
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన తొలి విమానం
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 322 మందితో బయలుదేరిన తొలి విమానం
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రం నుంచి పవిత్ర హజ్‌యాత్ర–2024 సోమవారం ప్రారంభమైంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ఉదయం 9.51గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన ఎయిర్‌బస్ ఎ340 ప్రత్యేక విమానంలో 322మంది యాత్రికులు జెడ్డాకు బయలుదేరి వెళ్లారు. తొలుత హజ్ క్యాంపుగా వినియోగించిన గన్నవరం ఈద్గా జామా మసీదు వద్ద తెల్లవారుజామున 3గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)కు యాత్రికులను తీసుకువెళుతున్న బస్సులను జెండా ఊపి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, హజ్ ఆపరేషన్స్ చైర్మన్ కె.హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజ్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి మొత్తం 692 మంది హజ్‌యాత్రకు వెళ్లనున్నట్లు తెలిపారు. తొలి విమానంలో 322మంది వెళుతున్నారని, మిగిలిన యాత్రికులు ఈ నెల 28, 29 తేదీల్లో రెండు ప్రత్యేక విమానాల్లో వెళతారని చెప్పారు. హజ్ యాత్రికులకు ప్రయాణ రాయితీ, సదుపాయాల కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో హజ్ యాత్రికులకు అన్ని సదుపాయాలను కలి్పంచినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి ఎల్.అబ్దుల్ ఖాదర్, హజ్ కమిటీ సభ్యుడు, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ అలీం బాషా, దూదేకుల కార్పొరేషన్ ఎండీ గౌస్ పీర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలి, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొని హజ్‌యాత్ర విజయవంతం కావాలని హాజీలకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment