
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేసి.. ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన కేసులో నిందితుడైన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండో రోజు విచారణలోనూ దాటవేత ధోరణే అవలంభించారు. మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఉదయం 11గంటలకు వచ్చిన ఉమను రాత్రి 8 గంటల వరకు విచారించారు. సీఎం వైఎస్ జగన్ వీడియో మార్ఫింగ్‌పై కీలక సమాచారం రాబట్టేందుకు సీఐడీ ప్రయత్నం చేసింది.
తొలి రోజు విచారణలో దాటవేసిన సమాధానాలను రాబట్టేందుకు అవే ప్రశ్నలను రెండో రోజు కూడా సీఐడీ అధికారులు సంధించారు. అయినప్పటికీ తన ఫోన్‌కు సంబంధించిన సమాచారం, మార్ఫింగ్ వీడియో ప్రదర్శించిన ట్యాబ్, తగిన ఆధారాలపై ఉమ స్పష్టత ఇవ్వలేదని సమాచారం. దీంతో ఈ నెల 4వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు ఉమకు నోటీసు ఇచ్చారు.
అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి తేలుస్తాం..ఉమ
టీడీపీ అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి తేలుస్తామని, తమను ఇబ్బంది పెట్టిన పోలీసులను గుర్తుపెట్టుకుని మరీ ఛత్తీస్‌గఢ్, ఒడిశా బోర్డర్‌కు పంపిస్తామని మాజీ మంత్రి ఉమ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. సీఐడీ విచారణకు ముందు, అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ పోలీసులను టార్గెట్ చేసి హెచ్చరికలు చేశారు. కేసులకు భయపడేది లేదని, రాజమండ్రి జైల్లో ఉండడానికైనా తాను సిద్ధమన్నారు.