‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదల సంక్షేమ రాజ్యం వచ్చింది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో పేద, బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమం అందుతోంది. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని అనకాపల్లి జిల్లా మాడుగుల సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు.
సాక్షి, అనకాపల్లి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదల సంక్షేమ రాజ్యం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం అనకాపల్లి జిల్లా మాడుగుల వద్ద జరిగిన బహిరంగ సభలో వేలాది ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం మరే రాష్ట్రంలోనూ అందడంలేదని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.
ఇందులో మూడింట రెండు వంతులు బడుగు, బలహీన వర్గాలకే అందుతున్నాయని తెలిపారు. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకే సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని, దీనివల్ల సామాజిక సాధికారత సాధ్యమైందని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు. జనవరి ఒకటి నుంచి ప్రభుత్వం సామాజిక పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతున్నారని చెప్పారు.
రెండు వేళ్లు చూపించే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలకు వృద్ధులు ఇకపై మూడు వేళ్లు చూపించాలని అన్నారు. పేదల ఉన్నతి కోసం సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే అలీబాబా 40 దొంగలు హేళన చేశారని, చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి మనవళ్లు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదవచ్చా అని నిలదీశారు. ఇదీ పేదలపై వారికి ఉన్న ప్రేమ అని అన్నారు.
సీఎం జగన్ పాలనలో నేరుగా లబ్ధి: డిప్యూటీ సీఎం రాజన్నదొర
చంద్రబాబు పాలనలో పేదల కోసం అరకొరగా ఖర్చు చేశారని, అందులోనూ అధికభాగం టీడీపీ నేతలే తినేసేవారని, సీఎం జగన్ పాలనలో ప్రతి పేదవాడికి నేతలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధి జరుగుతోందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చెప్పారు. బడుగు, బలహీనవర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఇంతలా అభివృద్ధి చెందుతున్నారంటే అందుకు జగనన్న సంక్షేమ పాలనే కారణమని తెలిపారు. టీడీపీ హయాంలో పేదలకు ఖర్చు చేసిన దానికి మూడు రెట్లు సీఎం జగన్ వెచ్చిస్తున్నారని చెప్పారు. గతంలో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ మన ముందుకు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
అవినీతి రహిత సంక్షేమ పాలన: మంత్రి ధర్మాన
రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం సీఎం జగన్‌తోనే సాధ్యమైందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రోడ్ వేస్తేనో, బిల్డింగ్ కడితేనో అభివృద్ధి కాదని, పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలని, సీఎం జగన్ ఇదే చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ పథకాలను హేళన చేసిన చంద్రబాబే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని అంటున్నారన్నారు.
సమాజాభివృద్ధికి విద్య ఎంత అవసరమో సీఎం జగన్‌కు తెలుసునని, అందుకే ప్రతి పేద పిల్లవాడికి యూనిఫారం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు ప్రజల సొమ్ము వారి ఖాతాల్లో వేసుకున్నారని, సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక పథకాల సొమ్ము ప్రజల ఖాతాల్లో వేస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ తేడా ప్రజలు గమనించాలని కోరారు.
అవినీతి జరిగిందని చంద్రబాబు కూడా ఏనాడూ అసెంబ్లీలో ప్రశ్నించలేకపోవడమే వైఎస్ జగన్ స్వచ్ఛమైన పాలనకు నిదర్శనమని చెప్పారు. దొంగ కంపెనీలు క్రియేట్ చేసి స్కిల్ పేరిట అవినీతి చేసి జైలు పాలైన చంద్రబాబు తప్పు చేయలేదంటే ఎవరు నమ్ముతారన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
మీ మనవడు ఈ విషయం అడగలేదా?: మంత్రి గుడివాడ
‘స్కిల్ కుంభకోణంలో అడ్డంగా దొరికి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లిన చంద్రబాబు మనవడు తాతేడని అడిగితే విదేశాలకు వెళ్లారని చెప్పామని బాబు సతీమణి భువనేశ్వరి ఇటీవల ఒక సభలో చెప్పారు. మరి తాత విడుదలైనప్పుడు అదే మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తీసుకెళ్లారు. విదేశాలకు వెళ్లిన తాత ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రావాలి కదా.. జైలు నుంచి ఎందుకు వచ్చావు తాతా అని మనవడు అడగలేదా’ అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సభలో చమత్కరించారు. చంద్రబాబుకు ఇటీవల జనసేన అనే ఒక ఖరీదైన చేతికర్ర దొరికిందన్నారు. ఎన్ని కోట్లు పెట్టినా ప్రజల అభిమానాన్ని మాత్రం వారు కొనలేరని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment