పనులు మాత్రమే చేశారు. 
నేడు... కొండను తవ్వే పనులు 92 మీటర్ల నుంచి ప్రారంభించి రోజుకు సగటున ఆరు వేల క్యూబిక్‌ మీటర్ల చొప్పున తవ్వుతున్నారు. ఆరు యూనిట్లు ఏర్పాటు చేయడానికి వీలుగా తవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు మార్చి నాటికి పూర్తవుతాయి.

పునరావాసం, పునర్‌ నిర్మాణ(ఆర్‌ఆర్‌) ప్యాకేజీ: పోలవరం నిర్మాణం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో 371 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇక్కడ 1,05,601 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. 
నాడు.... ఐదేళ్లలో కేవలం 15 పునరావాస కేంద్రాలలో 1,846 ఇళ్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేశారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది.
నేడు... 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 17,860 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి వీలుగా ఇప్పటికే 11,500 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మరో 6,360 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. మే నాటికి ఈ కుటుంబాలకు పునరావాసం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

స్పిల్‌ ఛానల్‌: స్పిల్‌ వే నుంచి దిగువకు వదిలిన వరదను గోదావరి నదిలో కలిపేందుకు 2,920 మీటర్ల పొడవు, 1,000 మీటర్ల వెడల్పుతో స్పిల్‌ ఛానల్‌ను నిర్మించాలి. స్పిల్‌ చానల్‌ నిర్మాణం కోసం మట్టి తవ్వాలి. ఒక మీటర్‌ మందం, పది మీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పుతో కూడిన కాంక్రీట్‌ బ్లాక్‌లతో ఈ చానల్‌ను నిర్మించాలి. 
నాడు... స్పిల్‌ ఛానల్‌ పనులకు సంబంధించి అత్యంత కీలకమైన డిజైన్లను సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసుకోవడంలో గత సర్కారు విఫలమైంది. స్పిల్‌ ఛానల్‌ ఎడమ గట్టు, కుడి గట్టు వాలులకు సంబంధించిన మట్టి జారిపోతోంది. గట్టు వాలుకు సంబంధించి కీలక డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం లభించలేదు. ప్రణాళికరాహిత్యంతో కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం వల్ల గోదావరి వరద స్పిల్‌ వే మీదుగా స్పిల్‌ ఛానల్‌ను ముంచెత్తింది. స్పిల్‌ ఛానల్‌ను బురద ముంచెత్తింది.
నేడు... గతేడాది స్పిల్‌ ఛానల్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని తోడాల్సి వచ్చింది. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకూ నీటిని తోడారు. పనులు ప్రారంభమయ్యే సరికి కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ వల్ల మార్చి నుంచి జూన్‌ వరకూ మందగించాయి. 2020 జూలైలో వరదలు రావడంతో స్పిల్‌ ఛానల్‌లోకి వరద నీరు చేరింది. ఈ వరద నీటిని అక్టోబర్‌ నుంచి తోడుతున్నారు. ఈ వారంలో నీటిని తోడే పని పూర్తవుతుంది. బురద, మట్టిని తొలగిస్తూనే కాంక్రీట్‌ బ్లాక్‌లు వేయడం ద్వారా శరవేగంగా స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.

స్పిల్‌ చానల్‌ పనులకు సంబంధించి అత్యంత కీలకమైన డిజైన్లను సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసుకోవడంలో గత సర్కారు విఫలమైంది. స్పిల్‌ చానల్‌ ఎడమ గట్టు, కుడి గట్టు వాలులకు సంబంధించిన మట్టి జారిపోతోంది. గట్టు వాలుకు సంబంధించి కీలక డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం లభించలేదు. ప్రణాళికరాహిత్యంతో కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడం వల్ల గోదావరి వరద స్పిల్‌ వే మీదుగా స్పిల్‌ చానల్‌ను ముంచెత్తింది. స్పిల్‌ చానల్‌ను బురద ముంచెత్తింది.

గతేడాది స్పిల్‌ చానల్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని తోడాల్సి వచ్చింది. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకూ నీటిని తోడారు. పనులు ప్రారంభమయ్యే సరికి కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ వల్ల మార్చి నుంచి జూన్‌ వరకూ మందగించాయి. 2020 జూలైలో వరదలు రావడంతో స్పిల్‌ చానల్‌లోకి వరద నీరు చేరింది. ఈ వరద నీటిని అక్టోబర్‌ నుంచి తోడుతున్నారు. ఈ వారంలో నీటిని తోడే పని పూర్తవుతుంది. బురద, మట్టిని తొలగిస్తూనే కాంక్రీట్‌ బ్లాక్‌లు వేయడం ద్వారా శరవేగంగా స్పిల్‌ చానల్‌ను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. 

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌: ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణానికి వీలుగా గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి ఈసీఆర్‌ఎఫ్‌కు 500 మీటర్ల ఎగువన 2,340 మీటర్ల పొడవుతో 42.5 మీటర్ల ఎత్తుతో కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్‌కు 350 మీటర్ల దిగువన 1,617 మీటర్ల పొడవు 30.50 మీటర్ల ఎత్తుతో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేశాకే కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టాలి.
నాడు... స్పిల్‌ వే పనులు పూర్తి చేయకుండానే ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించారు. గోదావరి మధ్యలో 1,200 మీటర్ల పొడవున 28 మీటర్ల నుంచి 33 మీటర్ల ఎత్తు వరకూ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పాక్షికంగా చేపట్టి వదిలేశారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనుల్లో 950 మీటర్ల పొడవున పాక్షికంగా చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పునాది పనుల్లో కీలకమైన జెట్‌ గ్రౌటింగ్, డయాఫ్రమ్‌ వాల్‌ అనుసంధానం, పెర్మియేషన్‌ గ్రౌటింగ్‌ పనులు చేపట్టలేదు. ప్రణాళికరాహిత్యం వల్ల గోదావరి వరద ఎగదన్ని 2019, 2020లలో ముంపు గ్రామాల్లోకి చేరింది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ను ముంచెత్తింది. వరద నీటి తోడకం, పూడిక, బురద తొలగించాకగానీ పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రెండేళ్లు జాప్యం జరిగి ప్రజలకు ప్రాజెక్టు ఫలాలు అందడంలో ఆలస్యం అవుతోంది.
నేడు... ఎగువ కాఫర్‌ డ్యామ్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి జూన్‌ నాటికి పూర్తి చేసేలా వేగవంతం చేశారు.

ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌: పోలవరం జలాశయంలోఈసీఆర్‌ఎఫ్‌ ప్రధాన ఆనకట్ట. ఇందులోనే 194.6 టీఎంసీలు నిల్వ చేస్తారు. ఈసీఆర్‌ఎఫ్‌ను మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. గ్యాప్‌–3లో 153.50 మీటర్ల పొడువున, 22.92 మీటర్ల ఎత్తుతో కాంక్రీట్‌ డ్యామ్, గ్యాప్‌–2లో 564 మీటర్ల పొడవున ఈసీఆర్‌ఎఫ్, గ్యాప్‌–2లో 1750 మీటర్ల పొడువున ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మించాలి. 
నాడు... గ్యాప్‌–3 కాంక్రీట్‌ డ్యామ్‌ డిజైన్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించలేదు. దాంతో పని చేపట్టలేదు. గ్యాప్‌–1లో ఈసీఆర్‌ఎఫ్‌ డిజైన్‌ సీడబ్ల్యూసీకి ఇవ్వలేదు. పనులు ప్రారంభించలేదు. గ్యాప్‌–2లో పునాది(డయాఫ్రమ్‌ వాల్‌) పనులు మాత్రమే చేశారు.

నేడు.. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–3 డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. పునాది తవ్వకం కోసం 12 వేల క్యూబిక్‌ మీటర్ల పని చేశారు. కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. గ్యాప్‌–1 ఈసీఆర్‌ఫ్‌ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ప్రస్తుతం పునాది వేస్తున్నారు. జూన్‌ నాటికి పూర్తి చేస్తారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–2ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.

కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే సొరంగాలు:
నాడు.... ఎడమ కాలువకు నీటిని సరఫరా చేసే సొరంగం పనులు ప్రారంభించలేదు. కుడివైపు సొరంగానికి లైనింగ్‌ చేయలేదు.
నేడు... ఎడమ కాలువకు నీటిని అందించడానికి 919 మీటర్ల పొడవు, 18 మీటర్ల వ్యాసంతో సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. 3.65 లక్షల క్యూబిక్‌ మీటర్ల రాయి తవ్వకం పనులకుగానూ 1.75 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తి చేశారు. లైనింగ్‌తో సహా మిగిలిన పనిని 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెండు సొరంగాల లైనింగ్‌ పనులు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు.

2017–18 ధరల ప్రకారం నిధులు: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయడానికి వంద శాతం వ్యయాన్ని కేంద్రమే భరించాలి.
నాడు... 2014 ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిపోయిన వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం విధించిన షరతుకు నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల దాహంతో అంగీకరించారు. 2013–14 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. తద్వారా పోలవరం భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టారు. 

నేడు... భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించాలి. భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులకే రూ.26,585 కోట్ల వ్యయం అవుతుందని, ఈ నేపథ్యంలో రూ.20,398 కోట్లతో ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యమని ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లకు సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో పీపీఏ, సీడబ్ల్యూసీ ఏకీభవించి 2017–18 ధరల ప్రకారం నిధులు ఇస్తేనే పోలవరం పూర్తవుతుందని తేల్చిచెప్పాయి. దీంతో పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసి ఆ మేరకు నిధులు విడుదల చేసేందుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వనుంది. కేంద్ర ఆర్థిక శాఖ, కేబినెట్‌ ఆమోదంతో 2017–18 ధరల ప్రకారం పోలవరానికి నిధులు మంజూరు కానున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement