సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేదిలో దగ్ధమయిన రథం స్థానంలో కొత్త రథం నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. తొలుత తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు కృష్ణదాస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ , ఎమ్మెల్యేలు సతీష్, రాపాక వర ప్రసాదరావు హాజరయ్యారు. రథం నిర్మాణానికి ప్రభుత్వం రూ.95 లక్షలు కేటాయించింది. 1330 ఘనపుటడుగుల బస్తర్ టేకు కలప రథం నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. మూడు నెలల్లో రథం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు సంకల్పించారు.
అచ్చం పాత రథాన్ని పోలినట్టే నూతన రధాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. రోజూ అవసరమైన మేరకు కార్మికులను ఏర్పాటు చేసుకుని నూతన రథాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి కల్లా రధాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై విచారణ జరుగుతోందని.. దోషులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసం కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ లోపు రథం నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment