
సాక్షి, తిరుపతి: గోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. సాయంత్రం కురిసిన గాలి వానకు ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న పురాతన రావి చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఒక భక్తుడు మృతి చెందగా, ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్పగా పోలీసులు గుర్తించారు. టీటీడీ ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. వందల ఏళ్ల నాటి రావి చెట్టుగా స్థానికులు చెబుతున్నారు.
స్వామివారి ఉత్సవాలకు సిద్ధం చేసిన గజరాజు అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పింది. చెట్టు కూలిపోవడానికి ముందుగానే పసిగట్టిన గజరాజు ఘీంకరించడంతో అప్రమత్తమై పరుగులు తీశామని భక్తులు అంటున్నారు.
మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
సంఘటన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. మృతుడు గుర్రప్ప కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి టీటీడీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.