సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విహార ప్రపంచానికి విశాఖ నగరం స్వాగతం పలుకుతోంది. పర్యాటక రంగంలో అద్భుతమైన క్రూయిజ్ సేవలకు భారీ క్రూయిజ్ నౌక వస్తోంది. సాగర జలాల్లో మూడు రోజులు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు సకల సౌకర్యాలతో 11 అంతస్తుల క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ విశాఖకు రాబోతోంది. జూన్ 8వ తేదీన తొలి సర్వీస్ మొదలవుతుంది. ఈ నౌక వైజాగ్ నుంచి పుదుచ్చేరి, చెన్నై మీదుగా తిరిగి వైజాగ్ చేరుకుంటుంది. ఈ క్రూయిజ్ షిప్ నిర్వహణకు జేఎం భక్షి సంస్థకు విశాఖపట్నం పోర్టు అధికారులు అనుమతులు ఇచ్చారు.
పాస్‌పోర్ట్ అవసరం లేదు
ఎంప్రెస్ విదేశీ విహార నౌక అయినప్పటికీ భారత్‌లో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. ఈ కారణంగా షిప్ ఎక్కాలంటే పాస్‌పోర్ట్ అవసరం లేదు. కస్టమ్స్ తనిఖీలు ఉండవు. గతంలో వైజాగ్‌కు ఒకట్రెండు క్రూయిజ్ షిప్‌లు ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్లాయి. అవి రెగ్యులర్ సర్వీసులు కావు. ఎంప్రెస్ మాత్రం ప్రస్తుతం రెగ్యులర్ సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది. డిమాండ్‌ను బట్టి సర్వీసులు కొనసాగించాలా వద్దా అన్నది ఆలోచిస్తారు.
షిప్‌లో స్విమ్మింగ్ పూల్
ఎంప్రెస్‌లో విహరించాలనుకునే పర్యాటకులకు వివిధ సర్వీసులు, ప్యాకేజీలు ఉంటాయి. పర్యాటకులు ఎంచుకునే సర్వీస్, ప్యాకేజీల ప్రకారం చార్జీలు నిర్ణయించారు. ప్రస్తుతం విశాఖ – చెన్నై టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీలో ముగ్గురు ప్రయాణించాలంటే మొదటి ఇద్దరికీ ఒకే విధమైన టికెట్ ధర ఉంటుంది. మూడో వ్యక్తికి కాస్త తగ్గుతుంది. జీఎస్‌టీ అదనంగా వసూలు చేస్తారు. ఈ క్రూయిజ్‌లో 796 క్యాబిన్లున్నాయి. 313 ఇన్‌సైడ్ స్టేట్ రూమ్స్, 414 ఓషన్ వ్యూ రూమ్స్, 63 బాల్కనీ రూమ్స్, 5 సూట్ రూమ్‌లతో పాటు ఒక లగ్జరీ సూట్ రూమ్ ఉంటుంది.
11 అంతస్తులు.. 1,840 మంది ప్రయాణికులు
ఎంప్రెస్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. మొత్తం 11 అంతస్తులున్న ఈ భారీ నౌకలో ఒకేసారి 1,840 మంది ప్రయాణించవచ్చు. ఇందులో ఫుడ్ కోర్టులు, 3 స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ బ్యాండ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్ మాల్స్, లైవ్‌షోలు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఫన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న అందరికీ షిప్‌లోని క్యాసినో వరల్డ్‌కు ఎంట్రీ ఉచితం. లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు చార్జీలు ఉంటాయి.
షిప్‌లో సూట్ రూమ్
జూన్ 8న విశాఖకు రాక
వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులతో జూన్ 8వ తేదీన ఎంప్రెస్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంటుంది. ఆరోజు నౌకలో వచ్చిన వారికి నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు, సందర్శనీయ స్థలాలను చూపిస్తారు. అదే రోజు రాత్రి 8 గంటలకు కొత్త పర్యాటకులతో విశాఖ పోర్టు నుంచి బయల్దేరుతుంది. జూన్ 10 వ తేదీ ఉదయం 7 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. 10వ తేదీ రాత్రి 7 గంటలకు బయల్దేరి 12వ తేదీన చెన్నైకి చేరుకుంటుంది.
13వ తేదీ ఉదయం చెన్నైలో బయల్దేరి 15వ తేదీన తిరిగి విశాఖ చేరుకుంటుంది. మళ్లీ 15వ తేదీన విశాఖ నుంచి బయల్దేరుతుంది. అదే విధంగా 22వ తేదీన కూడా విశాఖ నుంచి సర్వీసు నడిపేలా టూర్ ప్లాన్ సిద్ధం చేశారు. విశాఖ నుంచి చెన్నై వరకు ఒకవైపు టిక్కెట్ ఇస్తారు. చెన్నై నుంచి నౌకలోనే తిరిగి రావాలనుకొనేవారికి అదనపు చార్జీలు వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment