అమలాపురం టౌన్ : ఇప్పటి వరకూ కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రూ.వేలల్లో డిమాండ్ చేసిన పరిణామాలు చూశాం. అమలాపురం ప్రాంతంలో కొంతమంది మరో అడుగు ముందుకేసి కరోనాతో మృతి చెందిన కుటుంబ సభ్యులతో ఫోన్ల ద్వారా సరికొత్త బేరసారాలకు దిగుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. కరోనాతో ఆస్పత్రుల్లో చనిపోతున్న వారి మృతదేహాలను కుటుంబీకులు, బంధువులు వచ్చి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితులు లేవు. ఈ భయాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని అమలాపురంలో కొందరు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కో మృతదేహానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ డిమాండ్ చేస్తున్న సంఘటనలు ‘సాక్షి’ దృష్టికి వచ్చాయి.
ఆసుపత్రి వద్దే నిఘా...
అమలాపురం కోవిడ్ ఆస్పత్రుల్లో ఎవరైనా మృతి చెందితే చాలు...ఆ సమాచారం కోసం అంత్యక్రియలు చేసేవారు ఆ ఆస్పత్రుల వద్ద కాచుకుని కూర్చుంటున్నారు. సీరియస్‌గా ఉండే కోవిడ్ బాధితుల కుటుంబీకుల ఫోన్ నంబర్లు ముందుగానే సేకరించి మరీ ఫోన్లు చేసి బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. అంత్యక్రియలు మీరు దగ్గరుండి చూసే అవకాశం లేదు కాబట్టి మృతుని అంత్యక్రియలను వీడియో తీసి ఆ తృప్తిని మీకు అందిస్తాం ... అందుకు రూ.10 వేలు ఖర్చవుతుంద’ని బేరసారాలకు దిగుతున్నారు. మృతదేహానికి సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన ప్రక్రియంతా శాస్త్రోక్తంగా శ్మశానంలో పూర్తి చేస్తాం...ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందంటూ లిస్టు రాసి ఇచ్చేస్తున్నారు.
వామ్మో... వదిలించుకోవడం ఎలా...
అమలాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పట్టణంలోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో మృతి చెందారు. మరణించిన పది నిమిషాలకు ఈ తరహా ఫోన్లు మొదలయ్యాయి. మరణించిన వ్యక్తికి ముగ్గురు కుమారులు. ఓ కుమారుడు ఉన్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటారు. తండ్రి మరణించాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అమలాపురం రాలేకపోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న ఆయనకు కూడా పదేపదే ఫోన్లు చేసి ‘వీడియో తీస్తా’మంటూ విసిగించడంతో ఆ బాధితుడు మీడియాకు సమాచారం అందించాడు. ఇక్కడ ఉన్న ఇద్దరు కుమారులకు కూడా సెంటిమెంట్ మాటలతో వీడియో...శాస్త్రోక్త పక్రియలంటూ ఫోన్లు చేసి ప్యాకేజీలంటూ వెంటపడ్డారు. ఇలాంటి అనుభవాలు గత రెండు వారాలుగా అమలాపురంలో మొదలయ్యాయని పలు బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంత్యక్రియలకు రూ.వేలు గుంజుతున్న వైనంపై ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాజు దృష్టి సారించారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ ఫోన్ల బేరసారాలపై కూడా ఆయన దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కరోనా మృతుల అంత్యక్రియలు చూస్తారా
Published Tue, Sep 22 2020 9:05 AM | Last Updated on Tue, Sep 22 2020 11:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment