ఇంటింటి ప్రగతి.. సమ్మిళిత అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం జగన్
మళ్లీ జగన్ వస్తేనే భవిష్యత్తు మరింత గొప్పగా మారుతుందని బలంగా నమ్ముతున్న ప్రజలు
సమగ్రాభివృద్ధి దిశగా ఏపీ దూసు కెళ్లాలంటే మళ్లీ జగన్ రావాల్సిందేనని అన్ని చోట్లా బలమైన ఆకాంక్ష
సిద్ధం సభలు.. బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచార సభల్లో అది ప్రస్ఫుటితమైందంటున్న పరిశీలకులు
మరోసారి ‘ఫ్యాన్’కు పట్టం ఖాయమని జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన 22 సర్వేల్లోనూ వెల్లడి
సాక్షి, అమరావతి: గత 59 నెలలుగా సుపరిపాలనతో ఇంటింటి ప్రగతి, సమ్మిళిత అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షాత్కారం చేశారు. సుపరిపాలన.. ఇంటింటి అభివృద్ధి.. సుస్థిరాభివృద్ధి మరింత ఉద్ధృతంగా కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగనే రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీకి మరోసారి అఖండ విజయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టడం.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి సభలకు ప్రజాస్పందన లేకపోవడాన్ని బట్టి వైఎస్సార్‌సీపీ మరోసారి ఘన విజయం సాధించడం తథ్యమని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు. జాతీయ మీడియా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 22కుపైగా సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీ తిరిగి అఖండ విజయం సాధిస్తుందని వెల్లడైంది. సీఎం జగన్ సుపరిపాలనపై సానుకూల పవనాలు ప్రచండంగా వీస్తుండడంతో అనుకూల (పాజిటివ్) ఓటుతో వైఎస్సార్‌సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇంటింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలంటే..
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు తమ జీవనోపాధులను మెరుగుపర్చుకున్నారు. బాబు హయాంలో 2018–19లో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం ఉంటే 2022–23 నాటికి సీఎం జగన్ పాలనలో 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్ వస్తేనే ఇంటింటి భవిష్యత్తు మరింతగా మారుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
సాగు మరింత లాభసాటిగా మారాలంటే..
సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయ రంగాన్ని చక్కదిద్దారు. గ్రామాల్లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకూ రైతన్నలను చేయిపట్టుకుని నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా అందిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, విపత్తుల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్ ముగిసేలోగా రైతులకు పరిహారం అందిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. బాబు హయాంలో వ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 2018–19లో 8.3 శాతంతో దేశంలో 12వ స్థానంలో ఉంటే 2023–24 నాటికి 13 శాతానికి వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. మళ్లీ జగన్ వస్తేనే వ్యవసాయం మరింత లాభసాటిగా మారుతుందని రైతన్నలు, కౌలు రైతులు విశ్వసిస్తున్నారు.
విద్యా ప్రమాణాలు మరింత ఉన్నతంగా మారాలంటే..
ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేసిన సీఎం జగన్ పేదింటి బిడ్డలకు ఇంగ్లీషు మీడియం బోధన అందుబాటులోకి తెచ్చారు. సీబీఎస్‌ఈ సిలబస్ తీసుకొచ్చారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద లాంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సగటు నమోదు నిష్పత్తి రేటు వంద శాతానికి చేరుకుంది. మూడో తరగతి నుంచే విద్యార్థులకు టోఫెల్ శిక్షణ ఇస్తున్నారు. 2025–26 నుంచి ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌తో రాయనున్నారు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ భాగస్వామ్యంతో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను అందిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో చదువులు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన మన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీ పడే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే విద్యా సంస్కరణలు కొనసాగి ఉన్నత విద్యా ప్రమాణాలతో తమ పిల్లల భవిత బాగుంటుందని తల్లితండ్రులు బలంగా భావిస్తున్నారు.
వైద్యరంగంలో సంస్కరణలు కొనసాగాలంటే..
వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సీఎం జగన్ వైద్య సేవలను పేదల చెంతకు చేర్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు పేద, మధ్య తరగతికి అందుతున్నాయి. విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పడ్డాయి. నాడు–నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కొనసాగి నాణ్యమైన వైద్యం ఉచితంగా పేదలకు, మధ్య తరగతికి అందాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.
సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం దూసుకెళ్లాలంటే..
విభజిత ఆంధ్రప్రదేశ్‌ను 2014–19 మధ్య అవినీతి పాలనతో చంద్రబాబు అధోగతి పాలు చేశారు. సీఎం జగన్ అధికారం చేపట్టాక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధి వైపు నడిపించారు. రాష్ట్ర అప్పులు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 21.87 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 12.13 శాతానికి తగ్గింది. దేశ జీడీపీలో మన వాటా చంద్రబాబు హయాంలో 4.47 శాతం ఉండగా సీఎం జగన్ హయాంలో 4.83 శాతానికి పెరిగింది.
దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ చంద్రబాబు హయాంలో 2018–19లో 11 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో 2023–24 నాటికి 16.2 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో అత్యధిక జీఎస్‌డీపీ వాటా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం కావడం గమనార్హం. బాబు హయాంలో ఏపీ 14వ స్థానంలో ఉండేది. ఇక తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,54,031 మాత్రమే ఉంటే 2023–24 నాటికి ఏకంగా రూ.2,19,518కి పెరిగింది. మళ్లీ జగన్ వస్తేనే రాష్ట్రం సుస్థిరాభివృద్ధి వైపు దూసుకెళుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
ఉద్యోగ, ఉపాధి విప్లవం మరింత గొప్పగా కొనసాగాలంటే..
పారదర్శక పారిశ్రామిక విధానంతో సులభతర వాణిజ్యం(ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్)లో సీఎం జగన్ ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. విశాఖలో 2023 మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో రూ.13,08,887 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ 59 నెలల్లో రూ.3,02,085 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఎంఎస్‌ఎంఈలకు పోత్సాహకాలు ఇవ్వడంతో వాటి సంఖ్య 1.9 లక్షల నుంచి 7 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 58.22 లక్షల మంది ఉపాధి పొందారు. మళ్లీ జగన్ వస్తేనే భారీ పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని యువత బలంగా విశ్వసిస్తోంది.
మహాస్వప్నం సాకారం కావాలంటే..
విశాఖపట్నం సమీపంలో రూ.5 వేల కోట్లతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును సీఎం జగన్ నిర్మిస్తున్నారు. ఒకవైపు విదేశీ వర్సిటీల నుంచి ప్రతిష్టాత్మక కోర్సులు పూర్తి చేసిన రాష్ట్ర యువత.. బలమైన గ్రోత్ ఇంజిన్ లాంటి విశాఖ నగరం.. ఐకానిక్ బిల్డింగ్‌లు.. పెద్ద ఎత్తున వచ్చే ఐటీ, ఇతర పరిశ్రమలు.. కోస్తా తీరమంతటా విరాజిల్లేలా ‘బ్లూ’ ఎకానమీని ఆవిష్కరించడానికి సీఎం జగన్ నడుం బిగించారు. మళ్లీ జగన్ వస్తేనే ఆ మహాస్వప్నం సాకారమై రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని సామన్యుల నుంచి మేధావుల వరకూ బలంగా విశ్వసిస్తున్నారు.
రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారాలంటే..
సువిశాలమైన 974 కి.మీ.ల పొడవైన తీర ప్రాంతం రాష్ట్రం సొంతం. తీరం మన బలం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు దాన్ని ఎన్నడూ ఉపయోగించుకోవాలనే ఆలోచన చేయలేదు. సీఎం జగన్ రూ.16,500 కోట్లతో నాలుగు పోర్టులు(కాకినాడ గేట్‌వే, మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం) నిర్మిస్తున్నారు. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పుతున్నారు. ఇవన్నీ పూర్తయితే పోర్టు ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు దిగ్గజాలు క్యూ కట్టడం ఖాయం. రామాయపట్నం పోర్టు వద్ద ఇండోసోల్ పరిశ్రమ అప్పుడే ఉత్పత్తులను ప్రారంభించడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్ వస్తేనే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారుతాయని యువత బలంగా నమ్ముతోంది.
Comments
Please login to add a commentAdd a comment