
వలంటీర్లపై కూటమి సర్కారు కక్షసాధింపు
జూలై ఒకటిన చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వలేదు..
ఆగస్టు 1న జీతాలు ఇస్తారో లేదో తెలియదు
రూ.10 వేలు పెరుగుతాయన్న హామీ అతీగతి లేదు
అగమ్య గోచరంగా వలంటీర్ల పరిస్థితి
నెలన్నర రోజులుగా మంత్రులు, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకునేవారే లేరు..
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీ–జనసేన–బీజేపీ నేతల మాటలకు.. అధికారంలోకి వచ్చాక వారి వైఖరికి ఎక్కడా పొంతన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు.. ప్రభుత్వ తీరు చూస్తుంటే తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని వారు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల ముందు కొందరు రాజీనామాలు చేయగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల 6వేల మంది వలంటీర్లు ఇప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారు.
కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి జూలై ఒకటిన చెల్లించాల్సిన వేతనాలు ఇప్పటికీ అందలేదు. పైగా.. విధులూ చెప్పడంలేదు. స్థానిక ఎమ్మెల్యేల మౌఖిక ఆదేశాలతో డీడీఓలు వలంటీర్ల గౌరవ వేతన బిల్లులు పెట్టడంలేదని వలంటీర్ల సంఘాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి.. జూన్ ఒకటిన వీరు సకాలంలో వేతనాలు అందుకోగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు తర్వాత వీరి ఇక్కట్లు మొదలయ్యాయి. దీంతో జూన్ నెల గౌరవ వేతనాలు ఇప్పటివరకు వలంటీర్లకు అందలేదు. అలాగే, రేపు ఆగస్టు 1న చెల్లించాల్సిన వేతనాలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఎక్కువమంది డీడీఓలు తాత్సారం చేస్తున్నారని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
విధులు అప్పజెప్పని సర్కారు..
మరోవైపు.. కూటమి ప్రభుత్వం అధికారికంగా వలంటీర్లకు ఎలాంటి విధులు కూడా అప్పజెప్పడంలేదని వారంటున్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో పింఛన్ పంపిణీని వీరు ప్రతీనెలా ఠంఛనుగా ఒకటో తేదీ తెల్లవారుజామునే లబి్ధదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించగా.. చంద్రబాబు సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జూలై ఒకటిన వలంటీర్లతో కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఆగస్టు ఒకటిన చేపట్టే పింఛన్ల పంపిణీకీ కూడా ప్రభుత్వం వలంటీర్లను దూరంగా ఉంచబోతోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తమతో దోబూచులాడుతోందని... అలాగే, వలంటీర్ల వ్యవస్థ అవసరమేలేదన్నట్లుగా ఉందని వలంటీర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఐదేళ్లపాటు అన్నింటా వారే..
వాస్తవానికి.. గత ఐదేళ్లలో వలంటీర్ల సేవలు కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం కాలేదు. రాష్ట్రంలో 2019–24 మధ్య ప్రభుత్వం అమలుచేసిన 33 రకాల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతికి, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాల లబ్ధిని నేరుగా లబి్ధదారుల ఇంటివద్దే వలంటీర్లు అందించారు. గ్రామాల్లో ప్రభుత్వాఫీసుల్లో ఎవరికి ఏ పని ఉన్నా వలంటీర్లు వారికి దిక్సూచిగా పనిచేశారు. ప్రభుత్వం ఏ పథకం అమలుచేసినా వీరే ఇంటింటికీ వెళ్లి ఆయా పథకాల గురించి వారికి వివరించి, అర్హులను గుర్తించి, అవి వారికి అందేలా ఎంతో తోడ్పడ్డారు.
కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో వలంటీర్ల సేవలను ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా రెండు విడతల చొప్పున ఫీవర్ సర్వేను విజయవంతంగా పూర్తిచేసి కరోనా నియంత్రణలో కీలక భూమిక పోషించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పింఛన్ల పంపిణీ నుంచి వారిని దూరంపెట్టి ఆ కార్యక్రమానికి వారి అవసరమేలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ఆందోళన బాటలో వలంటీర్లు..
ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇవ్వడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ, ఎన్నికల్లో గెలిచాక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల్లో తమపట్ల స్పష్టమైన వ్యతిరేక భావన కనిపిస్తోందని వలంటీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు పనిచేసిన వలంటీర్లు అందరినీ కొనసాగించడంతో పాటు తమకు జూన్ నెల గౌరవ వేతనం బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. నెలన్నర రోజులుగా మంత్రులు, అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు వలంటీర్ల సంఘ ప్రతినిధులు చెప్పారు.