గురువారం కృష్ణా జిల్లా పెడనలో జరిగిన కార్యక్రమంలో మగ్గం నేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో మనం మంచి పనులు చేస్తుండటాన్ని చంద్రబాబుతో కూడిన దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. అన్ని వర్గాలకు అండగా నిలవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీరి వైఖరి చూస్తుంటే బాధ కలుగుతోంది.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఒక రాట్నం... ఒక మగ్గం మన దేశం రూపురేఖలను మార్చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి మన స్వాతంత్య్ర పోరాటాన్ని గమనిస్తే భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, జాతీయ ఉద్యమాన్ని సంఘటితం చేసిన ఘనత నేతన్నలదేనని గుర్తు చేశారు. మన నేతన్నలు మగ్గాల మీద నేసేది దారాల కలబోత మాత్రమే కాదన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు.
బతుకుదెరువు కోసం..
మన నేత, చేనేత గొప్ప సంస్కృతి, చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు నిదర్శనాలుగా నిల్చాయి. అటువంటి మగ్గాన్ని, చేనేతను వేల సంవత్సరాల నుంచి నమ్ముకుని బతుకుదెరువు కోసం నేతన్నలు అవస్థలు పడటాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతిచోటా గమనిస్తున్నాం. అద్భుతమైన వస్త్రాలను నేసే నేతన్నల జీవితాలు ఎలా ఉన్నాయో నా 3,648 కి.మీ. పాదయాత్రలో చాలాచోట్ల కళ్లారా చూశా. మాట ప్రకారం వారికి తోడుగా నిలుస్తున్నాం.
నేతన్నపై ప్రేమకు నిదర్శనం..
2019లో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని నా పుట్టిన రోజు నాడే తెచ్చాం. నేతన్న మీద నా ప్రేమకు అది నిదర్శనం. క్రమం తప్పకుండా ఏటా రూ.24 వేలు చొప్పున అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ వరుసగా నాలుగో ఏడాదీ అందచేస్తున్నాం. ఈ ఒక్క పథకం కింద ఇప్పటివరకు ఒక్కో నేతన్న కుటుంబానికి రూ.96 వేల మేర ప్రయోజనాన్ని చేకూర్చాం. గత అప్పుల కింద బ్యాంకులు ఈ డబ్బులను జమ చేయకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల ద్వారా జమ చేస్తున్నాం.
నేతన్నలకు మొత్తం సాయం రూ.2,049.43 కోట్లు
ఇవాళ అందించే సాయంతో కలిపితే ఇప్పటివరకూ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు. ఇది కాకుండా నేతన్నలకు సామాజిక ఫించన్ల ద్వారా మరో రూ.880 కోట్లు, ఆప్కో ద్వారా మరో రూ.393.30 కోట్లు చెల్లించాం. ఇలా మూడేళ్లలో నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం ఏకంగా రూ.2,049.43 కోట్లు ఖర్చు చేసింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా గతంలో ఏ ఒక్క ప్రభుత్వమైనా నేతన్నలకు ఇంత అండగా నిలబడిందా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి.
సీఎం వైఎస్ జగన్‌కు నవరత్నాల లోగోతో కూడిన చేనేత వస్త్రాన్ని చూపుతున్న నేతన్న
నేతన్నల కుటుంబాలకు దన్ను
అప్‌గ్రేడ్ మిషన్స్...
ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయంతో మగ్గాలను జాకార్డ్ లిప్టింగ్ మిషన్స్ లాంటి ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం నేతన్నలకు వచ్చింది. తద్వారా కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. సులువుగా మగ్గాన్ని నడుపుతున్నారు. 2018–19లో నెలకి రూ.4,680 మాత్రమే ఉన్న నేతన్నల ఆదాయం వైఎస్సార్ నేతన్న నేస్తం దన్నుతో మగ్గాలు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకు చేరింది.
ఆన్‌లైన్‌తో ప్రపంచానికి పరిచయం..
ఆప్కో వస్త్రాలను మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆన్‌లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేశాం. ఈ కామర్స్ సంస్ధలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకాప్, లూమ్‌ఫోక్స్, మిరావ్, పేటీఎం లాంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుని ఆప్కో ద్వారా వస్త్రాలను మార్కెటింగ్ చేసే స్థాయిని పెంచాం.
మూడేళ్లలో చేసిన మంచి ఇదీ..
శాశ్వత బీసీ కమిషన్...
శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్, బీసీ కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే. మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర నేరుగా అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్కచెల్లెమ్మలకే 75 శాతం పైగా డబ్బులు ఇవ్వగలిగాం.
అధికారంలో..
మొదటి విడత మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిస్తే రెండో విడతలో వారికి 70 శాతం ఇవ్వగలిగాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. శాససనభ స్పీకర్‌గా బీసీ, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ ఉన్నారు. మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ అక్క ఉన్నారు. మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలే. ఎమ్మెల్సీలుగా 32 మందికి అవకాశం కల్పిస్తే వారిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు.
కార్పొరేషన్లలో...
98 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీ ఛైర్మన్ల పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 70 పదవులు దక్కాయి. 648 మండల ప్రజా పరిషత్ పదవుల్లో వైఎస్సార్ సీపీ 637 గెలుచుకుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 66.7 శాతం పదవులు ఇచ్చాం. జడ్పీ ఛైర్మన్లు 13కిగానూ 13 వైఎస్సార్సీపీనే గెల్చుకుంది. వీటిలో 9 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారంటే గతానికి, ఇప్పటికి తేడాను మీరే గమనించండి.
సామాజిక న్యాయం...
చంద్రబాబు పాలనలో ఎలాంటి సామాజిక న్యాయం ఉందో చెప్పేందుకు ఒక్క ఉదాహరణ చాలు. నాడు విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్, కృష్ణా జడ్పీ ఛైర్మన్‌గా గద్దె అనురాధ, కనకదుర్గమ్మ ఆలయం ఛైర్మన్‌గా యలమంచి గౌరంగబాబు ఉన్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇవాళ మన పాలనలో విజయవాడ మేయర్‌గా నా చెల్లి, బీసీ మహిళ భాగ్యలక్ష్మి ఉన్నారు. కృష్టా జడ్పీ ఛైర్మన్‌గా మరో బీసీ చెల్లెమ్మ హారిక ఉన్నారు. దుర్గ గుడి ఛైర్మన్‌గా బీసీ అన్న సోమినాయుడు ఉన్నారు. ఎటు చూసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులే కనిపిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం.
50 శాతం కేటాయిస్తూ చట్టం
నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయిస్తూ ఏకంగా చట్టం చేశాం. అందులోనూ 50 శాతం పదవులు నా అక్కచెల్లెమ్మలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 137 ఛైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో అక్కచెల్లెమ్మలు 50 శాతానికి పైగా కనిపిస్తారు.
నేతన్న నేస్తం సభకు హాజరైన జనసందోహం
అక్కచెల్లెమ్మలకు అండగా..
అక్కచెల్లెమ్మల పేరుతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో శరవేగంగా సాగుతోంది. ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందనుకుంటే అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి పెడుతున్నాం. అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత పథకాలతో తోడుగా నిలిచాం. వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యాదీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెన, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల తో పాటు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలను మారుస్తున్నాం. 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెల్లెమ్మలు, తమ్ముళ్లు 86 శాతం ఉన్నారు.
నేతన్న నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం జగన్
సంతోషించే హృదయాలు కావవి..
► ఇవాళ ఇన్ని మంచి పనులు జరుగుతుంటే జీర్ణించుకోలేని కుట్రదారులు చాలా మంది ఉన్నారు. మంచి జరుగుతున్నప్పుడు సంతోషపడే హృదయాలు కావవి. మంచి జరుగుతుంటే రాళ్లు వేసే కుళ్లు, కుతంత్రాలను మన కళ్లెదుటే చూస్తున్నాం.
► నాకు వాళ్ల మాదిరిగా ఈనాడు సపోర్టు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, టీవీ 5 అండ ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సహాయం ఉండకపోవచ్చు. కానీ వాళ్లకు లేనిది, నాకు ఉన్నది ఒక్కటే.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నాకు తోడున్నాయి.
► కోట్ల మందికి మంచి చేయడానికి దేవుడు ఈ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాడనుకుంటే.. అప్పుడు జనంపై నమ్మకం పెట్టుకుని పరిపాలన చేస్తారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మంచి చేయడానికి వాడుతున్నా. అందుకే నేను చేసిన మంచి మీద నమ్మకం ఉంది. నా నమ్మకం మీమీద ఉంది.
► గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు ముఖ్యమంత్రి పదవిని తన వాళ్ల కోసం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి కోసం వినియోగించారు. రాష్ట్రాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీంతో పాలన సాగించారు.
► ఆ రోజు అప్పులు గమనిస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు (అప్పు శాతం పెరుగుదల) 19 శాతం ఉంటే ఈ రోజు 15 శాతం మాత్రమే ఉంది. అంటే ఆరోజు కన్నా ఇవాళ అప్పులు తక్కువగానే చేస్తున్నాం. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగతున్నాడో ఆలోచన చేయండి. అప్పటికి, ఇప్పటికి తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మార్పు.
నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
రూ.102 కోట్ల పనులకు పచ్చజెండా
నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంత్రి జోగి రమేష్ దాదాపు రూ.102 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనలు అందచేశారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, నీటి సరఫరా, బ్రిడ్జిలు, బీటీ రోడ్ల పనులకు సంబంధించి మొత్తం మంజూరు చేస్తున్నా. ఇంకో శుభవార్త ఏమిటంటే.. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. జిల్లాలో నా తర్వాత కార్యక్రమం బందరు పోర్టుకు శంకుస్ధాపన చేయడమే. అందుకోసం మళ్లీ వస్తా.
నేరుగా ప్రజల వద్దకే
ఈ సందర్భంగా వినతిపత్రాలు అందించేందుకు వచ్చిన వారిని గమనించిన సీఎం జగన్ తన రాజకీయ కార్యదర్శి ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్‌ను నేరుగా వారి వద్దకు పంపి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment