One Time Settlement Ap House Loans: CM YS Jaganmohan Reddy Comments On Home Loans - Sakshi
Sakshi News home page

సచివాలయాల్లోనే  ‘వన్‌టైం సెటిల్‌మెంట్‌’ 

Published Tue, Sep 21 2021 2:31 AM | Last Updated on Tue, Sep 21 2021 11:09 AM

CM YS Jaganmohan Reddy Comments On Home Loans To Poor People - Sakshi

సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం, పేదల ఇళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

పథకం పేరు.. ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ 
రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి వర్తింపచేసే వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ‘జగనన్న శాశ్వత గృహ హక్కు’ పథకంగా పేరు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చించడంతోపాటు ప్రతిపాదనలను వివరించారు. సెప్టెంబర్‌ 25 నుంచి ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డేటా అప్‌లోడ్‌ చేయనుందని, వివిధ సచివాలయాలకు డేటాను పంపనున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేపడతారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. పథకం అర్హుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. జాబితా ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లించిన వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తామని వెల్లడించారు. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ స్కీంకు మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
విద్యార్థులకు ఇచ్చే బూట్ల నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

కచ్చితంగా ఇళ్ల లే అవుట్ల సందర్శన
పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల కార్యక్రమం పురోగతిపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్‌ అయినట్లు అధికారులు తెలియచేయగా గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి స్వయంగా పరిశీలన, తనిఖీల కోసం కలెక్టర్లు, జేసీలు, మునిసిపల్‌ కమిషనర్లు కచ్చితంగా వారానికో లేఅవుట్‌ను సందర్శించాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ జేసీ, సబ్‌ కలెక్టర్లు వారానికి నాలుగు లే అవుట్లను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

వారానికోసారి మంత్రుల కమిటీ సమీక్ష
సమగ్ర భూ సర్వేపై నియమించిన మంత్రుల కమిటీ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కూడా వారానికోసారి సమీక్షించాలని సీఎం ఆదేశించారు. కమిటీలో గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా నియమించాలని సూచించారు. ఇళ్ల లబ్ధిదారులందరికీ పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్షన్‌ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబర్‌ 25 నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18 వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కాలనీ యూనిట్‌గా మౌలిక వసతులు
పేదల ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, టిడ్కో ఇళ్లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కాలనీ యూనిట్‌గా తీసుకుని మౌలిక సదుపాయాల పనులను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుకల తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామని,  దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయని చెప్పారు. మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలు, ఖర్చులు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌పాండే, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ ఎన్‌.భరత్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.  

జగనన్న విద్యా కానుక కిట్‌ నాణ్యత పరిశీలన
సాక్షి, అమరావతి: జగనన్న విద్యా కానుక కిట్‌లో భాగంగా వచ్చే ఏడాది అందించనున్న స్కూల్‌ బ్యాగ్, బూట్ల నాణ్యతను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బూట్లు, స్కూల్‌ బ్యాగులను ముఖ్యమంత్రికి పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, సీఎం కార్యాలయ అధికారులు చూపించారు.   
వచ్చే ఏడాది జగనన్న విద్యా కానుక కిట్‌లో ఇచ్చే బ్యాగ్‌ నాణ్యతను పరిశీలిస్తున్న సీఎం జగన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement