
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కృష్ణా జిల్లాలో, శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఈ నెల 25న (గురువారం) కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఆయన ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40 గంటలకు పెడన చేరుకుంటారు.
10.50 నుంచి 12.30 గంటల వరకు పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
విశాఖపట్నం జిల్లా పర్యటన ఇలా..
26న (శుక్రవారం) విశాఖపట్నంలో సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో ఒప్పంద కార్యక్రమం, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన వారికి ధ్రువపత్రాలను అందించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం జగన్ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరతారు. 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.
10.20 నుంచి 11.13 గంటల వరకు ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ మధ్య అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు చేరుకుంటారు. 11.23 నుంచి 12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలను అందిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తారు. 12.40 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.