సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికిఉంటే ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి చేసేవారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందంటే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారాని ప్రశ్నించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ఆయన జీవించి ఉంటే 2014 నాటికే పోలవరం పూర్తయ్యి ఉండేదని అన్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు రాజకీయ స్థిరీకరణ నిధిగా టీడీపీ పోలవరంను భావించిందని ఆరోపించారు.
గతంలో పూర్తయిన ప్రాజెక్టుల వద్దకు ఇప్పటి వరకు ఎవ్వరూ బస్సులు పెట్టి ప్రజల్ని తీసుకెళ్ళలేదని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్‌లో కామెంట్లు పెడతారని.. రైతులు సోషల్ మీడియాను చూస్తారా? అని ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద మోసం టీడీపీ చేసిన రైతు ఋణమాఫీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఏ తప్పు చెయకపోతే రివర్స్ టెండరింగ్‌కు మద్దతు ఇవ్వాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. జలయజ్ఞం ద్వారా రాజశేఖర్రెడ్డి గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. పోలవరంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కేంద్రం ప్రభుత్వం కూడా చొరవ చూపాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment