
విమానాశ్రయం (గన్నవరం): ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విమానం క్యాబిన్ క్రూలో పనిచేస్తున్న ఓ మహిళకు కరోనా లక్షణాలు బయటపడడంతో విషయం బయటకొచ్చింది. ఢిల్లీ నుంచి ఎయిరిండియాకు చెందిన బోయింగ్ ఎ320 విమానం ప్రయాణికులతో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఇక్కడికి వచ్చింది. ఈ విమానం క్యాబిన్ క్రూలో పనిచేస్తున్న ఓ మహిళకు జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
ఈ విషయం తెలుసుకున్న విమానంలో ప్రయాణించిన వారిలో ఆందోళన మొదలైంది. అప్రమత్తమైన ఎయిరిండియా ప్రతినిధులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు క్యాబిన్ క్రూ సిబ్బందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ విమానంలోని ప్రయాణికులను టెర్మినల్ భవనంలోకి పంపించారు. అనంతరం విమానం క్యాబిన్ లోపల పూర్తిస్థాయిలో రెండు సార్లు శానిటైజ్ చేశారు. రాత్రి 8.40 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లవలసిన విమానం సుమారు 2.50 గంటల ఆలస్యంగా అర్ధరాత్రి 11.30 గంటలకు ప్రయాణికులతో బయలుదేరింది.