
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రాథమిక పరీక్షపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు కొన్ని వ్యాజ్యాల్లో తీర్పును వాయిదా వేసింది. మరికొన్ని వ్యాజ్యాలపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దసరా సెలవులకు ముందే ఈ వ్యాజ్యాల్లో నిర్ణయాన్ని వెలువరిస్తానని స్పష్టం చేశారు. 169 గ్రూప్–1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ 2019లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఇందులో 51 తప్పులు దొర్లాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
తెలుగు అనువాదంలో తప్పులున్నాయని తెలిపారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి పరీక్ష ఫలితాలపై తొలుత స్టే విధించి, సర్వీస్ కమిషన్ కౌంటర్‌ను పరిశీలించి స్టేను ఎత్తివేశారు. స్టే ఎత్తివేతపై అభ్యర్థులు అప్పీల్ చేశారు. అప్పీల్‌ను విచారించిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మొత్తం వ్యవహారంపై సింగిల్ జడ్జే విచారణ జరపడం మేలని పేర్కొంది. దీంతో ఈ వ్యాజ్యాలపై సోమవారం జస్టిస్ రఘునందన్‌రావు విచారణ జరిపారు. ఏపీపీఎస్సీ న్యాయవాది మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ 25 ప్రశ్నలకు కీలో తప్పులు దొర్లినందున ఆ ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోవడంలేదని, తెలుగు అనువాదంలో తప్పుంటే, ఇంగ్లిష్‌లో ఉన్న ప్రశ్న ఆధారంగా సమాధానం ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. తర్వాత విచారణ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment