అవి శతాబ్దాల మన చరితకు చిహ్నాలు. తరతరాల నుంచి వారసత్వంగా వస్తున్న వెలకట్టలేని పురాతన వస్తువులు. వీటిని పరిరక్షిస్తూ భావితరాలకు అందించడం మన బాధ్యత. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పురాతన వస్తువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంకి పరిమితమైన మన వాటా వారసత్వ సంపద సైతం సీఎం వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి చేరుకుంటోంది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. సాంకేతిక సొబగులద్దుకుని సందర్శకులను ఆకట్టుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో దశల వారీగా మ్యూజియంలను అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడలోని బాపూ మ్యూజియంను విద్య, విజ్ఞాన సందర్శనాలయంగా తీర్చిదిద్దారు. 2020 అక్టోబర్ 2వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ఈ మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఏలూరు, అనంతపురంలోని జిల్లా మ్యూజియంలకు నూతన భవన నిర్మాణాలు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ మ్యూజియాలను అధునాతనంగా మార్చారు. మరో రూ.70 కోట్ల ప్రతిపాదనలతో ఏడు మ్యూజియంలకు కొత్త భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మైలవరం(కడప), కాకినాడ, గుంటూరు, కర్నూలు, పెనుకొండ, కడప, రాజమహేంద్రవరం మ్యూజియంలకు కూడా సాంకేతిక హంగులు అద్దనుంది.
మన సంపద వెనక్కి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి దక్కాల్సిన వేల ఏళ్లనాటి చారిత్రక, వారసత్వ సంపదను తీసుకురావడంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అప్పటి స్టేట్ మ్యూజియంలోని సుమారు 56వేలకు పైగా పురాతన వస్తువులు, నాణేలు, చిత్రపటాలు పదేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. ఈ క్రమంలో సీఎం జగన్ చొరవతో ఏపీ పురావస్తు శాఖ అధికారులు పలు దఫాలుగా తెలంగాణ అధికారులతో చర్చలు జరిపి చివరికి పురాతన వస్తువుల విభజన ప్రక్రియను ముగించారు. త్వరలో వాటిని ఏపీకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పురావస్తు సంపద పరిరక్షణకు పెద్దపీట
విభజన తరువాత రాష్ట్రానికి స్టేట్ మ్యూజియం అంటూ ఏదీ లేదు. ఈ నేపథ్యంలో అతిపెద్ద స్టేట్ మ్యూజియంను నిర్మించేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు రాజమహేంద్రవరం నగరాన్ని ‘హెరిటేజ్ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు రూ.400 కోట్ల ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేసింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లతో టాయ్ మ్యూజియం నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. పురావస్తుశాఖ ఆధ్వర్యంలోని లక్షలాది శాసనాలు, ఎస్టేం పేజీలు (శాసనాల కాపీలు)పరిరక్షణకు ప్రత్యేకంగా ‘శాసన మ్యూజియం’ను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. దీనిద్వారా ఇప్పటి వరకు లభ్యమైన శాసనాల వివరాలను ఒకే వేదికపైకి తీసుకురానుంది.
దక్షిణాదిలో తొలిసారిగా..
స్మారక, సందర్శనీయ స్థలాల అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బాపూ మ్యూజియం, కొండపల్లి కోటలో అగుమెంట్ రియాలిటీ, డిజిటల్ వాల్ ప్యానల్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్‌ప్లే, కియోస్‌్కలు, వర్చువల్ రియాల్టీ, లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్, డిజిటల్ వాల్‌బుక్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా భవనాలు నిర్మించిన ఏలూరు, అనంతపురం మ్యూజియాల్లో కూడా అమలుచేయనున్నారు.
గణనీయమైన పురోగతి
ప్రజా సంక్షేమంతో పాటు మన వారసత్వ సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యతను సీఎం జగన్ చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో మ్యూజియంలు గణనీయమైన పురోగతిని సాధించాయి. ప్రపంచ స్థాయి ఏఆర్, వీఆర్ టెక్నాలజీలను ప్రవేశపెట్టాం. తద్వారా సందర్శకులకు అర్థవంతమైన భాషలో, సరళంగా వారసత్వ చరిత్ర తెలుస్తోంది. మ్యూజియంల అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తాం. త్వరలోనే స్టేట్ మ్యూజియంను కూడా నిర్మిస్తాం. – ఆర్కే రోజా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసుల శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment